Investments: గ్రామీణ ప్రజలు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నారు?

గ్రామీణ భారతంలోని పౌరులకు పొదుపుపై ఉండే కనీస అవగాహన, బీమా లాంటి విషయాలపై ఉండడం లేదు. వీరు ఎలాంటి పొదుపు పథకాలలో మదుపు చేస్తున్నారో ఇక్కడ చూడండి.

Published : 28 Mar 2023 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ దేశంలోనైనా పౌరులకు అక్షరాస్యతతో పాటు ఆర్థిక అక్షరాస్యత కూడా ముఖ్యమే. జీవితంలో తగిన భరోసాకు ఈ ఆర్థిక అక్షరాస్యత కీలకమైన పాత్ర పోషిస్తుంది. గ్రామీణ భారతంలో పౌరుల్లో దాదాపు సగం మంది సురక్షితమైన పొదుపు సాధనాల్లోనే తమ పెట్టుబడులను పెడుతున్నారని ఒక సర్వేలో తేలింది.  అదే సమయంలో బీమా విషయంలో మాత్రం వారిలో అవగాహన అంతమాత్రంగానే ఉందని మ్యాక్స్‌ లైఫ్‌ నిర్వహించిన ‘‘ఇండియా ప్రొటెక్షన్‌ కోషంట్ 5.0’’ సర్వే వెల్లడించింది.

సురక్షితమయితేనే..

గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది PMJJBY, సరల్‌ జీవన్‌, పెన్షన్‌ యోజన, రైతు బీమా మొదలైన ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములుగా ఉంటున్నారు. వీటి తర్వాత బంగారం, బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు (RD), చిన్న స్థాయిలో భూ కొనుగోళ్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(PPF) లాంటి పొదుపు సాధనాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వీటినే కీలకమైన ఆర్థిక సాధనాలుగా వారు భావిస్తున్నారు. దేశంలో దాదాపు 50% మంది ప్రజలు సురక్షితమైన ఉత్పత్తులలో మాత్రమే పొదుపు చేయాలనుకుంటున్నారని సర్వే తెలిపింది.

విద్య, వివాహం

భారత్‌లోని గ్రామీణ జనాభాలో 64% మంది తమ పిల్లల చదువుల కోసం పొదుపు చేయాలనే ఆసక్తిని ప్రదర్శించడం విశేషం. అయితే, 41% మంది పిల్లల వివాహానికి పొదుపు అవసరమన్నారు. పొదుపు చేయడానికి గ్రామీణ పౌరులెవ్వరూ ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలను ఆశ్రయించడం లేదు. గ్రామీణ పొదుపులను సమీకరించడంలో ప్రభుత్వ పథకాలు సింహభాగం ఆక్రమించాయని సర్వే తెలిపింది. తమ పొదుపులో బంగారంపై 15% పెట్టుబడిని పెడుతున్నారు. దాని తర్వాత FD/RDల్లో 12%, ఆస్తి కొనుగోళ్లపై 9%గా పెట్టుబడి ఉంటుంది. PPF లాంటి ప్రముఖ పొదుపు పథకంలో కూడా కేవలం 3% మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. పిల్లల విద్య, వివాహం కోసం పొదుపు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

అవగాహన

113 గ్రామాలలో నిర్వహించిన ఈ సర్వేలో 54% మంది బంగారాన్ని పొదుపు సాధనంగా గుర్తిస్తున్నారు. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌(RD)లపై 42% మంది అవగాహన కలిగి ఉన్నారు, 21% పౌరులు ‘PPF’ పొదుపు సాధనంగా తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలపై అత్యధికంగా 83% మంది ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు. అయితే, చాలా ప్రభుత్వ పథకాలపై సబ్సిడీలు ఉండడం కూడా బలమైన కారణం కావచ్చు.

బీమా

ఇంకా దేశ గ్రామీణ ప్రాంతాల్లో 78% మందికి జీవిత బీమా సౌకర్యం లేదు. కేవలం 22% మందే ఈ బీమాను కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రజల్లో ప్రతి పది మందిలో నలుగురు జీవిత బీమా కొనుగోలు గురించి అసలు ఆలోచించడమే లేదు. మరోవైపు ముగ్గురిలో ఒకరు జీవిత బీమా కొనుగోలులో ‘అధిక ప్రీమియంలు’ ఒక ముఖ్యమైన అవరోధంగా పేర్కొన్నారు. 41% మంది తమ జీవితాలకు బీమా చేయడానికి తగినంత డబ్బు లేదని చివరిగా పేర్కొన్నారు. 

ప్రాథమిక ఖర్చులు

గ్రామీణ భారతదేశంలోని ప్రజలు తమ ఆదాయంలో ప్రధాన భాగాన్ని ప్రాథమిక ఖర్చులకే ఖర్చు చేస్తున్నారు. ఇతర విచక్షణపరమైన ఖర్చులకు అతితక్కువ కేటాయింపులు ఉన్నాయని సర్వే కనుగొంది. గ్రామీణ భారతీయులు తమ సంపాదనలో 55% రోజువారీ ప్రాథమిక ఖర్చులకు మళ్లించగా, పట్టణ ప్రజలు 42% మాత్రమే ప్రాథమిక ఖర్చులకు కేటాయిస్తున్నారు.

చివరిగా: గ్రామీణ ప్రజలు పెట్టుబడుల విషయంలో ఇంకా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం, వారి సంపాదన తక్కువగా ఉండడం. ఈ కారణం చేత ఉన్న నిధులనే సురక్షిత పథకాల వైపు మళ్లిస్తున్నారని కూడా చెప్పొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు