సిప్‌ను పెంచడం ద్వారా అధిక రాబ‌డి పొందొచ్చు

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల వ‌ద్ద మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసేట‌పుడు ప్ర‌తీ నెలా చేయాల‌నుకుంటున్న‌పెట్టుబ‌డి, న‌గ‌దు బ‌దిలీ అయ్యే తేదీ త‌దిత‌ర వివ‌రాల‌ను అందించాలి.​​​​​​....​

Published : 19 Dec 2020 17:04 IST

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల వ‌ద్ద మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసేట‌పుడు ప్ర‌తీ నెలా చేయాల‌నుకుంటున్న‌పెట్టుబ‌డి, న‌గ‌దు బ‌దిలీ అయ్యే తేదీ త‌దిత‌ర వివ‌రాల‌ను అందించాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్‌) ప‌ద్ధ‌తి గురించి చాలామందికి తెలుసు. ఈ విధానంతో ప్ర‌తీనెలా మ‌దుప‌రి నిర్ణ‌యించిన ప్ర‌కారం కొంత మొత్తం మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసేందుకు వీల‌వుతుంది. దీర్ఘ‌కాలంలో చూస్తే స్థిరంగా ఒకే మొత్తం సిప్‌ పెట్టుబ‌డి కొన‌సాగించ‌డం కంటే మ‌ధ్య‌లో కొంత‌కొంత‌ పెంచుతూ వెళ్తే వ‌చ్చే ప్ర‌తిఫ‌లం ఎక్కువ‌గా ఉంటుంది. దీనికి మ‌దుప‌ర్లు స్టెప్ అప్ సిప్ ను ఎంచుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 20 ఏళ్ల పాటు ఒక మ‌దుప‌రి రూ. 5,000 చొప్పున ప్రతీ నెల సిప్ విధానంలో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేశార‌నుకుందాం. అన్నిసంవ‌త్స‌రాలు నెల‌కు ఒకే మొత్తం క్ర‌మానుగ‌తంగా ఫండ్ల‌లోకి పెట్టుబ‌డిగా వెళ్తుంది. అదే స్టెప్ అప్ సిప్ అనేది మ‌దుప‌ర్లు చేసే సిప్ లో ఏడాదికోసారి లేదా ఆరునెల‌ల‌కోసారి పెంచే అవ‌కాశం ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల పై వ‌చ్చే స‌గ‌టు రాబ‌డి 12 శాతం అనుకుందాం. అప్పుడు 20 ఏళ్ల‌కు నెల‌కు రూ. 5వేలు చొప్పున మ‌దుపుచేస్తే అంతిమంగా ఆ మ‌దుప‌రికి ల‌భించేంది రూ. 49.46 ల‌క్ష‌లు. అదే పైన చెప్పిన స్టెప్ అప్ సిప్ ద్వారా ఏడాదికి పెరిగిన జీతానికి అనుగుణంగా మ‌దుప‌రి 10 శాతం చొప్పున పెంచుతూ వెళ్లార‌నుకుందాం. ఆ మ‌దుప‌రికి 20 ఏళ్ల త‌ర్వాత ల‌భించే మొత్తం రూ. 98.45 ల‌క్ష‌లు, అంటే రెండింటికి మ‌ధ్య తేడా మొత్తం రూ. 48.99 ల‌క్ష‌లు . దాదాపు రెట్టింపు ల‌భిస్తుంది. క్ర‌మంగా సిప్ పెంచ‌డం మూలంగా అంతిమ ఫ‌లితాన్ని భారీగా పెంచుతుంది.

ప్ర‌స్తుతం దాదాపు అన్ని మ్యూచువ‌ల్ ఫండ్లు ఈ స్టెప్ అప్ సిప్ విధానాన్ని అందిస్తున్నాయి. ఈ విష‌యంలో మీ ఆర్థిక స‌ల‌హాదారుని సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది. సాధార‌ణంగా మ‌దుప‌ర్లు ప‌థ‌కంలో చేరేట‌పుడే సిప్ విధానంలో ఎంత మొత్తం పెంచుతూ వెళ్లాల‌నుకుంటున్నారో మ్యూచువ‌ల్ ఫండ్ల సంస్థ‌లు తెల‌పాల్సిందిగా కోరుతాయి. ప్ర‌తీ ఏడాది సిప్ మొత్తం పెంచుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక‌టి అదే ఫండ్‌లో ఎంత మొత్తం పెంచాల‌నుకుంటున్నారో తెలియ‌చేయ‌డం. రెండోది కొత్త సిప్ ను తీసుకోవ‌డం. ఈ రెండు ప‌ద్ధ‌తుల్లోనూ అదే ఫండ్లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. నెల‌నెలా ఎంత మొత్తం ఎక్కువ‌గా మ‌దుపు చేయాల‌నుకుంటే అంత ఆ పథకంలో లేదా వేరొక ప‌థ‌కంలో అదే ఫోలియోతో పెట్టుబ‌డి చేయవచ్చు.

స్టెప్ అప్ విధానంలో పెట్టుబ‌డి చేసేట‌పుడు మ‌దుప‌ర్లు త‌ప్ప‌కుండా బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు వివ‌రాలు తెలియ‌చేయాలి. ఒక సారి రిజిస్ట్ర‌ర్ అయితే ప్ర‌తీ నెలా ఆ ఖాతా నుంచి డ‌బ్బు మ్యూచువ‌ల్ ఫండ్ లోకి వెళ్తుంది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఏర్పాటుచేసిన‌ నేష‌న‌ల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) ద్వారా మ‌దుప‌రి కావాల‌నుకుంటే భ‌విష్య‌త్తులో చేయ‌బోయే పెట్టుబ‌డుల‌కు సంబంధించి సిప్ మొత్తం, కాల‌ప‌రిమితి త‌దిత‌ర మార్పులు చేర్పులు చేసేందుకు అవ‌కాశం ల‌భిస్తోంది. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల వ‌ద్ద మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసేట‌పుడు ప్రారంభ తేదీ, ప్ర‌తీ నెలా చేయాల‌నుకుంటున్న‌ పెట్టుబ‌డి, న‌గ‌దు బ‌దిలీ అయ్యే తేదీ, ముగింపు తేదీ త‌దిత‌ర వివ‌రాల‌ను అందించాలి. కొన్ని ఫండ్లు ఆరు నెల‌ల‌కోసారి సిప్ మొత్తాన్ని పెంచేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. స్టెప్ అప్ సిప్‌తో మ‌దుప‌ర్లు ప్ర‌తీ నెలా చేసే పెట్టుబ‌డిని ఏడాదికోసారి సవ‌రిస్తూ కొంచెంగా పెంచుకుంటూ వెళ్లొచ్చు.

మ‌దుప‌ర్లు ముందు ఎంత మొత్తాన్ని సిప్ ద్వారా పెంచాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించుకోవాలి. భ‌విష్య‌త్తులో పెరిగే సిప్ ను చెల్లించేందుకు వీలుప‌డ‌దు అనుకుంటే గ‌రిష్ఠ ప‌రిమితిని నిర్ణ‌యించుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌తీ ఏడాది 5 శాతం చొప్పున సిప్‌ల‌లో వృద్ధి ని చేయాల‌నుకుంటున్నారు అనుకుందాం. మ‌దుప‌రి నిర్ణ‌యించిన గ‌రిష్ఠ ప‌రిమితి చేరిన‌ట్ల‌యితే సిప్ లో పెరుగుద‌ల ర‌ద్ద‌వుతుంది. గ‌రిష్టంగా ఎంత మొత్తం సిప్ ఉంటుందో అదే మొత్తం మిగిలిన కాలానికి చెల్లించాల్సి ఉంటుంది. త‌ద్వారా మ‌దుప‌ర్లు త‌మ‌కు అనుకూలంగా ఎంత‌నుకుంటే అంత మొత్తాన్ని పెంచుకునే అవ‌కాశం స్టెప్ అప్ సిప్ విధానంతో అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని