మ్యూచువ‌ల్ ఫండ్ల మ‌దుప‌ర్లు తెలుసుకోవాల్సిన అంశాలు

ఈక్విటీఫండ్ల లో మ‌దుపు చేయాల‌నుకునే మ‌దుప‌ర్లు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు.......

Published : 24 Dec 2020 17:16 IST

ఈక్విటీఫండ్ల లో మ‌దుపు చేయాల‌నుకునే మ‌దుప‌ర్లు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు.

మ్యూచువల్ ఫండ్ ఎంపిక మ‌దుప‌ర్ల న‌ష్ట‌భ‌యం, ఆర్ధిక లక్ష్యాలను చేరుకోగ‌ల‌ సామర్ధ్యం కలిగి ఉండాలి. న‌ష్ట‌భ‌యం రాబ‌డి అంచ‌నా ప్ర‌కారం మ‌దుప‌ర్లు త‌మ‌కు అనువుగా ఉండే ఫండ్ల‌ను ఎంచుకోవాలి. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి చేసే చిన్న మ‌దుప‌ర్లు ఎక్కువ‌గా మ్యూచ్యువల్ ఫండ్ల‌ ద్వారా చేస్తుంటారు. మార్కెట్లో నెల‌కొన్న అస్థిర‌త వారు పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌పై ఉంటుంద‌ని తెలుసుకోవాలి. అయితే ఇది ఎంత మేర‌కు అనేది ఆయా ఫండ్ల పెట్టుబ‌డి కేటాయింపుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌దుప‌ర్లు త‌క్కువ అస్థిత‌ర ఉండాల‌ని కోరుకునే వారు డెట్ ఫండ్లలో మ‌దుపు చేయాలి. న‌ష్ట‌భ‌యం ఉన్నా వృద్ధిని ఆకాక్షించేవారు ఈక్విటీ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. మ‌ధ్యేమార్గంగా రెండు ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉన్న హైబ్రిడ్ ఫండ్ల‌ను కూడా ఎంచుకోవ‌చ్చు.

అదే విధంగా ఈక్విటీలో మ‌దుపు చేయాల‌నుకునే మ‌దుప‌ర్లు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. అయితే వీటిలో ఏ కేట‌గిరీలో పెట్టుబ‌డి పెట్టాలి అనేది నిర్ణ‌యించుకోవాలి. ప్ర‌తీ వర్గానికి వాటికుండే ప్రయోజనం ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్లు స్థిరత్వాన్ని అందిస్తే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబ‌డిని అందించేందుకు స‌హ‌క‌రిస్తుంటాయి. మల్టీ క్యాప్ ఫండ్లు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్-క్యాప్ మూడు కేట‌గిరీల‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. దీంతో ఈ ఫండ్లు రాబ‌డిని అందించ‌డంతో స్థిర‌త్వాన్ని కూడా క‌లిగి ఉంటాయి.

లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్-క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్లు వాటికుండే ప‌రిమితుల‌ను బ‌ట్టి పెట్టుబ‌డులు చేస్తుంటాయి. మార్కెట్లో అనుకూల‌త ఉన్న‌ప్ప‌టికీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ మిడ్ స్మాల్ క్యాప్ షేర్ల‌లో పెట్టుబడులు చేసేందుకు వీలుండ‌దు. అదేవిధంగా, అనుకున్న విధంగా రాణించ‌క‌పోయినా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ల పెట్టుబ‌డులును లార్జ్ క్యాప్ కంపెనీల్లో చేసేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఇలాంటి సంద‌ర్భాల్లో మల్టీ క్యాప్ ఫండ్లు ఏ క్యాప్ కు చెందిన కంపెనీల్లో అయినా మ‌దుపు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. దీర్ఘకాలంలో మార్కెట్లో ఏర్ప‌డే వివిధ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని త‌ద‌నుగుణంగా పెట్టుబ‌డుల‌ను చేసేందుకు మల్టీ-క్యాప్ ఫండ్లకు అనుకూల‌త ఉంటుంది. మిడ్ క్యాప్ కేటగిరితో పోలిస్తే మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో అస్థిత‌రత త‌క్కువ‌గా ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం ప‌రంగా చూస్తే మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌లో మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్ల కంటే త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. సాధార‌ణంగా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో చేసే పెట్టుబ‌డితో పాటు లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబ‌డి చేస్తుంటాయి. కాబ‌ట్టి వీటిలో కొంత న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది. లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే ఎక్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో మిడ్ స్మాల్ క్యాప్ పెట్టుబ‌డుల ఉంటాయి కాబ‌ట్టి ఆ మేర‌కు వీటిలో న‌ష్ట‌భ‌యం పెరుగుతుంది.

మ‌ల్టీ క్యాప్ ఫండ్ వేర్వేరు మార్కెట్ క్యాప్ ల‌కు చెందిన సంస్థ‌ల్లో పెట్టుబడి పెడుతుంది. కాబట్టి, ఫండ్ మేనేజర్ ప‌నితీరు కీలకం. ఏ క్యాప్ లో ఎంత శాతం పెట్టుబ‌డి చేయాల‌నే నిర్ణ‌యం మార్కెట్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఫండ్ మేనేజ‌రు తీసుకుంటారు. కాబ‌ట్టి ఫండ్ రాబ‌డి ఫండ్ మేనేజ‌రు సామ‌ర్థ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. పెట్టుబడి పెట్టేముందు మ‌దుప‌ర్లు అనుసరించాల్సిన మొట్టమొదటి నియమం వైవిధ్య‌త. మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో సాధార‌ణంగా వైవిధ్య‌త ల‌భిస్తుంది. మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో అయితే వైవిధ్య‌త మ‌రింత పెరుగుతుంది.

ప‌న్నువిధానం : దీర్ఘ‌కాలిక మూలధన రాబ‌డి అంటే ఒక సంవ‌త్స‌రం పైబ‌డి చేసిన పెట్ట‌బ‌డి పై వ‌చ్చిన రాబ‌డి రూ.1 ల‌క్షకు మించిన దానిపై 10 శాతం ప‌న్ను ఉంటుంది. రూ. ల‌క్ష కంటే త‌క్కువ ఉంటే ప‌న్ను ఉండ‌దు.స్వ‌ల్ప‌కాలిక మూలధన రాబ‌డి అంటే ఒక సంవ‌త్స‌రం కంటే త‌క్కువ కాలం పెట్టుబ‌డి పై వ‌చ్చే ఆదాయం. స్వ‌ల్ప‌కాలిక మూలధన ఆదాయానికి 15% ప‌న్ను ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని