Fuel price l ధరల పెంపు బ్రేక్‌ వల్ల చమురు సంస్థలకు ₹19వేల కోట్ల నష్టం!

Fuel price| ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ప్రభుత్వరంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఒక్క మార్చి నెలలోనే సుమారు రూ.19వేల కోట్లు (2.25 బిలియన్‌ డాలర్లు) నష్టపోయినట్లు మూడీస్‌ అంచనా వేసింది.

Updated : 24 Mar 2022 19:25 IST

దిల్లీ: ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ నిన్న మొన్నటి వరకు ప్రభుత్వరంగ చమురు సంస్థలేవీ ధరలను సవరించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత ఇటీవలే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. అయితే, చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరినా ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ప్రభుత్వరంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఒక్క మార్చి నెలలోనే సుమారు రూ.19వేల కోట్లు (2.25 బిలియన్‌ డాలర్లు) నష్టపోయినట్లు మూడీస్‌ అంచనా వేసింది.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గతేడాది నవంబర్‌ నుంచి స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీటి ధరలను చమురు సంస్థలు సవరించలేదనేది బహిరంగ రహస్యం. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో వీటి ధరలను చమురు సంస్థలు పెంచాయి. గురువారం మళ్లీ స్థిరంగా ఉన్నాయి. అయితే, నవంబర్‌లో బ్యారెల్‌ చమురు ధర 82 డాలర్లుగా ఉండగా.. మార్చిలో బ్యారెల్‌ ధర సగటున 111 డాలర్లకు చేరింది. ఈ లెక్కన చమురు కంపెనీలు ఒక్కో బ్యారెల్‌కు పెట్రోల్‌పై 25 డాలర్లు (రూ.1900), డీజిల్‌పై 24 డాలర్లు చొప్పున నష్టపోతున్నట్లు మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఒకవేళ పెట్రోల్‌ ధరలు పెంచకపోతే రోజుకు ఆయా కంపెనీలు 65 నుంచి 70 మిలియన్‌ డాలర్ల మేర నష్టపోతాయని పేర్కొంది. నవంబర్‌ నుంచి మార్చి తొలి వారం వరకు జరిగిన అమ్మకాల ఆధారంగా సగటును లెక్కగట్టినప్పుడు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఒక్క మార్చిలోని తొలి మూడు వారాల్లోనే 2.25 బిలియయన్‌ డాలర్లు నష్టపోయినట్లు మూడీస్‌ పేర్కొంది.

విడివిడిగా చూసినప్పుడు ఐఓసీ 1-1.1 బిలియన్‌ డాలర్లు నష్టపోగా.. బీపీసీఎల్‌, హెచ్‌పీఎసీఎల్‌ 550-650 మిలియన్‌ డాలర్ల మేర నష్టపోయినట్లు మూడీస్‌ పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తే ఆయా కంపెనీల నష్టం తగ్గుందని తెలిపింది. అయితే, ఈ నష్టాల్ని భర్తీ చేసుకునేందుకు రేట్లు పెంచుకునేలా రిఫైనరీలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నట్లు మూడీస్‌ పేర్కొంది. ఈ పెంపు ఒకేసారి కాకుండా దశలవారీగానే ఉంటుందని అభిప్రాయపడింది.

ఇదీ లెక్క..
మన దేశంలో చమురుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే అధికంగా ఉంటున్నాయి. చమురు కంపెనీల నుంచి వినియోగదారుడి చేరేటప్పటికి ధరలో దాదాపు ఇవే సగం వరకు ఉంటున్నాయి. దిల్లీలో ఈ నెల 16న పెట్రోల్‌ ధరను పరిగణనలోకి (ఆధారం: బీపీసీఎల్‌ వెబ్‌సైట్‌) తీసుకుంటే ఆ రోజు పెట్రోల్‌ ధర రూ.95.41గా ఉంది. కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకం, దిల్లీ ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌ (19.4 శాతం)ను మినహాయించినప్పుడు పెట్రోల్‌ ధర రూ.48.24 మాత్రమే. అదే కేంద్రం వేసే పన్ను రూ.27.90, డీలర్‌ కమీషన్‌ రూ.3.77, వ్యాట్‌ రూ.15.50 కలుపుకొంటే వినియోగదారుడి వద్దకు చేరే సరికి అది రూ.95.41 అవుతోంది. ఈ లెక్కన ప్రజలపై భారం పడకుండా ఉండాలంటే ప్రభుత్వాలే దయతలచాలన్నమాట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని