IOC Q3 Results: ఇండియన్‌ ఆయిల్‌ లాభం రూ.448 కోట్లు

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది. అక్టోబర్‌-డిసెంబర్‌లో రూ.448.01 కోట్ల లాభాన్ని నమోదుచేసింది.

Published : 31 Jan 2023 23:35 IST

దిల్లీ: ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.448.01 కోట్ల నికర లాభాన్ని ఆ కంపెనీ నమోదుచేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ చమురు ధరలను సవరించని కారణంగా గత రెండు త్రైమాసికాల్లో ఐఓసీవరుస నష్టాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు వరుస త్రైమాసికాల్లో  నష్టాల అనంతరం లాభాలు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,860.80 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 

అంతర్జాతీయంగా ఏప్రిల్‌లో చమురు ధరలు పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్‌తో పాటు ఏ చమురు సంస్థా పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను సవరించలేదు. ఈ కారణంగా గత రెండు త్రైమాసిక ఫలితాల్లో ఐఓసీ వరస నష్టాల్ని నమోదుచేసింది. ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో రూ.2,265 కోట్లు, జులై- సెప్టెంబర్‌లో రూ.272.35 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఐఓసీ లాభాల బాట పట్టింది.

ఇక ఆదాయం విషయానికొస్తే.. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.2,28,168 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,97,168 కోట్లు నమోదుచేసింది. ఇంధన డిమాండ్ పెరగడంతో అక్టోబర్- డిసెంబర్‌లో 23.17 మిలియన్‌ టన్నుల ఇంధన ఉత్పత్తుల విక్రయాలు జరిగినట్లు ఇండియన్ ఆయిల్‌ వెల్లడించింది. అలాగే, 18.2 మిలియన్ టన్నుల మేరకు చమురును శుద్ధి చేసినట్లు తెలిపింది. మరో చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL) క్యూ3 ఫలితాల్లో రూ.1,959.6  కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని