LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనాలంటే.. 28లోగా ఈ పని పూర్తిచేయాలి!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూలో (ఐపీఓ) పాలసీదార్లు పాల్గొనాలంటే, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను నమోదు చేయించుకోవడం తప్పనిసరి. ఈ నెల 13న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ

Updated : 16 Feb 2022 12:06 IST

ఐపీఓలో పాల్గొనాలంటే తప్పనిసరి

ముంబయి: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూలో (ఐపీఓ) పాలసీదార్లు పాల్గొనాలంటే, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను నమోదు చేయించుకోవడం తప్పనిసరి. ఈ నెల 13న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎల్‌ఐసీ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. దీని ప్రకారం, రూ.63,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో 5 శాతం వాటా లేదా 31.6 కోట్ల షేర్లను ప్రభుత్వం ఎల్‌ఐసీలో విక్రయించబోతోంది. వచ్చే నెలలో ఈ ఐపీఓ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎల్‌ఐసీ ఉద్యోగులు, పాలసీదార్లకు ఈ ఐపీఓలో రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం పాలసీదారు తమ పాన్‌ వివరాలను ఫిబ్రవరి 28(డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన రెండు వారాల్లోగా)లోపు ఎల్‌ఐసీ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నేరుగా తమ వెబ్‌సైట్‌ లేదా ఏజెంట్ల ద్వారా పాన్‌ను వివరాలు సమర్పించవచ్చని ఎల్‌ఐసీ పేర్కొంది.

ఐడీబీఐ బ్యాంక్‌కు అదనపు మూలధనం కేటాయిస్తే ఎల్‌ఐసీపై తీవ్ర ప్రభావం: ఐడీబీఐ బ్యాంక్‌కు అదనపు మూలధనం కేటాయిస్తే ఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. 2019 అక్టోబరు 23న ఐడీబీఐ బ్యాంక్‌లోకి రూ.4,743 కోట్లను ఎల్‌ఐసీ చొప్పించిన సంగతి తెలిసిందే. ‘ఐడీబీఐ బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితులు, కార్యకలాపాల ఫలితాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి ఆ బ్యాంకుకు మూలధనం సమీకరించాల్సిన అవసరం లేదు. ఒక వేళ అదనపు మూలధనం అవసరమై.. అది సమీకరించలేని పక్షంలో మేం అదనపు నిధులను జొప్పించాల్సి ఉంటుంది. ఇది మా ఆర్థిక పరిస్థితులు, కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చ’ని ఎల్‌ఐసీ దాఖలు చేసిన డీఆర్‌హెచ్‌పీలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని