LIC IPO: ఐపీవో వేళ ఎల్‌ఐసీ బోర్డులోకి ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు

ఎల్‌ఐసీ ఐపీవో (LIC IPO)కు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనలను చేరుకోవడంలో భాగంగా కొత్తగా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను ఎల్‌ఐసీ తన బోర్డులో నియమించుకుంది.

Published : 06 Feb 2022 16:05 IST

దిల్లీ: ఎల్‌ఐసీ ఐపీవో (LIC IPO)కు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనలను చేరుకోవడంలో భాగంగా కొత్తగా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను ఎల్‌ఐసీ తన బోర్డులో నియమించుకుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సెబీకి ముసాయిదా ప్రతులను సమర్పించడానికి ముందు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నిబంధనలు చేరుకోవడం ముఖ్యం. అందుకే ఈ నియామకాలను చేపట్టింది.

ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి అంజులీ చిబ్‌ దుగ్గల్‌, సెబీ మాజీ సభ్యుడు జి.మహా లింగం, ఎస్‌బీఐ లైఫ్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ నౌతియాల్‌ కొత్తగా బోర్డులో చేరారు. వీరితో పాటు ఛార్టెట్‌ అకౌంటెంట్‌ ఎంపీ విజయ్‌ కుమార్‌, రాజ్‌ కమల్‌, వీఎస్‌ పార్థసారథి బోర్డులో చేరిన వారిలో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు బోర్డులో ఉండగా.. తాజా నియామకాలతో కలిపి ఆ సంఖ్య 9కి చేరింది. దీంతో స్వతంత్ర బోర్డు సభ్యుల భర్తీ ప్రక్రియ పూర్తైంది.

మరోవైపు ఈ వారంలోనే ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేయనున్నట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఇది వరకే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ విలువ రూ.5 లక్షల కోట్ల పైగా ఉన్నట్లు తేల్చారు. ఒకసారి సెబీ ఆమోదం పొందాక మార్చిలో ఎల్‌ఐసీ ఐపీవోకి రానుంది. ఇందులో 10 శాతం వాటాలను పాలసీదారులకు కేటాయించనున్నారు. ఈ ఐపీవోతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎయిరిండియా విక్రయం ద్వారా ₹12వేల కోట్లు ఆర్జించింది. ఐపీవో నేపథ్యంలో ఎల్‌ఐసీ ఎండీ, ఛైర్మన్ల పదవీకాలాన్ని ఏడాది చొప్పున ప్రభుత్వం పొడిగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు