IPO: పండగ సీజన్‌లో పబ్లిక్‌ ఇష్యూల జోరు.. సిద్ధంగా 10 కంపెనీలు!

2022లో పబ్లిక్‌ ఇష్యూల జోరు తగ్గింది. తిరిగి ఈ పండగ సీజన్‌లో మళ్లీ ఐపీఓల హవా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 సంస్థలు ఐపీఓకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

Published : 10 Oct 2022 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌లో ఐపీఓల జోరు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే 4-6 వారాల్లో తమ ఐపీఓలను ప్రారంభించే అవకాశం ఉంది. ఫైవ్‌-స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌, ప్రిస్టైన్‌ లాజిస్టిక్స్‌, ల్యాండ్‌మార్క్‌ కార్స్‌, సెంకో గోల్డ్‌, డీసీఎక్స్‌ సిస్టమ్స్‌, కేన్స్‌ టెక్నాలజీ, యూనీపార్ట్స్‌ ఇండియా త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈరోజే ట్రాక్షన్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభమైన విషయం తెలిసిందే.

పైన పేర్కొన్న కంపెనీల్లో చాలా వరకు త్వరలోనే ఐపీఓలను ప్రారంభించనున్నాయి. అయితే, కొన్ని మాత్రం మార్కెట్‌లో ప్రతికూల వాతావరణం ఏర్పడితే వెనక్కి తగ్గే అవకాశం ఉందని పలువురు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు తెలిపారు. 2021లో రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున నిధులను సమీకరించాయి. కానీ, 2022లో పరిస్థితులు మారిపోయాయి. ఈక్విటీ మార్కెట్లలోని తీవ్ర ఒడుదొడుకులు, ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం వంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. సెప్టెంబరు త్రైమాసికంలోనైతే ఐపీఓల ద్వారా కేవలం రూ.2,965 కోట్ల సమీకరణ మాత్రమే జరిగింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 2020 జులై త్రైమాసికం తర్వాత ఇదే అత్యల్పం.

స్థూలంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఐపీఓల్లో పాల్గొనేందుకు కావాల్సిన ద్రవ్యలభ్యత మార్కెట్‌లో అందుబాటులో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఐపీఓకి వచ్చిన హర్ష ఇంజినీర్స్‌, ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ షేర్లు 70 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. రానున్న ఐపీఓల్లో ఒక్కోటి రూ.1,000 కోట్ల దిగువనే సమీకరించనుండడం గమనార్హం. అలాగే ధరల శ్రేణిని సైతం సమంజసంగానే నిర్ణయించినట్లు పలువురు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు తెలిపారు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా కంపెనీల విలువను పునఃమదింపు చేసినట్లు వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts