IPO: తొలి ఆరు నెలల్లో 32% తగ్గిన ఐపీఓ సమీకరణ

ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 14 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.35,456 కోట్లు సమీకరించాయి. దీంట్లో ఎల్‌ఐసీయే రూ.20,557 కోట్లు సమీకరించింది....

Published : 29 Sep 2022 22:33 IST

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 14 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.35,456 కోట్లు సమీకరించాయి. దీంట్లో ఎల్‌ఐసీయే రూ.20,557 కోట్లు సమీకరించింది. క్రితం ఏడాదితో ఇదే సమయంతో పోలిస్తే ఈసారి ఐపీఓల ద్వారా సమీకరించిన నిధుల మొత్తం 32 శాతం తగ్గింది. గత ఏడాది తొలి ఆరు నెలల్లో 25 కంపెనీలు ఐపీఓకి రాగా.. రూ.51,979 కోట్లు సమీకరించాయి. ఒకవేళ ఎల్‌ఐసీని గనక పక్కనబెడితే.. ఈసారి ఐపీఓ సమీకరణ చాలా తక్కువ మొత్తానికి పరిమితమయ్యేది.

అయితే, రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఐపీఓలు రానున్నట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ తెలిపింది. ఇప్పటికే 71 కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ అనుమతి లభించింది. ఇవన్నీ కలిపి రూ.1,05,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. మరో 43 ఐపీఓలు ఇంకా సెబీ వద్ద అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. వీటి సమీకరణ లక్ష్య రూ.70,000 కోట్లు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఐపీఓకి వచ్చిన వాటిలో నిధుల సమీకరణ పరంగా ఎల్‌ఐసీ తొలి స్థానంలో ఉండగా.. డెలివరీ (రూ.5,235 కోట్లు), రెయిన్‌బో చిల్డ్రన్స్‌ (రూ.1,581 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 14 ఐపీఓల్లో కేవలం ఒక్కటి మాత్రమే కొత్తతరం టెక్ కంపెనీ కావడం గమనార్హం. ఈసారి ఐపీఓకి వచ్చిన వాటిలో నాలుగింటికి మాత్రమే భారీ స్పందన (10 రెట్లకు పైగా) లభించింది. మరో మూడు కంపెనీల షేర్లు మూడు రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మిగిలిన వాటికి 1-3 రెట్ల స్పందన లభించింది.

క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈసారి రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యం కూడా తగ్గింది. పోయినసారి తొలి అర్ధభాగంలో సగటున ఒక్కో ఐపీఓకి 15.56 లక్షల మంది నుంచి బిడ్లు దాఖలైతే.. ఈసారి ఆ సంఖ్య 7.57 లక్షలకు తగ్గింది. అత్యధికంగా ఎల్‌ఐసీకి 32.76 లక్షలు, తర్వాత హర్ష ఇంజినీర్స్‌కు 23.86 లక్షలు, క్యాంప్‌ యాక్టివ్‌వేర్‌కు 17.27 లక్షల రిటైల్‌ మదుపర్ల దరఖాస్తులు అందాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts