iQOO Neo 7 5G: ఇన్‌స్టా రీల్స్‌ కోసం వ్లాగ్‌ మోడ్‌తో ఐకూ కొత్త ఫోన్‌!

వివో (Vivo) కంపెనీ వై సిరీస్‌లో, ఐకూ (iQOO) కంపెనీ నియో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి. ఐకూ పరిచయం చేసిన ఫోన్‌లో ఇన్‌స్టా రీల్స్ చేసే వారి కోసం ప్రత్యేకంగా వ్లాగ్‌ మోడ్‌ (Vlog Mode) ఉంది. 

Published : 16 Feb 2023 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐకూ (iQOO) కంపెనీ నియో సిరీస్‌లో మరో కొత్త 5జీ  ఫోన్‌ (Smartphone)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐకూ నియో 7 5జీ (iQOO Neo 7 5G ) పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. గతేడాది విడుదలైన ఐకూ నియో 6(iQOO Neo 6)కు కంటిన్యూగా కొత్త మోడల్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఐకూ నియో 7 మోడల్‌ 11 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. అండర్‌ డిస్‌ప్లే సెన్సర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం వ్లాగ్‌ మోడ్‌ (Vlog Mode), డ్యూయల్‌ వ్యూ వీడియో రికార్డింగ్‌ మోడ్‌ వంటి సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్‌ వ్యూ వీడియో రికార్డింగ్‌ మోడ్‌తో ఒకేసారి ముందు, వెనుక కెమెరాలతో వీడియో రికార్డ్‌ చేయొచ్చు. మరి, ఈ ఫోన్‌లోని ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. 

ఐకూ నియో 7 5జీ (iQOO Neo 7 5G) 

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్ 13 (Funtouch OS 13)తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గేమింగ్‌ సమయంలో ఫోన్‌ వేడెక్కకుండా 3డీ కూలింగ్‌ సిస్టమ్‌ ఇస్తున్నారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో పది నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది. 

ఐకూ నియో 7 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 29,999కాగా, 12 జీబీ/256 జీబీ ధర రూ. 33,999. ఐకూ వెబ్‌సైట్‌, అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. 

వివో వై100 (Vivo Y100)

ఈ ఫోన్‌తోపాటు ఐకూ మాతృ సంస్థ వివో (Vivo) వై సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై100 (Vivo Y100) పేరుతో పరిచయం చేసిన ఈ మోడల్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.38 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు.  మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, రెండు ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 24,999. అమెజాన్‌,ఫ్లిప్‌కార్ట్‌, వివో వెబ్‌సైట్ల నుంచి ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని