IRCTC tour package: ‘ఊటీ’ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ప్యాకేజీ వివరాలివే..

Ooty tour: ఈ వేసవిలో ఊటీకి వెళ్లాలని ప్లాన్‌ చేశారా? అయితే, మీకోసమే ఐఆర్‌సీటీసీ ఊటీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకోండి..

Updated : 21 Apr 2023 09:58 IST

IRCTC Ooty tour package: ఈ వేసవిలో భానుడి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది శీతల ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతుంటారు. ముఖ్యంగా దక్షిణాది వారికి వేసవి అనగానే గుర్తొచ్చే ప్రదేశం ఊటీ. ఎత్తయిన కొండలు, పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన ఊటీలో ఈ వేసవిలో విడిది చేయడమంటే.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అందుకే చాలా మంది అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఊటీ ప్రయాణానికి కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకవేళ మీరూ ఊటీకి ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీ విశేషాలపై లుక్కేయండి..

‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ (ULTIMATE OOTY EX HYDERABAD) పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. మార్చి 28 నుంచి జూన్‌ 27 వరకు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఊటీ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. మార్చి 28 నుంచి వారానికోసారి సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. మీకు అనువైన సమయం, టికెట్లు అందుబాటును బట్టి మీకు నచ్చిన తేదీని ఎంచుకోవచ్చు. ఏప్రిల్‌ 25కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే విక్రయమవ్వగా.. మే 2, 9, 16, 23, 30... ఇలా జూన్‌ 27 వరకు ప్రతి మంగళవారం ఈ ట్రైన్‌ అందుబాటులో ఉంటుంది. త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

వారం రోజుల ప్రయాణం ఇలా..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలు మధ్యాహ్నం 12.20 గంటలకు బయల్దేరుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.17230)లో ప్రయాణించాల్సి ఉంటుంది.

రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకుంటుంది. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి చేరుస్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు. రెండో రోజు రాత్రి ఊటీలో హోటల్‌ గదిలోనే బస ఉంటుంది.

మూడో రోజు ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం చూపిస్తారు. తర్వాత పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ హోటల్‌లో బస చేయాలి. 

నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం పర్యటనకు తీసుకెళ్తారు. తిరిగి ఊటీకి చేరడంతో నాలుగో రోజు పర్యటన ముగుస్తుంది. రాత్రి మళ్లీ హోటల్‌లో బస ఉంటుంది.

ఐదో రోజు అదే హోటల్‌లో అల్పాహారం చేశాక మధ్యాహ్నం హోటల్‌ గదిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఊటీ నుంచి కోయంబత్తూర్‌ చేరుకుని సాయంత్రం 4:35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. 

ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.  

ప్యాకేజ్‌ ఛార్జీలు..

  • సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.31,410

  • ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.17,670

  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.14,330

  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి రూ.7650 చెల్లించాలి.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌?

  • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.
  • ఊటీలో మూడు రాత్రులు ఉండడానికి ఏసీ గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది.
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
  • టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో అంతర్భాగంగానే ఉంటాయి.
  • మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
  • బోటింగ్‌, హార్స్‌ రైడింగ్‌ వంటివి ప్యాకేజీలో ఉండవు.
  • గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.

టికెట్ల రద్దు వివరాలు..

ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. యాత్రకు 15 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్‌ మొత్తం ధరలో 25 శాతం; 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని