IRCTC: ఫుడ్‌ ఆర్డర్‌ ఇలా మాత్రమే.. ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అలర్ట్‌..!

IRCTC: రైళ్లలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారికి ఐఆర్‌సీటీసీ కొన్ని సూచనలు జారీ చేసింది.  అనధికార ఫుడ్‌ డెలివరీ యాప్‌ల సాయంతో ఆహారాన్ని కొనుగోలు చేయవద్దని సూచించింది.

Updated : 11 Oct 2023 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైలు ప్రయాణికులను ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అలర్ట్‌ చేసింది. అనధికార ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. ప్రయాణికులకు ఆరోగ్యమైన భోజనాన్ని అందించేందుకు భారతీయ రైల్వే తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలియజేసింది. అదే సమయంలో అనధికారంగా ఫుడ్‌ డెలివరీలు అందిస్తున్న వెబ్‌సైట్ల జాబితాను ఇండియన్‌ రైల్వే తన అధికారిక ఇ-కేటరింగ్‌ ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకుంది.

రైల్‌రెస్ట్రో (Railrestro), రైలుమిత్ర (Railmitra), ట్రావెల్‌ఖానా (Travelkhana), రైల్‌ మీల్‌ (Railmeal), దిబ్రెయిల్‌ (Dibrail), ఖానాఆన్‌లైన్‌ (Khanaonline), ట్రైన్స్‌ కేఫ్‌ (Trainscafe), ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ (www.foodontrack.in), ఇ-కేటరింగ్‌ (ecatering.app), ట్రైన్‌ మెనూ (https://trainmenu.com) వంటి వెబ్‌సైట్ల ద్వారా ఆహారం ఆర్డర్‌ చేయవద్దని ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు సూచించింది.

ఫుడ్‌ ఆర్డర్‌ ఇలా..

రైలులో ఆహారం ఆర్డర్‌ చేయాలంటే ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన ఇ-కేటరింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు వివరాలు లేదా స్టేషన్‌ వివరాలు ఎంటర్‌ చేయండి. ఆ తర్వాత PNR నెంబర్‌ ఎంటర్‌ చేసి మీకు నచ్చిన ఫుడ్‌ ఎంచుకోవచ్చు. ‘పే ఆన్‌లైన్‌’ లేదా ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’లో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఇదే కాకుండా.. ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌ ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేయవచ్చు. అదీ కుదరకపోతే 1323 నెంబర్‌కు కాల్‌ చేసి లేదా +91-8750001323 వాట్సాప్‌ నంబర్ ద్వారా ఆర్డర్‌ చేయవచ్చని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. 2014లోనే ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్‌ సర్వీసులను ప్రారంభించింది. ప్రసిద్ధ బ్రాండ్లతో కలసి ప్రాంతీయ వంటకాలను ప్రయాణికులకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా రైల్వే స్టేషన్లలో ఈ సేవల్ని అందుబాటులో తెచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని