IRCTC Tour Package: 6 రోజుల గంగా రామాయణ్‌ యాత్ర.. ప్యాకేజీ వివరాలు ఇవే..

IRCTC Ganga Ramayan Yatra: ఐఆర్‌సీటీసీ పలు టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలను కవర్‌ చేస్తూ అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా వారణాసి నుంచి లఖ్‌నవూ వరకు సాగే ‘గంగా రామాయణ్‌ యాత్ర’ను కూడా అందిస్తోంది. 

Updated : 17 May 2023 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీల (IRCTC Tour Package)ను అందిస్తోంది. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే కావాల్సిన ప్రాంతాన్ని చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే ‘గంగా రామాయణ్‌ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్‌సీటీసీ పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. ఈ యాత్ర వివరాలేంటో చూద్దాం..

ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, సారనాథ్‌, వారణాసి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. చివరి రోజు లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌ వచ్చేస్తే యాత్ర సంపూర్ణమవుతుంది. 2023 మే 25న, తిరిగి జూన్‌ 7న ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కానీ, 25వ తేదీ యాత్రకు టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడయ్యాయి.

యాత్ర సాగుతుందిలా..

  1. తొలి రోజు హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి వారణాసికి చేరుకుంటారు. ముందే బుక్‌ చేసిన హోటల్‌కు చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం ముగించుకొని కాశీ ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. తర్వాత గంగా ఘాట్‌ సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఏర్పాటు చేస్తారు. ఆలయం, ఘాట్‌కు చేరుకునేటప్పుడు అయ్యే ప్రయాణ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది.
  2. రెండో రోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని సారనాథ్‌కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం పూర్తిచేసుకొని మధ్యాహ్నం మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. తర్వాత ఘాట్ల సందర్శన, షాపింగ్‌ అనేది యాత్రికుల ఇష్టం. రాత్రి బస రెండో రోజు కూడా వారణాసిలోనే ఉంటుంది.
  3. మూడో రోజు వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడి అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
  4. నాలుగో రోజు అల్పాహారం ముగించుకొని అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్‌నవూ చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.
  5. ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
  6. ఆరో రోజు అల్పాహారం ముగించుకొని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్‌ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటల కల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కి వచ్చేస్తారు. దీంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీలో భాగంగా అందేవి..

  • హైదరాబాద్‌ నుంచి వారణాసి, లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు
  • రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లఖ్‌నవూలో బస
  • ఐదు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం. మధ్యాహ్న భోజనం మాత్రం ఒక రోజే ఉంటుంది.
  • ప్రయాణ బీమా

ప్యాకేజీలో ఉండనివి..

  • సందర్శనీయ స్థలాలు, ఆలయాల దగ్గర ప్రవేశ టికెట్ల రుసుములు
  • మధ్యాహ్న భోజనం సహా ఇతర ఆహార పదార్థాల ఖర్చు
  • విమానంలో భోజనం
  • టూర్‌ గైడ్లు, డ్రైవర్లు సహా ఇతరులకు ఇచ్చే టిప్స్‌
  • ఇతర వ్యక్తిగత ఖర్చులు
  • పూజా ఖర్చులు

ప్యాకేజీ ఛార్జీలు.. (ఒకరికి)

  • సింగిల్‌ ఆక్యుపెన్సీ- రూ.36,850
  • డబుల్‌ ఆక్యుపెన్సీ- రూ.29,900
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- రూ.28,200
  • చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.24,600
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.24,600
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (2- 4ఏళ్లు)- రూ.18,300

యాత్ర ప్రారంభం కావడానికి 7 రోజుల ముందు వరకు మాత్రమే టికెట్‌ రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాత్ర ప్రారంభం కావడానికి ఇంకా మిగిలి ఉన్న రోజులను బట్టి నిర్దేశిత మొత్తాన్ని రీఫండ్‌ కింద చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని