IRCTC kashmir package: ₹40వేలకే విమానంలో కశ్మీర్‌ ట్రిప్‌.. ప్యాకేజీ వివరాలివీ..

IRCTC kashmir tour: మంచు పర్వతాలు, ఎత్తయిన కొండలు వాటి మధ్యలో రోప్‌ ప్రయాణం చేస్తుంటే వచ్చే థ్రిల్లే వేరు. ఒకవేళ ఈ వేసవిలో చల్లగా అలా కశ్మీర్‌ వెళ్దామనుకుంటే ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చిన విమాన యాత్రపై ఓ లుక్కేయండి.. 

Updated : 04 May 2023 12:55 IST

ఉత్తర భారతంలో చూడదగిన ప్రదేశాల్లో కశ్మీర్‌ ఒకటి. ఈ వేసవిలో శ్రీనగర్‌ అందాలు.. గుల్‌మార్గ్‌ మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం.. ఊహించుకుంటేనే మంచు కొండల్లో తేలిపోతున్నట్లు ఉంది కదూ! మరి నేరుగా ఆస్వాదిస్తే కలిగే మజానే వేరు. అందులోనూ ఈ మైమరచిపోయే అందాలను వీక్షించటానికి విమానంలో ప్రయాణమంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. ఇవన్నీ అందుబాటులో ధరలోనే అందిస్తోంది ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC). ఆధ్యాత్మిక, విహార యాత్రలకు వివిధ రైలు ప్యాకేజీలను అందిస్తున్న ఈ సంస్థ.. తాజాగా ఈ విమాన ప్రయాణ ప్యాకేజీని తీసుకొచ్చింది.

మిస్టికల్‌ కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. మే 19 నుంచి జూన్‌ 30 వరకు ఈ ప్రయాణానికి టికెట్ బుక్‌ చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచే ప్రయాణం మొదలవుతుంది. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. మే 19 (జూన్‌ 2 మినహా) ప్రతి శుక్రవారం హైదరాబాద్‌ నుంచి విమానం బయలుదేరుతుంది. మే 19, 26 తేదీలకు సంబంధించిన టికెట్‌ బుకింగ్‌లు ముగియగా.. జూన్‌ 9, 16, 23, 30 తేదీల్లో పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

విమాన ప్రయాణం ఇలా..

  • హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1:40 గంటలకు విమానం (6E- 917) బయల్దేరుతుంది. 4:40 గంటలకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. సూర్యాస్తమయాన్ని వీక్షించటానికి సాయంత్రం దాల్‌ సరస్సుకు తీసుకెళ్తారు. అక్కడున్న చార్‌-చినార్‌ (ప్లోటింగ్‌ గార్డెన్స్‌) వీక్షించొచ్చు. రుసుములు యాత్రికులే చెల్లించాలి. రాత్రి హోటల్‌లో బస అక్కడే ఉంటుంది.
  • రెండో రోజు అల్పాహారం స్వీకరించాక బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్‌మార్గ్‌కు తీసుకెళ్తారు. అక్కడ మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి మైమరిచిపోవచ్చు. ఈ పర్యటనలో తాజ్వాస్ గ్లేసియర్‌ (హిమానీనదం) ప్రధానంగా ఆకర్షణగా ఉంటుంది. వీటిని వీక్షించి తిరిగి శ్రీనగర్‌కు వచ్చి హోటల్లో బస చేస్తారు. అక్కడే భోజనం ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం గుల్‌మార్గ్‌కు బయల్దేరుతారు. అక్కడ పూలతో నిండిన రహదారుల గుండా ప్రయాణించి గుల్‌మార్గ్‌ గోండోలాకు చేరుతారు. అక్కడ రోప్‌వే ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి యాత్రికులే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దీంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి తిరిగి శ్రీనగర్‌ చేరడంతో మూడోరోజు పర్యటన ముగుస్తుంది.
  • నాలుగో రోజు ఉదయం పహల్గామ్‌కు ప్రయాణం ఉంటుంది. సముద్ర తీరానికి 2440 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఉండే లోయ అందాలను వీక్షించాక.. తిరుగు ప్రయాణంలో కుంకుమపువ్వు పంట అందాలు, అవంతిపూర్ శిథిలాలు వీక్షించొచ్చు. ఆ రోజు రాత్రి పహల్గామ్‌ హోటల్‌లోనే భోజనం చేసి అక్కడే సేద తీరుతారు.
  • ఐదో రోజు అదే హోటల్‌లో అల్పాహారం చేసి శ్రీనగర్‌కు చేరుకుంటారు. మొఘల్ గార్డెన్స్, చెష్మషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ సందర్శనా స్థలాలను వీక్షించొచ్చు. తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్‌బల్‌ను సందర్శించుకోవచ్చు. ఇక రాత్రి హౌస్‌బోట్‌లో బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయమే ఆదిశంకరాచార్య మందిరాన్ని దర్శించుకొని తిరిగి హౌస్‌బోట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం ముగించుకొని షాపింగ్‌ చేసుకోవచ్చు. ఇక అక్కడ నుంచి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని 5:10 గంటలకు హైదరాబాద్‌కు (6E – 6216) పయనమవుతారు. 8:05 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది. 

ఇవి తప్పనిసరి

  •  సీనియర్ సిటిజన్లు ఈ టూర్‌కు వెళ్లాలనుకుంటే టికెట్‌ బుక్‌ చేసుకొనేముందు తప్పనిసరిగా వైద్య పరీక్ష చేయించుకోవాలి.
  •  75 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు చిన్న వయసున్న ఎస్కార్ట్/కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లాలి.
  •  ప్రయాణానికి రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. మీరు సమయానికి ఫ్లైట్‌ను అందుకోకపోతే ఐఆర్‌సీటీసీ ఎటువంటి బాధ్యతా వహించదు.
  •  ప్రయాణ పత్రాలతో పాటు 2 నుంచి 11 ఏళ్లున్న పిల్లలు వయస్సు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. 11 ఏళ్లు దాటిన వారికి పెద్దలుగా పరిగణిస్తారు.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌?

  •  ఆరు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం ఉచితంగా లభిస్తుంది.
  •  త్రీ స్టార్‌ హోటల్‌లో బస ఉంటుంది.
  •  మధ్యాహ్న భోజనంతో పాటు ఇతర ఆహారపదార్థాలన్నీ యాత్రికులే చూసుకోవాలి.
  •  విమాన ప్రయాణంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా యాత్రికులే చెల్లించాలి.
  •  పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
  •  దాల్ సరస్సు వద్ద షికారా రైడ్, గుల్మార్గ్ వద్ద గొండోలా రైడ్లకు యాత్రికులే వెచ్చించాలి.
  •  గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.

ప్యాకేజ్‌ ఛార్జీలు..

  •  సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.42,895
  •  ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.38,200
  •  ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.36,845
  •  5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.28,430, విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.25,750 చెల్లించాలి.
  •  2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.25,750 చెల్లించాలి.
  •  ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. యాత్రకు 21 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే టికెట్‌ మొత్తం ధరలో 30శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు