IRCTC Tour package: వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలా? పూరీ-కాశీ-అయోధ్య ప్యాకేజీ వివరాలివే..

PUNYA KSHETRA YATRA: దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే, మీ కోసమే ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్రయాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Updated : 28 Apr 2023 15:19 IST

IRCTC PUNYA KSHETRA YATRA tour package: దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది.  కానీ అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే తెలియని రాష్ట్రంలో హోటల్‌ బుక్‌ చేసుకోవటం, సందర్శనీయ స్థలాలను చేరుకోవడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. అలాంటి వారి కోసమే పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాశీ, గయ, పూరీ వంటి క్షేత్రాలను దర్శించుకోవటానికి వీలు కల్పిస్తోంది. హోటల్‌ బుకింగ్‌తో పాటు మూడు పూటలా ఆహారం వంటి సదుపాయాలను కల్పిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి ఇప్పటికే  రెండు యాత్రలు పూర్తయ్యాయి. మరో విడత యాత్రకు బుకింగ్‌లు మొదలయ్యాయి. ఒకవేళ మీరూ ఈ వేసవిలో  పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే  తొమ్మిది రోజుల పాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీ విశేషాలపై లుక్కేయండి..

పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తదుపరి విడతగా మే 13, 27 తేదీల్లో యాత్ర ప్రారంభం కానుంది. మే 13కు సంబంధించి టికెట్ల విక్రయాలు పూర్తవ్వగా.. 27వ తేదీకి పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్‌ మొత్తం తొమ్మిది రాత్రులు ఎనిమిది పగళ్లు కొనసాగుతుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

టూర్‌ సాగేదిలా..

 • మెదటి రోజున సికింద్రాబాద్‌ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడ నుంచే యాత్రను మొదలుపెట్టవచ్చు.
 • రెండో రోజు పెందుర్తి, విజయనగరం గుండా ప్రయాణించి మాల్తీపాట్పూర్‌కు ఉదయం 9:30 గంటలకు చేరుతుంది. అక్కడ నుంచి పూరీ చేరుస్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. జగన్నాథుని దర్శించుకుని ఆ రాత్రి పూరీలోనే బస ఉంటుంది.
 • మూడో రోజు అల్పాహారం ముగించుకొని ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకొని తిరిగి మాల్తీపాట్పూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుస్తారు. అక్కడ నుంచి గయకు ప్రయాణం మొదలవుతుంది.
 • నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయకు చేరుకొంటారు. ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక విష్ణుపాద దేవాలయాన్ని చూశాక వారణాసికి ప్రయాణమవుతారు.
 • ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడే హోటల్లో అల్పాహారం ముగించుకొని కాశీనాథుని పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించి ఆ రోజు రాత్రే అయోధ్యకు బయలుదేరుతారు.
 • శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు ఆరో రోజు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం సరయూ హారతిని కళ్లారా వీక్షించి ప్రయాగ్‌రాజ్‌కు పయనమవుతారు.
 • ఏడోరోజు ఉదయం ఐదు గంటలకు ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం అక్కడ  హనుమంతుని ఆలయం, శంకర్‌ విమన్‌ మండపాన్ని సందర్శిస్తారు. త్రివేణి సంగమాన్ని చూసి తిరుగు ప్రయాణమవుతారు.
 • ఎనిమిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు యాత్రా రైలు చేరుకుంటుంది.
 • తొమ్మిదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల గుండా ప్రయాణించి రాత్రి 7:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ఛార్జీలు..

 • 700 సీట్లు ఉన్న ఈ రైళ్లో ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్‌లో రూ. 34,010; స్టాండర్డ్‌లో రూ.25,770; ఎకానమీ క్లాస్‌లో రూ.16,625  చెల్లించాలి.
 • 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్‌లో రూ.30,015;  స్టాండర్డ్‌లో రూ.23,815; ఎకానమీ క్లాస్‌లో  రూ.14115  చెల్లించాలి.
 • ట్విన్‌ షేరింగ్‌, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి. 

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌?

 • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
 • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.
 • ఉదయం కాఫీ, అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తారు. 
 • ఐఆర్‌సీటీసీ టూర్‌ మేనేజర్లు మీతో పాటే ప్రయాణిస్తారు. మీకు ఎటువంటి అవసరమున్నా వారే సహాయం చేస్తారు.
 • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉన్నా, బోటింగ్‌ వంటివి ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
 • రూమ్‌ సర్వీస్‌ వంటి వాటికి ప్రయాణికులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
 • ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్‌ని నియమించుకోవాన్నా యాత్రికులే చూసుకోవాలి.

టికెట్ల రద్దు వివరాలు..

ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. యాత్రకు 15 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్‌ మొత్తం ధరలో 25 శాతం; 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు. ఈ లింక్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని