Thailand Tour: రూ.52 వేలకే థాయ్‌లాండ్‌ టూర్‌.. IRCTC ‘థ్రిల్లింగ్‌’ ప్యాకేజ్‌!

IRCTC Thrilling Thailand tour: ‘థ్రిల్లింగ్‌ థాయ్‌లాండ్‌’ పేరిట ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది.

Published : 05 Apr 2023 14:26 IST

IRCTC Thailand Tour | ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశీ విహారయాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హోటల్‌ బుకింగ్‌, సందర్శనీయ స్థలాలను గుర్తించడం, ప్రయాణాలు.. ఇలా పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటికి పరిష్కారంగానే భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఐఆర్‌సీటీసీ’ (IRCTC) అంతర్జాతీయ టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది.

ఐఆర్‌సీటీసీ (IRCTC)కి ముందుగానే ఆయా దేశాల్లోని హోటళ్లు, టూరిస్ట్‌ గైడ్‌లు, రెస్టరెంట్లు, ట్రావెల్‌ ఏజెన్సీలతో ఒప్పందాలు ఉంటాయి. దీంతో ఐఆర్‌సీటీసీ ద్వారా వెళ్లినవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశీ విహారయాత్రలను ఎంజాయ్‌ చేసే అవకాశం లభిస్తుంది. మరి విదేశీయాత్ర అనగానే చాలా ఖరీదు అనే అనుమానం కలిగే ఉంటుంది. కానీ, ఐఆర్‌సీటీసీ (IRCTC) అందుబాటు ధరలోనే వీటిని ఆఫర్‌ చేస్తోంది. చాలా మంది వెళ్లాలనుకునే ఇంటర్నేషనల్‌ టూరిస్ట్‌ స్పాట్‌లలో థాయ్‌లాండ్‌ ఒకటి. వేసవి కూడా కావడంతో బ్యాంకాక్‌ బీచ్‌లను ఎంజాయ్‌ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా యువతకైతే ఇది ఫెవరేట్‌ డెస్టినేషన్‌. మరి థాయ్‌లాండ్‌ అందాల్ని ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న టూర్‌ ప్యాకేజ్ వివరాలు చూద్దాం.

‘థ్రిల్లింగ్‌ థాయ్‌లాండ్‌’ (IRCTC Thrilling Thailand tour) పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. బిహార్‌లోని పట్నా విమానాశ్రయం నుంచి ఏప్రిల్‌ 25న టూర్‌ ప్రారంభమవుతుంది. తర్వాత వెళ్లాలనుకునేవారికి మే 26న కోల్‌కతా నుంచి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. స్వల్ప మార్పులు మినహా ఈ రెండు ప్యాకేజీలు దాదాపు ఒకేలా ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రాలైన కోరల్‌ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్‌లో పలు సందర్శనీయ స్థలాలను వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీలోనే ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కూడా మిళితమై ఉంటాయి.

యాత్ర సాగుతుందిలా..

ప్రయాణికులంతా 25 ఏప్రిల్‌ సాయంత్రం 4:20 గంటలకల్లా పట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు విమానంలో చేరుకుంటారు. మళ్లీ అక్కడి నుంచి బ్యాంకాక్‌కు మరో విమానంలో వెళ్తారు. అర్ధరాత్రి 1:40 గంటలకు అక్కడకు చేరుకుంటారు. విమానాశ్రయంలో ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తారు.

రెండో రోజూ బ్యాంకాక్‌ నుంచి పట్టయ చేరుకుంటారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో దిగి అక్కడే అల్పాహారం తీసుకొని విరామం తీసుకుంటారు. సాయంత్రం అల్కజార్‌ షోను వీక్షించి.. రాత్రి భోజనం ముగిస్తారు.

మూడో రోజు కోరల్‌ ద్వీపంలో స్పీడ్‌ బోటింగ్‌ ఉంటుంది. అక్కడే బీచ్‌లో కాసేపు సేదదీరొచ్చు. పట్టయ తిరిగి రావడంతో ఆరోజు పూర్తవుతుంది.

సఫారీ వరల్డ్ టూర్‌ నాలుగో రోజు పూర్తవుతుంది. అదే రోజు బ్యాంకాక్‌కి చేరుకొంటారు.

ఐదోరోజు బ్యాంకాక్‌లో గోల్డెన్‌ బుద్ధ, మార్బుల్ బుద్ధ సందర్శిస్తారు. తర్వాత షాపింగ్‌ ఉంటుంది. ఆ రోజు డిన్నర్‌ పూర్తి చేసుకొని ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి.

ఆరో రోజు (30 ఏప్రిల్‌ 2023) అర్ధరాత్రి విమానంలో ఉదయం 8 గంటలకు పట్నా చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

★★ మే 26న కోల్‌కతా నుంచి ప్రారంభమయ్యే టూర్‌ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. తేదీలు మాత్రం మారతాయి. అలాగే ఛార్జీల్లోనూ మార్పులున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఆ వివరాలను చూడొచ్చు.

ప్యాకేజ్‌ ఛార్జీలు..

  • ఒక్కరు మాత్రమే బుక్‌ చేసుకుంటే రూ.60,010
  • ఇద్దరు లేదా ముగ్గురు కలిసి రిజర్వ్‌ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.52,350
  • 5-11 సంవత్సరాల చైల్డ్‌కు ప్రత్యేకంగా బెడ్‌ కావాలంటే ఒకరికి రూ.50,450
  • 5-11 సంవత్సరాల చైల్డ్‌కు ప్రత్యేకంగా బెడ్‌ వద్దనుకుంటే ఒకరికి రూ.45,710

(గమనిక: పైన తెలిపిన వివరాలన్నీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం. ఏమైనా మార్పులు ఉండొచ్చు. వాటిని తెలుసుకోవడానికి తరచూ ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శిస్తే మేలు)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు