ఆదాయం కోసం IRCTC ₹1000 కోట్ల ప్లాన్‌.. ప్రయాణికుల డేటా మాటేమిటి?

IRCTC monetisation plan in telugu: ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేయాలని IRCTC భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో ఈ మేరకు వ్యాపారం చేయాలని చూస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.1000 కోట్లు ఆదాయం రావచ్చని అంచనావేస్తోంది.

Updated : 30 Aug 2022 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రైల్వే టికెటింగ్‌లో ఏకఛత్రాధిపత్యం కలిగి ఉన్న ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో ఈ మేరకు వ్యాపారం చేయాలని చూస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనావేస్తోంది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు తాజాగా టెండర్‌ను ఆహ్వానించింది. ఈ వార్త బయటకు రావడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ 4 శాతం మేర పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ప్రయాణికుల వ్యక్తిగత డేటా గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశంలో ఐఆర్‌సీటీసీ ఒక్కటే దేశంలో రైల్వే టికెట్లను విక్రయిస్తోంది. దాదాపు 80 శాతం టికెట్లు ఐఆర్‌సీటీసీ వేదికగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణికుల వివరాలతో పాటు, ప్రయాణికుల లావాదేవీల వివరాలు ఐఆర్‌సీటీసీ వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. ఈ డిజిటల్‌ ఆస్తులను వినియోగించుకుని అదనపు ఆదాయం సమకూర్చుకొనేందుకు తాజాగా ఇ-టెండర్‌ను ఆహ్వానించింది. ఈ టెండర్‌ ఆధారంగా మానిటైజ్‌ ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకోనుంది. ఆగస్టు 29న చివరి తేదీగా పేర్కొంది.

ప్రయాణికుల డేటాతో ఏం చేస్తారు?

రైల్వే వద్ద పెద్ద ఎత్తున డేటా కలిగి ఉండటంతో అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. కస్టమర్/వెండర్ అప్లికేషన్ల డేటాను మానిటైజ్‌ చేయాలనుకుంటున్నట్లు తన టెండర్‌ నోటీసులో పేర్కొంది. అదనపు ఆదాయం సంపాదించడంతో పాటు సేవలను మరింత మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ డేటాతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, హోటల్స్‌, ఫైనాన్సింగ్‌, ఇన్సూరెన్స్‌, వైద్య సంస్థలతో వ్యాపారం చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ఉదాహరణకు క్యాబ్‌ బుకింగ్‌ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ప్రయాణికులకు ఆయా సంస్థలు తమ క్యాబ్‌ను బుక్‌ చేసుకోవాలని నోటిఫికేషన్‌ పంపించే అవకాశం ఉంటుంది.

మరి గోప్యత మాటేంటి?

రైల్వేలో రోజుకు సుమారు 11 లక్షలకు పైగా టికెట్లు విక్రయమవుతాయి. రోజూ 60 లక్షల మంది ఐఆర్‌సీటీసీలో లాగిన్‌ అవుతారు. ఈ లెక్కన దాని వద్ద ఏ స్థాయిలో డేటా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాను ఎలా మానిటైజ్‌ చేయాలన్నదానిపై ఎంపికైన కన్సెల్టెంట్‌ సంస్థలు ఐఆర్‌సీటీసీకి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీకి సంబంధించి ఐటీ యాక్ట్‌- 2000, దాని సవరణలు, జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌, పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌ -2018తో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి ఈ కన్సల్టెంట్‌ సంస్థలు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డేటా గోప్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇన్నేళ్లుగా ఐఆర్‌సీటీసీ వద్ద పెద్ద మొత్తంలో ప్రయాణికుల వివరాలు ఉన్నా.. వాటిని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒకసారి మానిటైజ్‌ పేరుతో థర్డ్‌ పార్టీ చేతికెళ్తే దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (IFF) సైతం తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. గతంలో వాహన్‌ డేటా బేస్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ వివరాలను దిల్లీలో లక్షిత దాడులకు వినియోగించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. వాణిజ్య ప్రయోజనాల కంటే ముందు పౌరుల హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా సూచించింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మరి ఐఆర్‌సీటీసీ దీనిపై స్పష్టతనిస్తుందో లేదో చూడాలి. 2019లో సైతం ఐఆర్‌సీటీసీ డిజిటల్‌ ఆస్తుల మానిటైజ్‌ గురించి ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్‌ను ఆహ్వానించి.. ఎందుకనో వెనక్కి తగ్గింది.

#Update
వెనక్కి తగ్గిన ఐఆర్‌సీటీసీ

ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేయాలని భావించిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC).. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. వ్యక్తిగత డేటా గోప్యతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో ఈ ప్రక్రియ కోసం ఇటీవల ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు ఆహ్వానించిన టెండర్‌ను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఐఆర్‌సీటీసీ అధికారులు ఇదే విషయాన్ని తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని