Kedarnath Yatra: హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు.. ఇకపై ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే బుకింగ్స్‌

Kedarnath Yatra: కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకుంటున్నవారు భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.

Updated : 28 Mar 2023 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివుని పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్‌ (Kedarnath) ఒకటి. అలాగే చార్‌ ధామ్‌ యాత్రలో ఇది కూడా భాగం. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని శివుణ్ని దర్శించుకొంటారు. అయితే, హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలపై వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా ఉంటుంది. ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం ఏప్రిల్‌ 25 నుంచి తెరుచుకుంటాయని సమాచారం.

అయితే, ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు కూడా వస్తుంటారు. అందుకే అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హెలికాప్టర్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. ఏటా ఉత్తరాఖండ్‌ ‘సివిల్‌ ఏవియేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ  (UCADA)’ ఈ సేవలను నిర్వహించే హెలికాప్టర్‌ సంస్థలను నుంచి టెండర్లను ఆహ్వానిస్తుంది. అలా ఎంపిక చేసిన కొన్ని సంస్థలకు మాత్రమే భక్తులకు హెలికాప్టర్‌ సేవలు అందించేందుకు అనుమతి ఉంటుంది.

ఎలా బుక్‌ చేసుకోవాలి..

ఇప్పుడు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకుంటున్నవారు భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్‌ను (https://heliyatra.irctc.co.in/) ప్రారంభించింది. ఈ మేరకు UCADAతో ఐఆర్‌సీటీసీ ఐదేళ్ల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హెలికాప్టర్ల ట్రయల్‌ రన్స్‌ ప్రారంభమైనట్లు సమాచారం. అవి మార్చి 31తో ముగుస్తాయి. ఆ వెంటనే టికెట్ల బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సర్వీసులను నిర్వహించబోయే సంస్థలకు ‘డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)’ మార్గదర్శకాలు జారీ చేసింది.

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి..

హెలికాప్టర్‌ ద్వారా కేదార్‌నాథ్‌ చేరాలనుకుంటున్న వారు కచ్చితంగా ఉత్తరాఖండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ బోర్డు దగ్గర రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే హెలికాప్టర్‌ సేవలను బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ వెబ్‌పోర్టల్‌ లేదా టూరిస్ట్‌ కేర్‌ ఉత్తరాఖండ్‌ యాప్‌ లేదా +91 8394833833 మొబైల్‌ నెంబర్‌కు ‘Yatra’ అని వాట్సప్‌ సందేశం పంపి కేదార్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఒకసారి హెలికాప్టర్‌ టికెట్‌ బుకింగ్ విజయవంతమైతే.. టికెట్‌ ప్రింటవుట్‌ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. అలాగే ఒక అధికారిక గుర్తింపు కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. 

సేవలు ఎక్కడి నుంచి..

కేదార్‌నాథ్‌ ఆలయం నుంచి 25 కి.మీ నుంచి 200 కి.మీ వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న హెలిప్యాడ్‌ల నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది దేహ్రాదూన్‌ నుంచి కూడా సేవలను నడిపారు. సర్సీ అనే హెలిప్యాడ్‌ ఆలయం నుంచి కేవలం 23 కి.మీ దూరంలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి 12 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అలాగే ఫటా, గుప్తకాశీ, సీతాపూర్‌, అగస్తముని ప్రాంతాల నుంచి గత ఏడాది హెలికాప్టర్లు నడిచాయి.

హెలికాప్టర్‌ ద్వారా ఆలయానికి చేరుకునే వారు కొన్ని ప్రత్యేక ఛార్జీలు చెల్లిస్తే దర్శనంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది. హెలికాప్టర్‌ ద్వారా ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆ పరమశివుని దర్శనంతో పాటు హిమాలయాల అందాలను వీక్షించే అవకాశం కూడా దక్కుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని