IRM Energy IPO: ఐపీఓకి ఐఆర్‌ఎం ఎనర్జీ దరఖాస్తు.. రూ.700 కోట్ల సమీకరణ లక్ష్యం!

గుజరాత్‌, తమిళనాడు, పంజాబ్‌లో గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ ఉన్న ఐఆర్‌ఎం ఎనర్జీ ఐపీఓకి సన్నాహాలు చేసుకుంటోంది.

Published : 16 Dec 2022 20:48 IST

దిల్లీ: పట్టణ ప్రాంతాల్లో గ్యాస్‌ పంపిణీ చేసే సంస్థ ‘ఐఆర్‌ఎం ఎనర్జీ లిమిటెడ్‌’ ఐపీఓ (IRM Energy IPO)కి రానుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ (SEBI)కి శుక్రవారం ప్రాథమిక పత్రాలు సమర్పించింది. మొత్తం రూ.700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓలో 1.01 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.

అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐఆర్‌ఎం ఎనర్జీ (IRM Energy IPO) ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో 20 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే పబ్లిక్ (IPO) ఇష్యూ పరిమాణం తగ్గనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రమోటర్లకు 67.94 శాతం వాటా ఉంది. 49.50 శాతం వాటాతో క్యాడిలా ఫార్మా అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. మిగిలిన వాటాలు ఐఆర్‌ఎం ట్రస్ట్‌ లిమిటెడ్‌ వద్ద ఉన్నాయి.

తాజా ఐపీఓ (IPO) ద్వారా సమీకరించిన నిధులను తమిళనాడులోని నమక్కల్‌, తిరుచిరాపల్లిలో గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కావాల్సిన మూలధన అవసరాలకు వినియోగించనున్నారు. మరికొన్ని నిధులను రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కూడా ఉపయోగించనున్నారు. ఈ కంపెనీ ‘పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (PNG)’ ‘కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (CNG)’ను పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తుంటుంది. గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడులో దీని నెట్‌వర్క్‌ విస్తరించి ఉంది. 168 పారిశ్రామిక, 202 వాణిజ్య, 43183 గృహ వినియోగదారులకు ఇది గ్యాస్‌ను సరఫరా చేస్తోంది.

2022 సెప్టెంబరు నాటికి ఈ కంపెనీకి 56 సీఎన్‌జీ ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రెండింటిని ఐఆర్‌ఎం ఎనర్జీ సొంతంగా నిర్వహిస్తోంది. మిగిలిన వాటిలో 30 డీలర్లు, 24 ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రెండింతలు పెరిగి రూ.504.12 కోట్లకు చేరింది. PAT ఆదాయం 17.91 శాతం తగ్గి 39.25 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీఓబీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని