Gated Communitiy: గేటెడ్ క‌మ్యూనిటీల గురించి మీకు తెలియని నిజాలు!

గేటెడ్‌ కమ్యూనిటీ అనే పేరు వినే ఉంటారు. మరి వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Updated : 12 Sep 2021 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆహ్లాదకర వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, సేదతీరేందుకు అందమైన పార్కులు, పిల్లలు ఆడుకునేందుకు చిన్నచిన్న మైదానాలు, కసరత్తు చేసేందుకు వ్యాయామశాల, కాలక్షేపానికి క్లబ్బులు, సరదాగా ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌… ఇవన్నీ ఇంటికి దగ్గరలో ఉంటే ఎంత బాగుంటుంది అని ఇల్లు కొనాలనుకునే ప్రతి సామాన్యుడి ఆలోచన. వాస్తవానికి ఈ సదుపాయాల్లో కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రశాంతతకు… ఈ లోటుపాట్లను గుర్తించే కాబోలు రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు గేటెడ్‌ కమ్యూనిటీలను ప్రజలకు పరిచయం చేశారు. సాధారణ అపార్టుమెంట్లు, ఇళ్లు రోడ్డుకు పక్కగా ఉండి రణగొణ ధ్వనులతో ప్రశాంతతకు భంగం వాటిల్లేలా చేస్తాయి. భద్రతాపరంగా చూసినా ఇలాంటి గృహాలు ఏమంత సురక్షితం కాదు. ఎలా చూసినా ఎక్కువ సమయం ఆనందంగా మనకు నచ్చినట్టు గడిపేది ఇంట్లోనే. ఎంతైనా గృహమే కదా స్వర్గసీమ… మరి ఇలాంటి స్వర్గసీమను సొంతంచేసుకునేందుకు ధర కాస్త ఎక్కువైనా నేటి తరం వెనకడుగు వేయట్లేదనే చెప్పాలి.

ఏమిటీ ప్ర‌త్యేక‌త‌?

గేటెడ్‌ కమ్యూనిటీలు అంటే నిర్ణీత స్థలంలో పటిష్ఠ బందోబస్తుతో, పెద్ద పెద్ద ప్రహరీలతో, ఎలక్ట్రికల్‌ ఫెన్సింగ్‌ లాంటి ఏర్పాట్లతో నివాస సముదాయాలను ఏర్పాటు చేయడం. భద్రతకు ప్రాముఖ్యతనిచ్చే ఈ కమ్యూనిటీల్లో అనేక సదుపాయాలు ఉంటుండటంతో ఇలాంటి ఇళ్లను కొనేందుకు చాలా మంది మొగ్గుచూపిస్తున్నారు.

భద్రత భేషుగ్గా…

గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రధానంగా భద్రతకు ప్రాముఖ్యమిస్తారు. అనుమతి ఉంటే తప్ప ఎవరూ వీటిలోకి ప్రవేశించలేరు. వచ్చిపోయేవారి వివరాలను సెక్యూరిటీ సిబ్బంది నమోదుచేసుకుంటారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పటిష్ఠ ఫెన్సింగ్‌ వల్ల అసాంఘిక కార్యకలాపాలు తక్కువగా చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ లోపల అంతర్గత రోడ్లపై వాహనాల వేగంపై నియంత్రణ ఉంటుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారమూ తక్కువగా ఉంటుంది. బోలెడంత స్థలంలో విరివిగా చెట్లు ఉండటంతో వాతావరణ కాలుష్య సమస్య పెద్దగా ఉండదనే చెప్పాలి.

తీరిక వేళల్లో కాలక్షేపం...

పెద్దలు రోజంతా ఆఫీసులో కష్టపడి, పిల్లలు పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పడి ఇంటికి వచ్చి సేదతీరేందుకు అనువైన వాతావరణ ఎక్కడ ఉంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఆ సమస్యే ఉండదు. పెద్దవాళ్లకు రిలాక్సేషన్‌ కోసం కమ్యూనిటీ క్లబ్బులుంటాయి. శరీర దారుఢ్యాన్ని పెంచుకునేందుకు జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ లాంటి సౌకర్యాలు కనుచూపు మేరలో ఉంటాయి. పిల్లలను స్వేచ్ఛగా పార్కులో వదిలేసి పెద్దవాళ్లు వారివారి పనులు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. పిల్లలకు బోలెడుమంది స్నేహితులు తోడవుతారు. వారు చక్కగా ఆడుకునేందుకు చిన్న చిన్న మైదానాల్లో జారుడుబండ, ఉయ్యాలలు లాంటి ఏర్పాట్లు ఉంటాయి. కమ్యూనిటీలోని మహిళలంతా కలిసి కిట్టీ పార్టీలు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ప్రత్యేక సదుపాయాలివే…

పరిశుభ్రమైన పరిసరాలు, ఫిల్టర్‌ చేసిన తాగునీరు, 24గంటల నీటి సదుపాయం, జనరేటర్లు, గ్యాస్‌ పైపులైన్లు, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు, విశాలమైన అంతర్గత రోడ్లు, అనువైన పార్కింగ్‌ స్థలం, పిల్లల మైదానాలు, ఉద్యానవనాలు లాంటివి ప్రత్యేక ఆకర్షణలు.

ఇల్లు కొనేముందు చూడాల్సినవి

బయట ఇళ్లతో పోలిస్తే గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇల్లు కొనుగోలు చేయాలంటే కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టాలి. అయితే ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో అన్ని ఇళ్లు దాదాపు ఒకేలా ఉంటాయి కాబట్టి ధరలూ ఒకేలా ఉండేందుకు ఆస్కారముంది.

🏘️ భద్రత పేరుతో మెయింటెనెన్స్‌ ఛార్జీలు ఎంత వసూలు చేస్తారో ఆరా తీయాలి.

🏘️ నీటి బిల్లు, గ్యాస్‌ బిల్లులు న్యాయమైన రేటుకే ఇస్తున్నారో లేక ఎక్కువగా డిమాండు చేస్తున్నారో కనుక్కోవాలి.

🏘️ స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, పిల్లల పార్కులు వాడుకునేందుకు ఉండే నిబంధనలు, వాటికి జరపాల్సిన చెల్లింపులను గురించి విచారించాలి.

🏘️ గేటెడ్‌ కమ్యూనిటీలోనే స్టోర్స్‌, మార్కెట్‌ లాంటివి ఉన్నట్టయితే బయటి ధరలకు సమానంగా ఇస్తున్నారా లేదా అంశాన్ని పరిశీలించాలి.

🏘️ అంతర్గత రహదారులు ప్రైవేటు పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటికేమైనా ఛార్జీలు వసూలు చేస్తున్నారో లేదో చూడాలి.

🏘️ ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదు కాస్త సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గడపాలనుకునేవారికి గేటెడ్‌ కమ్యూనిటీలు అనుకూలం.

గేటెడ్‌ కమ్యూనిటీలకు ఉండే పరిమితులు

🏠 కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలు నగరానికి దూరంగా ఉంటాయి కాబట్టి రాకపోకలకు సమయం తీసుకుంటుంది.

🏠 ఇంటికి వచ్చేవారు విధిగా సెక్యూరిటీ వద్ద సంతకం చేయడం, యాజమాని నుంచి ఫోన్‌ వస్తేనే పంపించడం లాంటివి చికాకు కలిగించవచ్చు.

🏠 ఒక గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణం జరిపాక ఫ్లాట్ల విక్రయానికి ప్రకటన వెలువడి డిమాండు ఎక్కువగా ఉన్నట్టయితే ధరలు మరింత పెరిగే అవకాశాలు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని