Health Insurance: క‌్రిటిక‌ల్ ఇల్‌నెస్ బీమా అవ‌స‌ర‌మేనా?

ఈ  పాల‌సీని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాల‌సీతో క‌లిపి రైడ‌ర్‌గా తీసుకోవ‌చ్చు లేదా స్వ‌తంత్ర పాల‌సీగా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Updated : 04 Oct 2022 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీమా అన‌గానే ఎక్కువ‌ మందికి జీవిత బీమా, సాధార‌ణ ఆరోగ్య బీమా గుర్తుకు వ‌స్తాయి. కొన్నేళ్ల నుంచి ఆరోగ్య బీమాపై  ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న బాగా పెరిగింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా దీనిపై ఎక్కువ క‌స‌ర‌త్తే చేస్తున్నాయి. అనేక ప్ర‌వేటు బీమా కంపెనీలు ఈ ఆరోగ్య బీమా సేవ‌ల‌ను విరివిగా అందిస్తున్నాయి. బీమా కంపెనీలు క్రిటిక‌ల్ ఇల్‌నెస్ (క్లిష్టమైన అనారోగ్యాల) కవర్ కూడా అందిస్తున్నాయి. అసలు ఈ కవర్ ఏంటి? ఇందువల్ల ఉపయోగం ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం..

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ అవ‌స‌రం

సాధార‌ణ ఆరోగ్య బీమాలో కొన్ని వైద్య‌, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన ఖ‌ర్చులు మాత్ర‌మే క‌వ‌ర‌వుతాయి. అయితే ప్ర‌స్తుత స‌మాజంలో నెల‌కొన్న దుష్ప‌రిమాణాల‌ వల్ల అనేక మాన‌సిక‌, శ‌రీర రుగ్మ‌త‌ల‌తో చాలామంది ప్ర‌జ‌లు తీవ్ర అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. వీటికి సాధార‌ణ బీమా స‌రిపోతుందా అంటే.. స‌రిపోద‌నే చెప్పాలి. కొన్ని తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవ‌డానికి రూ. 20-50 ల‌క్ష‌ల వ‌ర‌కు కూడా ఖ‌ర్చ‌వుతుంది. ఖ‌ర్చు తీవ్ర‌త దృష్ట్యా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ అవ‌స‌రం ప‌డుతుంది.

క్యాన్స‌ర్‌, కిడ్నీ వైఫ‌ల్యం, ప్ర‌ధాన అవ‌య‌వ మార్పిడి మొద‌లైన వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి బీమా సంస్థ‌ను బ‌ట్టి 10 నుంచి 37 వ్యాధుల వ‌ర‌కు ఆరోగ్య ర‌క్ష‌ణ‌నిచ్చే పాల‌సీలున్నాయి. అయితే, ఇక్క‌డ సంఖ్య ఒక్క‌టే చూడ‌కూడ‌దు. ఎలాంటి వ్యాధుల‌కు క‌వ‌రేజీని ఇస్తుందనేది చాలా ముఖ్యం. వైద్య చికిత్స ఖ‌రీదైన‌ది కావ‌డంతో క్రిటిక‌ల్ ఇల్‌నెస్ బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం చాలా అవ‌స‌రం. ఈ  పాల‌సీ జీవిత/ఆరోగ్య బీమా పాల‌సీతో రైడ‌ర్‌గా తీసుకోవ‌చ్చు లేదా స్వ‌తంత్ర పాల‌సీగా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఆరోగ్య బీమా పాల‌సీకి, క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీకి తేడా

ఆరోగ్య బీమా పాల‌సీ ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే భ‌రిస్తుంది. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ వైద్య ఖ‌ర్చుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన ప‌డిన‌ప్పుడు నిర్దేశిత బీమా మొత్తం చెల్లిస్తుంది. సాధార‌ణ వ్యాధుల‌తో ఆస్ప‌త్రి పాలైనా ఆరోగ్య బీమా ఆదుకుంటుంది. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌రేజీ కొనుగోలు చేసేట‌ప్పుడు పేర్కొన్న వ్యాధుల బారిన ప‌డితేనే ప‌రిహారం చెల్లిస్తుంది. ఆరోగ్య బీమా పాల‌సీని సుదీర్ఘ కాలం పాటు పున‌రుద్ధరించుకోవచ్చు. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ ఒక‌సారి క్లెయిమ్ చేస్తే పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉండదు. ఒకసారి 'క్రిటికల్ ఇల్‌నెస్' బారిన పడ్డాక వేరే బీమా సంస్థ‌లో పాల‌సీ తీసుకుందామ‌న్నా ప్రీమియం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అంటే పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ దాదాపు ఆగిపోయిన‌ట్లే.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ అవ‌స‌రం ప‌డుతుందా?

కుటుంబంలో క్యాన్స‌ర్‌, క‌రోన‌రీ ఆర్ట‌రీ బైపాస్, మాన‌సిక రోగాలు మొద‌లైన వ్యాధుల చ‌రిత్ర ఉన్నా లేదా పాలసీదారులు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవ‌న‌శైలి వ్యాధుల‌ను క‌లిగి ఉన్నా భ‌విష్య‌త్‌లో తీవ్ర వ్యాధుల‌ను ఎదుర్కొనే ప‌రిస్థితి ఉండొచ్చు. ప్ర‌స్తుతం తీవ్ర వ్యాధులు లేన‌ప్పుడు.. అంటే ముందుగానే ఈ క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీ కొనుగోలు చేస్తే.. కాస్త తక్కువ ప్రీమియం ధ‌ర‌కే పాల‌సీ కొనుగోలు చేయొచ్చు. వెయిటింగ్ పీరియ‌డ్‌ను సుల‌భంగా దాటొచ్చు. దీనివ‌ల్ల  తీవ్ర‌మైన అనారోగ్య ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఈ పాల‌సీ వ‌ల‌న త‌క్ష‌ణ ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

ఏ వ్యాధులు లేన‌ప్పుడే ఇటువంటి పాల‌సీల‌ను తీసుకుంటే ఎక్కువ ఆర్థిక ప్ర‌యోజ‌న‌ముంటుంది. ఇప్ప‌టికే తీవ్ర‌మైన అనారోగ్యంతో బాధ‌ప‌డేవారికి బీమా సంస్థ‌లు పాల‌సీని నిరాకరించవచ్చు. కొన్ని బీమా కంపెనీలు రూ. 1 కోటి వరకు క‌వ‌రేజీతో క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీల‌ను అందిస్తున్నాయి. ఏ వ్యాధులూ లేని 30 ఏళ్ల వ‌య‌సు ఉన్న వ్య‌క్తికి రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ.1 కోటి బీమా మొత్తానికి రూ. 300-1,000 వ‌ర‌కు నెల‌స‌రి ప్రీమియం  ఉండవచ్చు. ఈ ప్రీమియం బీమా సంస్థ‌ను బ‌ట్టి మారుతుంది.

ఈ బీమా పాల‌సీకి.. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశాలు

సాధార‌ణంగా క్లిష్ట‌మైన అనారోగ్య చికిత్స‌లు దీర్ఘ‌కాలం పాటు ఉంటాయి. కాబ‌ట్టి, పేషంట్ కోలుకునేవ‌ర‌కు ఏ ప‌నీ చేయ‌లేరు. ఆసుప‌త్రిలో చేర‌డం, మందుల కొనుగోలు, కుటుంబ నెల‌వారీ ఖ‌ర్చులు, ఈఎంఐలు, పిల్ల‌ల చ‌దువు వంటి దీర్ఘ‌కాలిక ఆర్థిక బాధ్య‌త‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అధిక బీమా మొత్తంతో పాల‌సీ తీసుకోవాలి. బీమా పున‌రుద్ధ‌ర‌ణకు వ‌యోప‌రిమితి లేని పాల‌సీని ఎంచుకోవాలి. 

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీతో ప్ర‌యోజ‌నాలు

నిర్దిష్ట చికిత్స ఖ‌ర్చును క‌వ‌ర్ చేసే పూర్తి బీమా మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. పాల‌సీదారు తీవ్ర‌మైన అనారోగ్యం కార‌ణంగా ఆదాయాన్ని కోల్పోతారు కాబ‌ట్టి అత‌డి ఆసుప్ర‌తి చికిత్స ఖ‌ర్చుల‌ను చెల్లించ‌డానికి, అత‌డి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవ‌డానికి ఈ పాల‌సీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ పాల‌సీ.. వాస్త‌వానికి అయ్యే (న‌గ‌దు ర‌హిత లేదా రీయింబ‌ర్స్‌మెంట్‌) ఖ‌ర్చుల‌ను చెల్లిస్తుంది.

ఈ పాల‌సీ వెయిటింగ్ పీరియ‌డ్ ఎంత?

ఈ క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌ బీమా పాల‌సీలు కొనుగోలు చేసిన‌వారు 30 రోజుల నుంచి 90 రోజుల వ‌ర‌కు వేచి ఉండాలి. ముందు నుంచి ఉన్న వ్యాధుల‌కు క‌వ‌రేజీ ఇవ్వ‌ని పాల‌సీల‌ను తీసుకోకూడ‌దు. కొన్ని బీమా సంస్థ‌లు ఈ ముంద‌స్తు వ్యాధుల క‌వ‌రేజీకి 4 ఏళ్ల పాటు వేచి ఉండాల‌న్న నిబంధ‌న విధిస్తున్నాయి. ఇలాంటి పాల‌సీల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

స్టాండ‌లోన్ లేక రైడ‌ర్

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని తీసుకునేట‌ప్పుడు స్టాండ‌లోన్ (విడిగా) లేదా ఏదైనా బేస్ పాల‌సీతో క‌లిపి రైడ‌ర్‌గా తీసుకోవాలా అన్న‌ది కూడా ముఖ్య‌మే. రైడ‌ర్‌లో బీమా మొత్తానికి ప‌రిమితి ఉంటుంది. ఇది బేస్ పాల‌సీని బట్టి ఉంటుంది. కాబ‌ట్టి, విడిగా కొనుగోలు చేయ‌డ‌మే ఉత్త‌మం. అయితే, రైడ‌ర్‌తో పోలిస్తే స్టాండ‌లోన్ (విడిగా) తీసుకున్న పాల‌సీ బీమా ప్రీమియం ఎక్కువ‌ ఉంటుంది.

ఫ్రీ లుక్ వ్య‌వ‌ధి

ఈ పాల‌సీ తీసుకున్న వారికి బీమా ప‌త్రాలు అందిన 15 రోజుల వ‌ర‌కు ఫ్రీ లుక్ వ్య‌వ‌ధి ఉంటుంది. అంటే, బీమా ప‌త్రాలు అందిన 15 రోజుల లోపు పాల‌సీ కొనుగోలును ఉప‌సంహ‌రించుకొని బీమా ప్రీమియంను వెన‌క్కి తీసుకోవ‌చ్చు.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

పాల‌సీదారులు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80డి కింద రూ. 25 వేల వ‌ర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని