Education Loan: విద్యా రుణం తీసుకోవడం మంచిదేనా?

విద్యా అవసరాలకు రుణాన్ని తీసుకునేటప్పుడు ఇతర రుణాలపై ఆధారపడకుండా, ప్రత్యేకంగా విద్యారుణాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి.

Published : 16 Feb 2023 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంప్రదాయ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించడంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటున్నాయి. ఇందులో నూతన సాంకేతికతలను ఉపయోగించడం, అనుభవపూర్వక అభ్యాస విధానం, పరిశ్రమలకు సంబంధించిన సమగ్ర పాఠ్యాంశాలు ఉన్నాయి. నేడు గతంలో కంటే నాణ్యమైన విద్యను అభ్యసించడం విద్యార్థులకు కీలకంగా మారింది. ఈ మార్పు వల్ల ట్యూషన్‌ ఫీజులు పెరగడం, పేరున్న సంస్థలో అడ్మిషన్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. కొత్త కోర్సుల ఫీజులు కూడా భారీగానే ఉంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్ని వెచ్చించినా.. ఈ ఫీజుల మొత్తాన్ని కవర్‌ చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ఖర్చులను తట్టుకోవడానికి విద్యార్థులు విద్యా రుణాన్ని ఎంచుకోవడమే మంచిది. 

రుణ కవరేజీ..

మీరు అగ్రశ్రేణి కళాశాలల్లో చదువుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కేవలం కళాశాల ఫీజే కాకుండా హాస్టల్ ఫీజులు, ప్రయాణ, ఆహార ఖర్చులు, పరీక్ష రుసుములు, ల్యాబ్‌ ఛార్జీలు, లైబ్రరీ ఫీజు, పుస్తకాలు, యూనిఫాంలు, ప్రాజెక్టుల ఖర్చు వంటివి రుణ కవరేజ్‌లో ఉంటాయి. రుణ ఆమోదం బ్యాంకు/ఆర్థిక సంస్థలను బట్టి భిన్నంగా ఉండొచ్చు. రుణం ఇచ్చే సంస్థలు.. మీరు చేరే కళాశాల, ఎంచుకున్న కోర్సు, విద్యకు అయ్యే మొత్తం ఖర్చులు, మీ అకడమిక్‌ రికార్డ్స్‌, కుటుంబ ఆదాయం, ఆస్తులు మొదలైన వాటిని చూస్తాయి. అంతేకాకుండా గతంలో చేసిన చెల్లింపుల హిస్టరీ కూడా బ్యాంకులు చూస్తాయి. వివిధ రుణ సంస్థలు వారి సొంత రీపేమెంట్‌ నియమాలను కలిగి ఉంటాయి. 

టీసీఎస్‌ (రిసోర్స్‌ వద్ద పన్ను వసూలు)

బడ్జెట్‌ 2020 ప్రకారం.. రూ.7 లక్షల కంటే ఎక్కువ ట్యూషన్‌ ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విద్యా రుణం కాకుండా ఇతర మార్గాల ద్వారా రుణం తీసుకొన్న విద్యార్థులు మూలం వద్ద కనీసం 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, విద్యారుణం తీసుకునే విద్యార్థులు కేవలం 0.50% టీసీఎస్‌ చెల్లించాలి. సెక్షన్‌ 80E ప్రకారం.. విద్యార్థులు, చెల్లించిన వడ్డీపై 8 సంవత్సరాల పాటు అపరిమిత పన్ను మినహాయింపును పొందొచ్చు.

రుణ ఎంపిక

విద్యార్థులు వారి ప్రొఫైల్‌, కోర్సు అభ్యర్థనల ఆధారంగా, ప్రత్యేక అధ్యయన అవసరాలకు సరిపోయే రుణ రకాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో కోర్సు పూర్తయ్యే సమయంలో రీఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్లు వంటి ఇతర అనుబంధ ఖర్చులు కూడా కవర్‌ అయ్యే అవకాశం ఉంది.

రుణం చెల్లింపు

సాధారణంగా ఈఎంఐ చెల్లింపులు విద్యా రుణాల విషయంలో కోర్సు పూర్తయిన 6 నుంచి 12 నెలల తర్వాత ప్రారంభమవుతాయి. ఇది విద్యార్థులు (రుణం చెల్లించడం ప్రారంభించే ముందు) ఉద్యోగం కోసం ఏర్పాటు చేసుకోవడానికి, స్థిరపడడానికి తగిన సమయాన్ని అందిస్తుంది.

క్రెడిట్‌ హిస్టరీ నిర్మాణం

విద్యా రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం, విద్యార్థుల క్రెడిట్‌ చరిత్రను నిర్మించే మొదటి మెట్టు. ఇది భవిష్యత్‌లో మరింత ఇబ్బంది లేని పద్ధతిలో గృహ రుణం, వాహన రుణం వంటి ఇతర రుణాలను పొందడంలో వీరికి సహాయపడుతుంది. ఈఎంఐలను తిరిగి చెల్లించడం కోసం విద్యార్థులు వృత్తి జీవిత ప్రారంభంలో కొంత డబ్బును పక్కన పెడతారు. ఇలా చేయడం వల్ల వారికి పొదుపు అలవాటు అవ్వడంతో పాటు, క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళిక కూడా నేర్చుకునే వీలుంటుంది.

ఇతర లాభాలు

తనఖా: చాలా బ్యాంకులు రూ.7.50 లక్షల లోపు విద్యా రుణాలకు పూచీకత్తు అడగవు.
తక్కువ వడ్డీ రేట్లు: సాధారణంగా సురక్షిత విద్యా రుణాల వడ్డీ రేట్లు మహిళలకు 7.85%, పురుషులకు 8.35% నుంచి ప్రారంభమవుతాయి. వ్యక్తిగత రుణం వంటి ఇతర రుణాల కంటే విద్యా రుణంపై వసూలుచేసే వడ్డీ రేట్లు తక్కువస్థాయిలోనే ఉంటాయి.
రీపేమెంట్‌: విద్యా రుణం రీపేమెంట్‌ వ్యవధి 20 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు: అసలుపై పన్ను మినహాయింపు ఉండదు. వడ్డీపై (పరిమితి లేకుండా) మాత్రమే ఉంటుంది.

రుణ బాధ్యత

విద్యారుణంపై ప్రాథమిక దరఖాస్తుదారుడి (విద్యార్థి)తో పాటు సహ-దరఖాస్తుదారుగా.. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. ప్రాథమిక దరఖాస్తుదారుడు రుణం చెల్లించడంలో విఫలమైతే ఆ బాధ్యత సహ దరఖాస్తుదారుపై పడుతుంది. దరఖాస్తుదారుడు, సహ-దరఖాస్తుదారుడు ఇద్దరి ఆదాయాలు, విద్యాపరమైన అర్హతలను బ్యాంకులు ధ్రువీకరిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని