Health Insurance: గ్రూప్ ఆరోగ్య‌ బీమా పాల‌సీని వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకోవ‌చ్చా?

గ్రూప్ పాల‌సీని, వ్యక్తిగ‌త పాల‌సీగా మార్చుకునేట‌ప్పుడు ల‌భించే అతి ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల‌లో వెయిటింగ్ పిరియ‌డ్ ఒక‌టి

Published : 27 Jun 2022 15:26 IST


ఉద్యోగ‌స్తుల‌కు ల‌భించే అతిపెద్ద ప్ర‌యోజ‌నాల‌లో గ్రూప్ ఆరోగ్య బీమా ఒక‌టి. సంస్థ‌లు, త‌మ ఉద్యోగుల సంక్షేమం కోసం బృంద బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తుంటాయి. అయితే, ప్ర‌తీ సంస్థ ఈ సౌక‌ర్యాన్ని అందించ‌క‌పోవ‌చ్చు. అలాగే బీమా సౌక‌ర్యాన్ని అందిస్తున్న సంస్థ‌లు కూడా ఉద్యోగి త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తున్నంత వ‌ర‌కు మాత్ర‌మే బీమాను అందిస్తాయి. ఉద్యోగి ఎప్పుడైతే సంస్థ‌లో ఉద్యోగం వ‌దిలేస్తాడో..అప్పుడు పాల‌సీ కూడా ర‌ద్ద‌వుతుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి, ర‌వి ప్ర‌స్తుతం ఒక ఎమ్ఎన్‌సీ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. ఆ కంపెనీ వారు రూ. 5 ల‌క్ష‌ల‌తో బృంద ఆరోగ్య బీమాను అందిస్తున్నారు. అందువ‌ల్ల ర‌వి వ్య‌క్తిగ‌తంగా ఆరోగ్య బీమాను తీసుకోలేదు. ప్ర‌స్తుతం ర‌వి మ‌రో సంస్థ‌కు మారాల‌నుకుంటున్నాడు. కొత్త సంస్థ బృంద బీమాను ఆఫ‌ర్ చేయ‌టం లేదు. అలాగ‌ని వ్య‌క్తిగ‌త పాల‌సీ తీసుకుంటే అందులో కొన్ని అనారోగ్యాలకు మూడు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పిరియ‌డ్ ఉంది. ఈ నాలుగేళ్లలో ఇలాంటి అనారోగ్యం కార‌ణంగా ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌స్తే పాల‌సీ కవర్ అవ్వదు. మ‌రి, ఇప్పుడు ర‌వి ఏం చేయాలి?ఇటువంటి సంద‌ర్భంలో ఉద్యోగులు త‌మ బృంద బీమాను వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకోవ‌చ్చు. 

బృంద బీమాను వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకునే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు..
హామీ మొత్తం, ప్రీమియం..
బృంద బీమాను వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకోద‌ల‌చిన వారు..ప్ర‌స్తుతం గ్రూప్ పాల‌సీని అందిస్తున్న సంస్థ‌ను సంప్ర‌దించి పాల‌సీ మార్పు విష‌యం తెలియ‌జేయాలి. వ్య‌క్తిగ‌త పాల‌సీగా మారిస్తే వ‌ర్తించే హామీ మొత్తం, ప్రీమియం వంటివి బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ఒక‌వేళ హామీ మొత్తాన్ని పెంచుకోవాల‌నుకుంటే పెంచుకోవ‌చ్చు. అందుకు అనుగుణంగానే ప్రీమియం కూడా పెరుగుతుంది. 

బీమా సంస్థ‌కు బ‌దిలీ స‌మాచారం ఇవ్వాలి..
పాల‌సీ బ‌దిలీ విష‌యాన్ని పాల‌సీ ర‌ద్ద‌య్యే 45 రోజుల‌కు ముందే బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌రైన స‌మ‌యానికి బ‌దిలీ ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. అలాగే, గ్రూప్ ఇన్సురెన్స్ ఏ సంస్థ నుంచి అయితే తీసుకున్నారో అదే సంస్థ‌లో వ్య‌క్తిగ‌త పాల‌సీ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. క‌నీసం వ్య‌క్తిగ‌త పాల‌సీని ఒక సంవ‌త్స‌రం పాటు కొన‌సాగించాక మరో బీమాసంస్థ‌కు పాల‌సీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు.  

ముంద‌స్తు ఆరోగ్య ప‌రీక్ష‌లు..
సాధార‌ణంగా.. ఎటువంటి ముంద‌స్తు ఆరోగ్య ప‌రీక్ష‌లు లేకుండానే ఉద్యోగుల‌కు సంస్థ త‌ర‌పున గ్రూప్ పాల‌సీని అందిస్తారు. అయితే, వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకోవాల‌నుకుంటే ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా బీమా సంస్థ‌లు కోర‌వచ్చు. 

వెయిటింగ్ పిరియ‌డ్‌..
గ్రూప్ ఇన్సురెన్స్ పాల‌సీలో సాధార‌ణంగా వెయిటింగ్ పిరియ‌డ్ ఉండ‌దు. మీరు పాల‌సీని వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకున్నా, వెయిటింగ్ పిరియ‌డ్ వ‌ర్తించ‌దు. ఒక‌వేళ మీరు తీసుకున్న గ్రూప్ పాల‌సీలో వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటే సంబంధిత పిరియ‌డ్ వ్య‌క్తిగ‌త పాల‌సీకి బ‌దిలీకావ‌చ్చు. అయితే మీరు పాల‌సీ మార్చుకునే స‌మ‌యానికి వెయిటింగ్ పిరియ‌డ్ పూర్తయ్యి ఉంటే.. వ్య‌క్తిగ‌త పాల‌సీని వెయిటింగ్ పిరియ‌డ్ లేకుండానే అందిస్తారు. 

కుటుంబ స‌భ్యుల‌కు..
బృంద బీమా మీ కుటుంబ స‌భ్య‌లను కూడా క‌వ‌ర్ చేస్తుంటే.. పాల‌సీ బ‌దిలీ స‌మ‌యంలో విడివిడిగా పాల‌సీలు తీసుకోవ‌చ్చు, లేదా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీని తీసుకోవ‌చ్చు. 

ఏవిధంగా బదీలీ చేసుకోవాలి?
*
వ్య‌క్తిగ‌త పాల‌సీకి మారేందుకు నిర్ణ‌యం తీసుకుంటే..ఈ విష‌యాన్ని బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. పాల‌సీ ర‌ద్ద‌వ్వ‌డానికి క‌నీసం 30-45 రోజుల ముందే ఈ విష‌యాన్ని బీమా సంస్థ‌కు తెల‌పాలి. 
* పాల‌సీని ఎంపిక చేసుకున్న త‌ర్వాత సంబంధిత ఫారంను బీమా సంస్థ నుంచి తీసుకుని పూర్తి చేసి ఇవ్వాలి. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 
* ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించిన త‌ర్వాత ప్రీమియం చెల్లించాలి. ప్రీమియంను ఆన్‌లైన్‌లో డెబిట్‌/క్రెడిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లింపులు చేయ‌వ‌చ్చు. 

ప్ర‌యోజ‌నాలు..
* గ్రూప్ పాల‌సీని, వ్యక్తిగ‌త పాల‌సీగా మార్చుకునేట‌ప్పుడు ల‌భించే అతి ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల‌లో వెయిటింగ్ పిరియ‌డ్ ఒక‌టి. గ్రూప్ పాల‌సీకి వ‌ర్తించే వెయిటింగ్ పిరియ‌డ్ ప్ర‌యోజ‌నాలే వ్య‌క్తిగ‌త పాల‌సీకి బ‌దిలీ అవుతాయి. 
* గ్రూప్ ఆరోగ్య బీమాను సంస్థ‌లు ఉద్యోగుల కోసం కొనుగోలు చేస్తాయి కాబ‌ట్టి ఉద్యోగులందరికి ఒకే ర‌క‌మైన ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఇవి వారి వారి వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు అనుగుణంగా బీమాను అందించ‌వు. వ్య‌క్తిగ‌త పాల‌సీగా బ‌దిలీ చేసుకోవ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌త వైద్య చ‌రిత్ర, అవ‌స‌రాల‌కు అనుగుణంగా క‌వ‌రేజ్‌ను పెంచుకోవ‌చ్చు. 
*  మీ బ‌డ్జెట్ ఆధారంగా వివిధ ర‌కాల యాడ్-ఆన్‌ల‌ను చేర్చుకుని కూడా క‌వ‌రేజ్‌ను పెంచుకోవ‌చ్చు. 

చివ‌రిగా..
గ్రూప్ పాల‌సీ ఉంద‌ని..వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకునేందుకు చాలా మంది ఆలోచిస్తారు. ఉద్యోగంలో కొన‌సాగినంత కాలం గ్రూప్ బీమా ఉంది కాదా..ఉద్యోగం వ‌దిలేసిన‌ప్పుడు వ్య‌క్తిగ‌త పాల‌సీ తీసుకుందాము అనుకుంటే వ‌య‌సు కార‌ణంగా ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వ‌స్తుంది. అలాగే, గ్రూప్ ఇన్సురెన్స్ పాల‌సీలో కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఒక్కోసారి క‌వ‌రేజ్ మొత్తం సరిపోదు. అటువంట‌ప్పుడు ఆసుపత్రి ఖ‌ర్చుల‌కు, చికిత్స‌ల‌కు డ‌బ్బు సొంతంగా చెల్లించాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ మీకు ఇప్ప‌టివ‌ర‌కు వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా పాల‌సీ లేక‌పోతే..ఉద్యోగం మారుతున్న స‌మ‌యంలో గ్రూప్ పాల‌సీని వ్య‌క్తిగ‌త పాల‌సీగా మార్చుకోవ‌చ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని