Insurance: ఆరోగ్య బీమాలో వెయిటింగ్ పిరియ‌డ్‌ను త‌గ్గించుకోవ‌చ్చా?

అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు ఒకే వెయిటింగ్ పిరియడ్ ఉండదు. ఇది పాలసీ, పాలసీకి భిన్నంగా ఉంటుంది.

Updated : 19 Feb 2022 14:54 IST

ఆరోగ్య బీమా కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన నిబంధ‌న‌ల‌లో వెయిటింగ్ పిరియ‌డ్ ఒక‌టి. పాల‌సీ కొనుగోలు చేసి, ప్రీమియం చెల్లింపులు ప్రారంభించిన‌ప్ప‌టికీ.. నిర్ధిష్ట‌ కాలం పాటు పాల‌సీ ప్ర‌యోజ‌నాలు ల‌భించ‌వు. ఈ కాలాన్ని వెయిటింగ్ పీరియ‌డ్ అంటారు. అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు ఒకే వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఇది పాలసీ, పాలసీకి భిన్నంగా ఉంటుంది. అలాగే, పాలసీ జారీ చేసే సంస్థను బట్టి కూడా మారుతుంది. 

కొంత‌మంది చికిత్స అవ‌స‌రం అని తెలిసిన తర్వాత‌ పాల‌సీ తీసుకుని క్లెయిమ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇలాంటి క్లెయిమ్‌ల వ‌ల్ల సంస్థ‌లు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. అటువంటి మోసాల‌ను నివారించేందుకు, బీమా దుర్వినియోగం కాకుండా ఆరోగ్య బీమా పాల‌సీలో బీమా సంస్థ‌లు వెయిటింగ్ పిరియ‌డ్‌ను భాగం చేస్తున్నాయి.

వెయిటింగ్ పిరియ‌డ్ .. ర‌కాలు

1. ఇనీషియ‌ల్ వెయిటింగ్ పిరియ‌డ్..
సాధార‌ణంగా స‌మ‌గ్ర‌ ఆరోగ్య బీమా పాల‌సీల‌లో ఇనీషియ‌ల్ వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. ఇది ప్రాథ‌మికంగా 30 రోజులు ఉంటుంది. బీమా సంస్థ‌ను బ‌ట్టి 90 రోజుల వ‌ర‌కు కూడా ఉండ‌చ్చు. ఈ స‌మ‌యం పూర్తైన‌ త‌ర్వాత‌ మాత్ర‌మే ఆరోగ్య బీమా పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తుంది. పాల‌సీదారుడి వ‌య‌సు ఎక్కువ ఉంటే వెయిటింగ్ పిరియ‌డ్ కూడా పెర‌గ‌వ‌చ్చు. ఎందుకంటే, వ‌య‌సు ఎక్కువగా ఉండే వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు ఆస్కారం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, మొద‌టిసారి పాల‌సీ కొనుగోలు చేసిన‌ప్పుడు మాత్ర‌మే వెయిటింగ్ పిరియ‌డ్ అమ‌ల‌వుతుంది. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణల‌పై వ‌ర్తించ‌దు. 

2. ప్ర‌మాదాల‌కు..
ప్ర‌మాదాలు అనుకోకుండా జ‌రుగ‌తాయి. కాబ‌ట్టి ప్ర‌మాదాల కార‌ణంగా చేసే ఆసుప‌త్రి క్లెయిమ్‌లకు వెయిటింగ్ పిరియ‌డ్‌ నిబంధనలు వ‌ర్తించ‌వు. వినియోగ‌దారునికి పాల‌సీ జారీ చేసిన మ‌రుస‌టి రోజు నుంచే క్లెయిమ్ దాఖ‌లు చేయ‌వ‌చ్చు.

3. ముందే ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు..
ముందుగా ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు.. దాదాపు అన్ని బీమా సంస్థ‌లు వెయిటింగ్ పీరియ‌డ్‌తోనే పాల‌సీల‌ను అందిస్తాయి. ఆరోగ్య బీమా ప్లాన్‌ కొనుగోలు చేస్తున్నప్పుడు, ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల‌ను తెలియ‌జేయ‌మ‌ని బీమా సంస్థ‌లు పాల‌సీదారుని కోర‌తాయి. డయాబెటిస్, రక్తపోటు, థైరాయిడ్, కిడ్నీ సంబంధిత రుగ్మతులు లేదా నిరంతరం మందులు వాడుతున్న ఏదైనా ఇతర వ్యాధులు, ఇవ‌న్ని ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల కింద‌కి వస్తాయి. వీటికి 12 నుంచి 48 నెల‌ల వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. అంటే, ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టికీ ఈ వ్యాధుల కార‌ణంగా వెయింటింగ్ పిరియ‌డ్‌లో పాల‌సీదారుడు ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే.. పాల‌సీ వ‌ర్తించ‌దు. ఈ కాలం పూర్తైన త‌ర్వాత మాత్ర‌మే పాల‌సీ ప్ర‌యోజ‌నాలు అందుతాయి.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రకారం.. ఆరోగ్య బీమా పాలసీని కొనడానికి 48 నెలల ముందు నిర్ధారణ అయిన ఏదైనా ఆరోగ్య‌ పరిస్థితి, అనారోగ్యం, గాయం, వ్యాధిని ముందుగా ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌గా ప‌రిగ‌ణిస్తారు.

4. ప్ర‌త్యేక వ్యాధులు..
కొన్ని వ్యాధుల‌కు నిర్ధిష్ట‌ వెయిటింగ్ పిరియ‌డ్ ఉంటుంది. హెర్నియా, ఈఎన్‌టీ, ట్యూమ‌ర్ వంటి వ్యాధులకు 2 నుంచి 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వెయిటింగ్ పిరియ‌డ్ ఉండే అవ‌కాశం ఉంది. ఇది వేరు వేరు బీమా సంస్థ‌ల‌కు వేరు వేరుగా ఉంటుంది. అలాగే, హెపటైటిస్ B, కాస్మెటిక్ సర్జరీలు, మ‌రికొన్ని ప్రాణాంతక వ్యాధుల‌ను బీమా సంస్థ‌లు క‌వ‌ర్‌ చేయ‌వు. అందువ‌ల్ల, పాల‌సీ తీసుకునేట‌ప్పుడు వివ‌రాల‌ను జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాలి.

5. మెట‌ర్న‌టీ..
ప్ర‌స‌వ స‌మ‌యంలో అయ్యే ఖ‌ర్చుల కోసం క‌వ‌ర్ చేస్తుంది. అన్ని స‌మ‌గ్ర బీమా పాల‌సీలు మెట‌ర్నిటి ప్ర‌యోజ‌నాల‌ను ఆఫ‌ర్ చేయ‌వు. కొన్ని బీమా సంస్థ‌లు మెట‌ర్న‌టి ప్ర‌యోజ‌నాల‌ను 12 నుంచి 36 నెల‌ల వెయిటింగ్ పిరియ‌డ్‌తో అందిస్తున్నాయి. దానికి తగ్గట్టు ప్రీమియం కూడా కాస్త ఎక్కువ ఉంటుందని గమనించాలి.

వెయిటింగ్ పిరియ‌డ్‌ను త‌గ్గించుకోవ‌చ్చా? 
ఆరోగ్య బీమా పాల‌సీలో వెయిటింగ్ పిరియ‌డ్‌ను త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. అద‌నపు ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా సంస్థ‌లు వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించుకోవడానికి అనుమతిస్తాయి. ఇందుకోసం వెయిటింగ్ పిరియ‌డ్ ర‌ద్దు యాడ్‌-ఆన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి, ముందుగా నిర్ధార‌ణ అయిన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చాలా సంస్థ‌లు 2 నుంచి 4 సంవ‌త్స‌రాల వెయిటింగ్ పిరియ‌డ్‌తో వ‌స్తాయి. అటువంటి వారు అద‌న‌పు ప్రీమియం చెల్లించి వేచి వుండే స‌మ‌యాన్ని 3-4 సంవ‌త్స‌రాల నుంచి 1-2 సంవ‌త్స‌రాల‌కు తగ్గించుకోవ‌చ్చు. 

ఉద్యోగులకు యజమానులు అందించే గ్రూప్ హెల్త్ ప్లాన్‌లలో సాధార‌ణంగా వెయిటింగ్ పీరియడ్ ఉండ‌దు. ఉద్యోగులు తమ గ్రూప్ హెల్త్ ప్లాన్‌ను వ్యక్తిగత ప్లాన్‌గా మార్చుకునే అవ‌కాశం ఉంది. అలాంట‌ప్పుడు బీమా సంస్థ‌లు వెయిటింగ్ పీరియడ్ లేకుండానే హెల్త్ పాలసీని అందిస్తాయి. వివరాలకు మీ బీమా సంస్థని సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని