Fixed deposits: పొదుపు కోసం ఎఫ్‌డీలపై ఆధారపడడం సరైన పద్ధతేనా?
సాధారణంగా పెట్టుబడులు అంటే అందరూ బ్యాంకు, పోస్టాఫీసు ఎఫ్‌డీల గురించి మాత్రమే ఆలోచిస్తారు. మొత్తం పెట్టుబడి అంతా, దీర్ఘకాలం వీటిలోనే మదుపు చేస్తే ఏమవుతుందనేది ఇక్కడ ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: చాలామంది పొదుపు చేయడానికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed deposits) ఆధారపడతారు. పెట్టుబడి మొత్తానికి రిస్క్ లేకపోవడం దీనికి బలమైన కారణం. ఈక్విటీలు లేదా ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన మూలధనంలా.. ఎఫ్‌డీల్లో పెట్టుబడి ప్రధాన మొత్తం హెచ్చుతగ్గులకు గురికాదు. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లు రిస్క్ లేని పెట్టుబడులుగా మదుపుదార్లు భావిస్తారు. ఎఫ్‌డీల్లోని ప్రధాన మొత్తం స్థిరంగా ఉంటుంది. పెట్టుబడి కాలంలో పెట్టుబడిదారులు స్థిరమైన వడ్డీ రేటు పొందుతారు. కానీ, అన్నిసార్లూ అన్ని వయసులవారికీ ఇది సరైన పెట్టుబడి కాదని చెప్పవచ్చు. ఎఫ్‌డీలపై రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాకపోవడం వల్ల, పెట్టుబడిదార్లను సంవత్సరాల తరబడి ఆర్థికంగా వెనుకబడేట్టు చేస్తుంది.
ఎఫ్‌డీలో పెట్టుబడి
బ్యాంకు ఎఫ్‌డీలు, ఇతర ఈక్విటీ ఆధారిత పెట్టుబడులపై వచ్చే రాబడిలో ఎంత తేడా ఉంటుందో ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. రమేష్ 2000-01లో పదవీ విరమణ చేస్తున్నప్పుడు చేతిలో రూ.20 లక్షల మూలధనాన్ని కలిగి ఉన్న రిస్క్ లేని వ్యక్తి. 2000-01లో బ్యాంకుల వడ్డీ రేటు దాదాపు 10 శాతం ఉన్నందున, అతడు సంతోషంగా మొత్తం రూ.20 లక్షల నిధిని బ్యాంకు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాడు. ఒక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీని పొందుతున్నాడు. ఆ సమయంలో అతడు జీవించడానికి అది సరిపోయేది కూడా. వాస్తవానికి 2000-01లో అతడి అసలు అవసరం సంవత్సరానికి దాదాపు రూ.1.20 లక్షలు, అంటే ఒక నెలలో దాదాపు రూ.10 వేలు. ఈ వడ్డీతో అతడు చాలా సౌకర్యవంతంగా కుటుంబంతో గడిపాడు.
ద్రవ్యోల్బణ ప్రభావం
రిస్క్ లేని పెట్టుబడి కావడంతో రమేష్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రెన్యువల్ చేస్తూనే ఉన్నాడు. కొంత కాలానికి, వడ్డీ రేట్లు పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడంతో అతడి దైనందిన నిత్యవసరాల ఖర్చుల కోసం ఇబ్బంది మొదలైంది. వ్యయ ద్రవ్యోల్బణం సూచిక ప్రకారం.. 2000-01లో నెలకు రూ.10,000 ఉన్న నెలవారీ ఖర్చు 2022-23లో దాదాపు రూ.40 వేలకు పెరిగింది. అంటే సంవత్సరానికి రూ.4,80,000 అయ్యింది. అంతేకాకుండా బ్యాంకు వడ్డీ రేట్లు దాదాపు 7-7.50 శాతం ఉండడంతో, అతడు ఇప్పుడు సంవత్సరానికి రూ.1.50 లక్షలు మాత్రమే పొందుతున్నాడు. అంటే, ఎఫ్‌డీపై నెలవారీ రాబడి రూ.12,500 మాత్రమే. నెల ఖర్చు మాత్రం ప్రస్తుతానికి రూ.40 వేలకు పెరిగింది.
కాబట్టి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ ప్రకారం.. 2000-01లో అతడి నిధి రూ.20 లక్షలు అయితే.. అదే కొనుగోలు శక్తిని కొనసాగించడానికి ఇప్పుడు దాదాపు రూ.75 లక్షలకు పెరిగి ఉండాలి. తక్కువ వడ్డీ రేటు కారణంగా, అతడి నిధిలో పెరుగుదల లేకపోవడంతో రమేష్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అంతగా బాలేదనే చెప్పాలి.
వడ్డీ రేటు స్థిరంగా ఉంటే సరిపోయేదా?
ఒకవేళ బ్యాంకు ఎఫ్‌డీ వడ్డీ రేటు 10% వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, అతడి రూ.20 లక్షల మూలధనానికి వార్షిక వడ్డీ రూ.2 లక్షలు..అంటే, నెలకు రూ.16,667 వచ్చేది. కానీ, ఇప్పటికే అతడి నెల ఖర్చు రూ.40,000 అయ్యింది. ఈ లెక్కలో ఎఫ్‌డీ రాబడి చూసుకున్నా కూడా అతడు వెనుకబడే ఉన్నాడు.
మరేం చేసుండాలి?
2000-01లో అతడి నెలవారీ అవసరం రూ.10,000 అయినందున, ఒక సంవత్సరంలో రూ.1.20 లక్షలు పొందేందుకు ఎఫ్‌డీలో రూ.12 లక్షలు ఉంచి, మిగిలిన రూ.8 లక్షలను ఈక్విటీ-ఆధారిత సాధనాల్లో పెట్టుబడి పెట్టాడనుకుందాం. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2001, జనవరి 1న 3,972 పాయింట్ల వద్ద ఉంది. అదే సెన్సెక్స్ 2023 ఫిబ్రవరి 28న 59,007 పాయింట్ల వద్ద ఉన్నందున, రూ.8 లక్షల పెట్టుబడి గత 22 సంవత్సరాలలో రూ.1.25 కోట్లకు పైగా పెరిగేది. ద్రవ్యోల్బణానికి ధీటుగా అతడి నిధి పెరిగి ఉండేది. అందువల్ల అతడి నిధి మొత్తంలో 40 శాతాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రస్తుత నిధి ఇప్పుడు రూ.1.37 కోట్లకు (ఎఫ్‌డీ, ఈక్విటీ నిధి కలిపి) పైగా ఉండేది. రమేష్ మంచి జీవన ప్రమాణాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు.
వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఎలా?
బ్యాంకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మొదట్లో 10% ఉన్నా.. తర్వాత 5-6 శాతానికి పడిపోయాయి. కాబట్టి, మీ వార్షిక ఖర్చులకు సరిపడా మొత్తం లభించకపోవచ్చు. ఇలాంటప్పుడు, మీరు కొంత మొత్తాన్ని ఈక్విటీ నుంచి బ్యాంకు డిపాజిట్లోకి మార్చుకుని అదనపు వడ్డీ పొందొచ్చు.
గమనిక: ఇక్కడ బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆధారంగానే గణాంకాలు తెలిపాం. ఈక్విటీ పెట్టుబడులు మార్కెట్ల ఫలితాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం