Elon Musk: ట్విటర్‌కు పోటీగా మస్క్‌ కొత్త సోషల్‌ మీడియా?

ఓ కొత్త సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు మస్క్‌ తెలిపారు...

Published : 27 Mar 2022 13:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా అది వినూత్నంగానే ఉంటుంది. అధునాతన విద్యుత్తు కార్లు, అంతరిక్షయానాలతో అందరినీ అబ్బురపరిచిన ఆయన తాజాగా మరో రంగంలోకీ ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల పనితీరుపై పలు సందర్భాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కొత్త సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ట్విటర్‌లో ఓ ఫాలోవర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

‘‘ఎలాన్ మస్క్‌ ఓ కొత్త సామాజిక మాధ్యమాన్ని నిర్మించడంపై ఆలోచిస్తారా?వాక్‌ స్వాతంత్ర్యంతో పాటు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండి, తక్కువ అసత్య ప్రచారాలకు ఆస్కారం ఉండే ఓ వేదికను అందుబాటులోకి తీసుకురండి. అలాంటి వేదిక ఇప్పుడు అవసరమని భావిస్తున్నాను’’ అని ప్రణయ్‌ పటోలే అనే ఫాలోవర్‌ మస్క్‌ని ట్విటర్‌లో అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ.. దీనిపైనే ‘‘నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను’’ అని సమాధానమిచ్చారు.

‘వాక్‌ స్వాతంత్ర్య సూత్రాలను విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు’ అంటూ గతంలో పలు సందర్భాల్లో సామాజిక మాధ్యమాలపై ఎలాన్‌ మస్క్‌ విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇటీవలే ఆయన ట్విటర్‌లో ఓ పోల్‌ నిర్వహించారు. ‘‘ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేయాలంటే స్వేచ్ఛగా మాట్లాడడం చాలా ముఖ్యం. ట్విటర్‌ ఈ నియమానికి కట్టుబడి ఉందని మీరు భావిస్తున్నారా?’’ అని పోల్‌ నిర్వహించారు. ఈ పోల్‌లో మొత్తం 20,35,924 మంది పాల్గొన్నారు. వీరిలో 70.4 శాతం మంది ‘‘లేదు’’ అని.. 29.6 శాతం మంది ‘‘అవును’’ అని సమాధానం ఇచ్చారు. పోల్‌ ఫలితాలు చాలా ముఖ్యమని జాగ్రత్తగా సమాధానం ఇవ్వాలని మస్క్‌ కోరడం గమనార్హం.

ఇప్పటికే ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో తమ గళాన్ని అణదొక్కుతున్నారని చాలా మంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాక్‌ స్వాతంత్ర్యానికి తొలి ప్రాధాన్యమంటూ చాలా వేదికలే పుట్టుకొచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ‘ట్రుత్‌’ పేరిట ఓ కొత్త వేదికను అందుబాటులోకి తెచ్చారు. అలాగే Gettr, Parler, Rumble వంటి మాధ్యమాలూ వచ్చాయి. అవేవీ ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌కు ఉన్నంత ఆదరణను మాత్రం చూరగొనలేకపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని