దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డిగా ఎన్‌పీఎస్‌ మంచిదేనా?

దీర్ఘ‌కాలంలో ఉప‌యోగ‌ప‌డే పొదుపు ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని మీకు అనిపిస్తే `ఎన్‌పీఎస్‌` స‌రైన పెన్ష‌న్ ప‌థ‌కం అని చెప్ప‌వ‌చ్చు.

Updated : 10 Feb 2022 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం ఆర్థిక అవ‌స‌రాలు తీర్చుకోవ‌డానికి పెన్ష‌న్ అనేది ఎవ‌రికైనా అవ‌స‌ర‌మే. దీనికి ఎన్‌పీఎస్ (నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌)లో పెట్టుబ‌డి మంచి ఆప్ష‌న్‌గానే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్‌పీఎస్ అనేది దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ఎంపిక‌గా ఉద్దేశించింది. అందుకే ఇది క‌నీసం 5 ఏళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్‌తో వ‌స్తుంది. ఈ 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్‌లో ఉప‌సంహ‌ర‌ణ‌లు అనుమ‌తించ‌రు.

క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన, దీర్ఘ‌కాలంలో ఉప‌యోగ‌ప‌డే పొదుపు ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని మీకు అనిపిస్తే ఎన్‌పీఎస్‌ స‌రైన పెన్ష‌న్ ప‌థ‌కం అని చెప్పొచ్చు. పీఎఫ్ఆర్‌డీఏ అందించే ఈ పెన్ష‌న్ ప‌థ‌కంలో 18-75 ఏళ్ల మ‌ధ్య ఉన్న భార‌తీయ పౌరులంద‌రికీ, అలాగే ఎన్ఆర్ఐల‌కు, ఓసీఐ (ఓవ‌ర్సీస్ సిటిజ‌న్ ఆఫ్ ఇండియా)  మదుపు చేయొచ్చు.

ఒక ఎన్‌పీఎస్ పెట్టుబ‌డిదారుడు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు కంటే ముందే ఎన్‌పీఎస్ నుంచి నిష్క్ర‌మించ‌వ‌చ్చు. లాక్-ఇన్ పీరియ‌డ్ 10 సంవ‌త్స‌రాల నుంచి ఇపుడు 5 సంవ‌త్స‌రాల‌కు తగ్గించారు. పెట్టుబ‌డిదారుడు 60 ఏళ్ల వయసు కంటే ముందే విత్‌ డ్రా  చేసినట్టయితే 20 శాతాన్ని మాత్రమే తీసుకుని, 80% ఫండ్‌ని యాన్యుటీ రూపంలో ఉంచాలి. నిధిలో మొత్తం రూ. 2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్న‌ట్ల‌యితే పెట్టుబ‌డిదారుడు మొత్తం డ‌బ్బుని ఒకేసారి ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

మదుపరు చేసేవారు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు త‌ర్వాత కూడా 75 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డిని కొన‌సాగించ‌వ‌చ్చు. అక‌స్మాత్తుగా సదరు వ్యక్తి మర‌ణిస్తే, వ‌చ్చే సొమ్ము సంబంధిత నామినీల‌కు వెళుతుంది. అందులో గ‌రిష్ఠంగా  ముగ్గురు నామినీలకు ఇస్తారు. నామినీలు యాన్యుటీని ఎంచుకోవ‌చ్చు. లేదా ఏక మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

ఎన్‌పీఎస్ అనేది దాని చందాదారుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందించే మంచి ప‌థ‌కంగానే చెప్పొచ్చు. దీన్ని ఎంపిక‌చేసిన టాప్ ఫండ్ హౌస్‌లు నిర్వ‌హిస్తాయి. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) నియంత్ర‌ణ‌లో ప‌నిచేస్తుంది. ఎన్‌పీఎస్‌లో మ‌దుపుదారులు పెట్టిన నిధిని కార్పొరేట్ బాండ్‌లు, ప్ర‌భుత్వ బాండ్‌ల‌ను అంత‌ర్లీన సెక్యూరిటీలుగా ఉన్న ఫండ్ ఆప్ష‌న్‌ల‌లో 100% పెట్టుబ‌డి పెట్ట‌డానికి అనుమ‌తి ఉంది. ఈక్విటీ ఫండ్ ఎంపిక కింద మీ పొదుపులో గ‌రిష్ఠంగా  75% పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ఎన్‌పీఎస్‌ ఒక భారీ మార్కెట్ పెట్టుబ‌డి ప‌థ‌కం అయినందున‌, దీర్ఘ‌కాలంలో చాలా మంది పెట్టుబ‌డిదారుల‌కు ఆర్థికంగా ఉప‌యోగం ఉండే అవ‌కాశాలు ఎక్కువే ఉంటాయి. కొంత మంది అధిక రాబ‌డిని కోరుకుంటారు కానీ రిస్క్ ఉండ‌కూడ‌దు, ఇటువంటి వారికి కూడా దీనిలో పెట్టుబ‌డి మంచి ఆప్ష‌న్ ఆనే చెప్పాలి. 

ఈ ఖాతాను ప్రారంభించ‌డానికి కేవ‌లం రూ. 1,000 చెల్లించాలి.  ఆ త‌ర్వాత పీఎంఎల్ఏ (మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం నియ‌మాల‌)కి లోబ‌డి ఎంత మొత్తం అయినా చెల్లించ‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ చందాదారుల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. 80 సీ కింద ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.50 ల‌క్ష‌ల ప‌రిమితి వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌డానికి అర్హ‌త పొంద‌డ‌మే కాకుండా, సెక్ష‌న్ 80 సీసీడీ (1బీ) కింద ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 50 వేల వ‌ర‌కు అద‌న‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నం కూడా పొందొచ్చు.

చాలా వరకు పెన్షన్ పథకాల్లో అధిక చార్జీలు ఉంటాయి.  కాబట్టి వాటి రాబడి తక్కువగా ఉంటుంది. అదే ఎన్పీఎస్ లో మదుపు చేసి మెచ్యూరిటీ సమయానికి యాన్యుటీ ఎంచుకున్నట్టయితే ఛార్జీలు తక్కువ కాబట్టి పెన్షన్ మొత్తం ఎక్కువగా పొందొచ్చు. దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టి, పదవీ విరమణ నిధి తో పాటు పెన్షన్ కూడా పొందాలనుకునే వారికి ఎన్పీఎస్  సరైన పథకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని