Updated : 11 Feb 2022 16:41 IST

మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్‌ల ద్వారా పెట్టుబ‌డులు స‌రైన‌వేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ‌తంలో పెట్టుబ‌డిదారులు పొదుపు అంటే సంప్రదాయ ప‌థ‌కాలైన బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసుల్లో టైమ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్‌, మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ (ఎంఐఎస్‌), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్‌ (ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) లాంటి ప‌థ‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌, షేర్లలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. మ‌దుపుదారులకు ఈక్విటీల్లో పెట్టుబ‌డుల‌పై గ‌తంలో పెద్దగా అవ‌గాహ‌న ఉండేది కాదు. కానీ ఆన్‌లైన్ సౌక‌ర్యాలు పెరిగిన త‌ర్వాత ప్రతి రోజూ ఈక్విటీల్లో హెచ్చుత‌గ్గులు తెలిసిపోతున్నాయి. దీంతో ఈక్విటీల‌పై పెట్టుబ‌డులు పెట్టడం ప్రారంభించారు. డైర‌క్ట్‌గా షేర్లలో పెట్టుబ‌డులు పెట్టకుండా ప్రాథమికంగా ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశించేవారు మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌కి నిపుణులైన ఫండ్ మేనేజ‌ర్స్ ఉంటారు. వీరు పెట్టుబ‌డిదారుల త‌ర‌ఫున ఈక్విటీ మార్కెట్‌లోనూ, వివిధ ప్రభుత్వ/ప్రైవేట్ బాండ్స్ లాంటి వాటిలోనూ పెట్టుబ‌డులు పెడుతుంటారు.

సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌): చిన్న మొత్తాలతో క్రమం తప్పకుండా ప్రతి నెలా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లోకి పెట్టుబ‌డుల‌కు బ్యాంక్ ద్వారా సిప్‌ ఆప్షన్‌ పెట్టుకోవచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్స్ సిప్ మ‌దుప‌రులకు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో, సంపదను సృష్టించడంలో సహాయపడుతుంది. డైరెక్ట్ ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్టడానికి కంపెనీల ఆర్థిక ఆరోగ్యాన్ని అధ్యయనం చేయడానికి, ఈక్విటీ మార్కెట్‌ల‌ను ట్రాక్ చేయ‌డానికి వ్యక్తికి సమయం, జ్ఞానం, ఆసక్తి ఉండాలి. ఇలాంటి అనుభ‌వం, ఇత‌ర ప‌రిమితుల‌ను అధిగ‌మించ‌డానికి, అలాగే మార్కెట్ న‌ష్టాల‌ను మ‌రింత త‌గ్గించ‌డానికి ఈక్విటీ-ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్లలో సిప్‌ చేయడం ఉత్తమమైన మార్గం. మార్కెట్ గమనం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. మార్కెట్ దిగువలో ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టినట్లయితే అది మరింత దిగువకు వెళ్లొచ్చు. ఇలాంటి హెచ్చుతగ్గులని ఊహించలేం కాబట్టి, ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన కొంత మొత్తం పెట్టడం వల్ల సగటున రిస్క్ తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో రూ.1 ల‌క్ష కంటే ఎక్కువ దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్‌టీసీజీ)పై 10% ప‌న్ను రేటుతో, పెట్టుబ‌డిదారులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశాన్ని సిప్‌ కల్పిస్తుంది.

సిప్ ద్వారా కచ్చితమైన రాబడి పొందొచ్చా?
సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఒక మార్గం మాత్రమే. ఇందులో రిస్క్ తగ్గుతుంది కానీ కచ్చితమైన రాబడి వస్తుందని చెప్పలేం. మార్కెట్ ఆధారంగా ఒక్కోసారి నష్టాలు కూడా రావచ్చు. కాబట్టి, ఈక్విటీ ఫండ్స్‌లో ప్రవేశించే ముందు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం మంచిది. మార్కెట్ దిగువలో ఉన్నప్పుడు మరికొంత అదనపు మొత్తాన్ని మదుపు చేస్తే అధిక యూనిట్స్ సమకూర్చుకోవచ్చు. తద్వారా రాబడి పెరుగుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని