Health Insurance: కంపెనీ ఇచ్చే ఆరోగ్య బీమా స‌రిపోతుందా?

సాధారణంగా  కార్పొరేట్ పాల‌సీతో పోలిస్తే వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా పాల‌సీలో ఎక్కువ ప్ర‌యోజనాలు ఇమిడి ఉంటాయి.

Updated : 29 Jul 2022 16:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా అనేది ఇటీవల త‌ర‌చుగా వింటున్న పదం. ఉద్యోగుల‌కు చాలా కంపెనీలు ఆరోగ్య బీమా సౌక‌ర్యాన్ని ఉచితంగా క‌ల్పిస్తున్నాయి. కంపెనీ ఆరోగ్య బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పించిన‌ప్ప‌టికీ మీకు, మీ కుటుంబానికి సొంతంగా వేరే ఆరోగ్య బీమా పాల‌సీ ఉంటేనే మంచిది. సాధారణంగా  కార్పొరేట్ పాల‌సీతో పోలిస్తే వ్య‌క్తిగ‌త ఆరోగ్య బీమా పాల‌సీలో ఎక్కువ ప్ర‌యోజనాలు ఇమిడి ఉంటాయి.

కార్పొరేట్ పాల‌సీల‌లో త‌క్కువ బీమా: ఏదైనా ఆరోగ్య బీమా పాల‌సీలో దాని విలువ చాలా ముఖ్య‌మైన‌ది. బృంద బీమా కాస్త త‌క్కువ‌గా ఉంటుంది. ఈ బీమా పాల‌సీల‌లో అందించే స‌గ‌టు బీమా మొత్తం రూ. 1 ల‌క్ష నుంచి రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చు. ప్ర‌స్తుత కాలంలో ఈ బీమా మొత్తం ఏ మాత్రం స‌రిపోదు. ప్ర‌తి కుటుంబానికి క‌నీసం రూ. 10-15 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా ఉండాలని బీమా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

కార్పొరేట్ పాల‌సీ కుటుంబ స‌భ్యుల‌ను క‌వ‌ర్ చేస్తుందా?
చాలా వరకు బృంద బీమా పాల‌సీలు త‌ల్లిదండ్రుల‌ను క‌వ‌ర్ చేయ‌వు. కొన్ని పాల‌సీల‌లో జీవిత భాగ‌స్వామి, పిల్ల‌ల‌కు కూడా క‌వ‌రేజ్ ఉండ‌దు. ఇలాంటి పాల‌సీలు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కార్పొరేట్ పాల‌సీ అంద‌రికీ స‌రిపోయేంతా విస్తృత‌మైన ఆరోగ్య భ‌ద్ర‌త‌ను అందించ‌లేదు. ఈ కార‌ణం చేత కార్పొరేట్ క‌వ‌ర్‌పై మాత్ర‌మే ఆధార‌ప‌డ‌కుండా కుటుంబానికి త‌గినంత‌ ఆరోగ్య బీమా క‌వ‌రేజీని అందించ‌డానికి ఫ్యామిలీ ఫ్లోట‌ర్ లేదా సీనియ‌ర్ సిటిజ‌న్ ఆరోగ్య‌ బీమా క‌లిగి ఉండాలి.

ఉద్యోగ స్థితి: మీరు ఉద్యోగం మారాల‌ని నిర్ణ‌యించుకున్నా, ఉద్యోగ విర‌మ‌ణ చేసినా లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాల‌నుకున్నా కంపెనీ బీమా పాల‌సీ ఉండ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్య‌క్తిగ‌తంగా/ఫ్యామిలీ అంత‌టికీ ఆరోగ్య బీమా  పాల‌సీ ఉండడం అత్య‌వ‌స‌రం.

కార్పొరేట్ పాల‌సీ ముందుగా ఉన్న వ్యాధులను (PED) క‌వ‌ర్ చేస్తుందా?
ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోక‌ముందే ఎవ‌రైనా కాలేయం, మూత్ర‌పిండాలు, గుండెజ‌బ్బుతో బాధ‌ప‌డుతుంటే.. త‌ర్వాత పాల‌సీ తీసుకున్నా కూడా పాల‌సీని పూర్తిగా తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణం చేత కార్పొరేట్ పాల‌సీని క‌లిగి ఉన్నా వీలైనంత త్వ‌ర‌గా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం చాలా మంచిది. చిన్న వ‌య‌స్సులోనే కొనుగోలు చేస్తే ప్రీమియంపై చాలా ఎక్కువ ఆదా చేసుకోవ‌చ్చు.

కార్పొరేట్ పాల‌సీలో రైడ‌ర్‌ల ఎంపిక ఉంటుందా?
యాడ్‌-ఆన్‌ల‌తో పాల‌సీలో అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇంటి వద్ద చికిత్స‌, ఓపీడీ ఖ‌ర్చుల కోసం క‌వ‌రేజ్ వంటి యాడ్‌-ఆన్‌లు వైద్య ఖ‌ర్చును గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తాయి. బీమాదారులు వారికి అత్యంత అవ‌స‌ర‌మైన రైడ‌ర్‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. మీకు న‌చ్చిన ఫీచ‌ర్‌ల‌ను అందించ‌డం కార్పొరేట్ పాల‌సీలో సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు.

కార్పొరేట్ పాల‌సీలో ప‌రిమితులు: ఈ పాల‌సీల్లో బీమా మొత్తంపై లేదా గ‌ది అద్దె క‌వ‌రేజీపై ప‌రిమితి ఉంటుంది. పాల‌సీలో వీటిని స‌బ్‌-లిమిట్స్‌, కో-పేమెంట్స్ అంటారు. స‌హ‌-చెల్లింపు కింద మొత్తం ఆసుప‌త్రి బిల్లులో కొంత శాతాన్ని పాల‌సీదారు భ‌రించ‌వ‌ల‌సి ఉంటుంది. ఉప‌-ప‌రిమితి నిబంధ‌న‌ల ప్ర‌కారం పాల‌సీదారుడు గ‌ది అద్దెలో కొంత శాతాన్ని చెల్లించాలి. మీ కో-పేమెంట్ క్లాజ్‌లో మీరు ఆసుప‌త్రి బిల్లులో 20% భ‌రించాల‌ని పేర్కొన్న‌ట్ల‌యితే, ఆసుప‌త్రి బిల్లు రూ.5 ల‌క్ష‌లు అయితే, మీరు రూ. 1 ల‌క్ష చెల్లించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌పై మీకు త‌క్కువ నియంత్ర‌ణ ఉన్న కార్పొరేట్ పాల‌సీపై మాత్ర‌మే ఆధాప‌డ‌టం మంచిది కాదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని