Published : 14 Jun 2022 12:53 IST

`జీపీఎఫ్‌` పెట్టుబ‌డులకు రాబ‌డి ఆశాజ‌న‌కంగా లేదా?

ప్ర‌భుత్వ ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ అయిన `జ‌న‌ర‌ల్ ప్రావిడెంట్ ఫండ్` (జీపీఎఫ్) వ‌డ్డీ రేటు ప్ర‌స్తుతం 7.10 శాతంగా ఉంది. ఈ వ‌డ్డీ రేటు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నిరాశ‌గా క‌నిపిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగుల `ఈపీఎఫ్‌` వ‌డ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. దీనిక‌న్నా కూడా `జీపీఎఫ్‌` వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో `జీపీఎఫ్‌` విఫ‌ల‌మైంద‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల వైపు వాద‌న‌. చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు జ‌న‌వ‌రి 1, 2004కి ముందు `జీపీఎఫ్‌`లో చేరారు. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత  `జీపీఎఫ్‌`పై ఆధార‌ప‌డే ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువే.

ఆర్ధిక సంవ‌త్స‌రంలో రూ. 5 ల‌క్ష‌ల‌కు మించిన చందాపై వ‌డ్డీ ప‌న్ను ప‌రిధిలోకి రావ‌డంతో `జీపీఎఫ్‌`లో పెట్టుబ‌డుల ద్వారా ఆర్ధిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క‌ష్టంగా మారింది. జ‌న‌వ‌రి 1, 2004కి ముందు చేరిన చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు జ‌న‌ర‌ల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌)ని ఒక ఆద‌ర్శ పెట్టుబ‌డి సాధ‌నంగా చూశారు. గ‌తంలో ఇది ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఫండ్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వ‌డ్డీ రేటును అందించేది. 2021 ఆర్ధిక సంవ‌త్స‌రం వ‌ర‌కు మొత్తం రాబ‌డి పన్ను ర‌హితంగా ఉండేది.

కాబ‌ట్టి, చాలావ‌ర‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులు `జీపీఎఫ్‌` భ‌విష్య‌త్తుకి ఉప‌యోగ‌ప‌డే ఒక మంచి ఆర్ధిక వ‌న‌రుగా భావించేవారు. ఈ వ‌డ్డీ రేటుతో వ‌చ్చే ఆదాయాన్ని చూసుకుని పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌కు ప్ర‌ణాళిక‌లు వేసుకునేవారు. గ‌తంలో వ‌డ్డీ రేటు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించేది. అందుచేత వారి ప్రాథ‌మిక వేత‌నాన్ని ఈ ఫండ్‌లో ఇష్టంగా పెట్టుబ‌డిగా పెట్టేవారు. భ‌విష్య‌త్తు పెట్టుబ‌డుల‌కు `జీపీఎఫ్‌` ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఆద‌ర్శ మార్గంగా క‌నిపించేది. కానీ ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగులు జీపీఎఫ్‌ను అలా చూడ‌టం లేదు.

ఉదా: ఒక ప్ర‌భుత్వ వైద్యుడు త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత 12 ఏళ్ల తర్వాత ప్ర‌స్తుత ధ‌ర ప్ర‌కారం దాదాపు రూ. 1.50 కోట్ల ఖ‌ర్చుతో మెరుగైన సౌక‌ర్యాల‌తో న‌ర్సింగ్‌హోమ్‌ను ఏర్పాటు చేయాల‌నుకున్నారు. ఈ నిధిని కూడ‌గ‌ట్టుకోవ‌డానికి ఆయ‌న `జీపీఎఫ్‌`లో నెల‌కు రూ. 1 ల‌క్ష పెట్టుబ‌డి పెట్ట‌డం ప్రారంభించారు. దీనికి ప్ర‌స్తుతం 7.10 శాతం వార్షిక వ‌డ్డీ రేటును జీపీఎఫ్ అందిస్తుంది. అయితే గ‌తంలో ఒక ఆర్ధిక సంవ‌త్స‌రంలో రూ. 5 ల‌క్ష‌ల విరాళాల‌పై ఆయ‌న పొందే వ‌డ్డీ ప‌న్ను ర‌హితంగా ఉండేది. కాని ఇప్పుడు అద‌న‌పు చందాపై అత‌ను సంపాదించే వ‌డ్డీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయానికి జోడించ‌బ‌డుతుంది. ఫ‌లితంగా అత‌నికి వ‌డ్డీపై 30% వరకు ప‌న్ను చెల్లింపు వుంటుంది.

కాబ‌ట్టి, రూ. 5 ల‌క్ష‌ల‌కు మించిన విరాళాల‌పై అంటే సంవ‌త్స‌రానికి రూ. 7 ల‌క్ష‌ల విరాళాల‌పై ప‌న్ను అనంత‌ర రాబ‌డి రేటు 4.97 శాతంగా ఉంటుంది. ఫ‌లితంగా పెట్టుబ‌డి వ్య‌వ‌ధిలో జీపీఎఫ్‌పై వ‌డ్డీ రేటు మార‌దు అనుకుంటే ప‌న్ను ర‌హిత మొత్తంపై ఆ డాక్ట‌ర్ 12 సంవ‌త్స‌రాల‌లో రూ. 93,39,426 సంపాదిస్తాడు, విరాళాల‌లో ప‌న్ను విధించ‌ద‌గిన భాగంపై రూ. 1,14,19,871 సంపాదిస్తాడు. 12 సంవ‌త్స‌రాల పాటు `జీపీఎఫ్‌`లో సంవ‌త్స‌రానికి రూ. 1 ల‌క్ష పెట్టుబ‌డి ద్వారా అత‌ని మొత్తం సంపాద‌న రూ. 2,07,59,297 అవుతుంది.

అయితే, ప్ర‌స్తుతం రూ. 1.50 కోట్ల వ్య‌యంతో న‌ర్సింగ్ హోమ్ ఏర్పాటుక‌యితే, (ద్ర‌వ్యోల్బ‌ణం రేటు ఏడాదికి 10 శాతంగా ఉంటే)  దీని వ్య‌యం 12 ఏళ్ల త‌ర్వాత దాదాపు రూ. 4.71 కోట్లు అవుతుంది. కాబ‌ట్టి జీపీఎఫ్‌లో నెల‌కు రూ. 1 ల‌క్ష పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెట్టుబ‌డిదారుడు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత న‌ర్సింగ్‌ హోమ్‌ను ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన దానిలో స‌గం కంటే త‌క్కువ పొంద‌గ‌లుగుతాడు. అంతేకాకుండా విద్యారంగంలో 10-12 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్నందున‌, ఉన్న‌త విద్య ల‌క్ష్యం కూడా జీపీఎఫ్‌లో పెట్టుబ‌డుల ద్వారా మాత్ర‌మే నెర‌వేరాలంటే క‌ష్టం.

ప్ర‌స్తుతం ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో క్లిష్ట స‌మ‌యమే న‌డుస్తుంది. ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డ‌మే కానీ త‌గ్గేలా కూడా క‌నిపించ‌డం లేదు. కాబ‌ట్టి ఇత‌ర ఆర్ధిక ల‌క్ష్యాల సంగ‌తి అలా ఉంచితే, జీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్టిన వారికి డ‌బ్బు కొనుగోలు శ‌క్తిని చెక్కుచెద‌ర‌కుండా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌దు అని స్ప‌ష్టంగా తెలుస్తుంది. కాబట్టి, మీ లక్ష్యాల కోసం ఇతర పెట్టుబడి పథకాలని కూడా పరిశీలించడం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts