Health Insurance: ఆరోగ్య బీమా హామీ మొత్తం సరిపోతుందా?

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఎంత కవరేజీ ఎంచుకోవాలి?  ఎలాంటి పాలసీని తీసుకోవాలో తెలుసుకోండి..

Published : 10 Mar 2023 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్యకాలంలో చిన్నవయసులోనే వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు పీడిస్తున్నాయి. అంతుబట్టని కొన్ని వ్యాధులు అన్ని వయసుల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీని కలిగి ఉండడం ముఖ్యం. ఇంతకీ ఆరోగ్య బీమా ఎప్పుడు తీసుకోవాలి? ఎంత మొత్తానికి తీసుకోవాలి?

ఆరోగ్య బీమా ఎవరికి?

మీ కోసం మాత్రమే ఆరోగ్య బీమా ప్లాన్‌ కావాలా? మీ కుటుంబ సభ్యులను కూడా కవర్‌ చేసేది కావాలా? అనేది ముందు గుర్తించండి. దీన్ని బట్టి మీరు వ్యక్తిగత ప్లాన్‌ కోసం వెళ్లవచ్చు. లేదంటే ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా ప్లాన్‌ను పరిశీలించొచ్చు. తర్వాత, మీ వయసు, కుటుంబ వైద్య చరిత్ర, ముందస్తు అనారోగ్యాలు, వైద్య ఖర్చుల స్వభావం, వైద్య ద్రవ్యోల్బణం మొదలైన వాటి ఆధారంగా అవసరమైన కవరేజీ ఉన్న పాలసీని ఎంచుకోవచ్చు.

ఆరోగ్యంగా ఉన్నప్పుడే..

చాలా బీమా కంపెనీలు ఆరోగ్య బీమా ప్లాన్‌ను జారీ చేసేముందు ప్రీ-పాలసీ మెడికల్‌ స్క్రీనింగ్‌ కోసం అడుగుతాయి. ఊబకాయం, బీపీ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి వ్యాధులు సాధారణంగా అనారోగ్యకరమైన జీవనశైలి నుంచి ఉత్పన్నమవుతాయి. అటువంటి పరిస్థితులు లేనప్పుడే పాలసీని పొందడం చాలా మంచిది. చాలా ఆరోగ్య బీమా పాలసీలు పాలసీ ప్రారంభించిన మొదటి రోజు నుంచి ముందుగా ఉన్న వ్యాధులను కవర్‌ చేయవనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి. కొనుగోలు చేసిన బీమా ప్లాన్‌పై ఆధారపడి, పాలసీ ప్రారంభ తేదీ నుంచి సాధారణంగా 36-48 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ తర్వాత వచ్చే వ్యాధులు కవరేజీలో ఉంటాయి.

అధిక కవరేజీ..

వైద్య సాంకేతికత/ చికిత్స, రోగనిర్ధారణ చికిత్సా విధానంలో అపారమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి చికిత్సలకు ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల ఎక్కువ హామీ మొత్తంతో ఉన్న బీమా ప్లాన్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా విదేశాల్లో ఆరోగ్య సంరక్షణ చికిత్సను పొందడం అనేది గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన అంశం. బీమా సంస్థలు తమ ఆరోగ్య బీమా పథకాల్లో గ్లోబల్‌ కవరేజీని అందించడం ప్రారంభించాయి. అటువంటి పాలసీని ఎంచుకోవడం అదనపు ప్రయోజనం. కనీసం రూ.5-10 లక్షల వరకు బీమా హామీ ఎంచుకోవడం మేలు. ఫ్లోటర్ పాలసీ అయితే రూ.15-20 లక్షల హామీ ఎంచుకోవచ్చు. కొన్ని పాలసీలు 'రెస్టోరేషన్ బెనిఫిట్' తో పాలసీలను అందిస్తున్నాయి. దీనివల్ల హామీ మొత్తంలో రెండింతల వరకు ఉపయోగించుకోవచ్చు. అధిక ప్రీమియం చెల్లించలేని వారు ఇలాంటి పాలసీలను ఎంచుకోవచ్చు.

చివరిగా: పాలసీని కొనుగోలు చేసేటప్పుడు విస్తృతమైన, ఎక్కువ క్లెయిమ్‌ రేషియో, అధిక నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్న బీమా సంస్థను ఎంచుకుంటే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు