బ్యాంకుల్లో మీ డ‌బ్బు సుర‌క్షిత‌మేనా?

దేశ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను కుదిపేసిన‌ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణం త‌ర్వాత డిపాజిట‌ర్ల‌కి బ్యాంకుల్లో త‌మ క‌ష్టార్జితం భ‌ద్రంగానే ఉంటుందా లేదా అన్న సందేహాలు త‌లెత్తున్నాయి. జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగానే ఉంటున్న‌ప్ప‌టికీ దేశ బ్యాంకింగ్ రంగ మూలాలు బ‌లంగానే ఉన్నాయి. ఈ విష‌యంలో డిపాజిటర్లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే డిపాజిట‌ర్ల ప్ర‌యోజ‌నాల‌ను..

Published : 16 Dec 2020 15:23 IST

దేశ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను కుదిపేసిన‌ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణం త‌ర్వాత డిపాజిట‌ర్ల‌కి బ్యాంకుల్లో త‌మ క‌ష్టార్జితం భ‌ద్రంగానే ఉంటుందా లేదా అన్న సందేహాలు త‌లెత్తున్నాయి. జ‌రుగుతున్న ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగానే ఉంటున్న‌ప్ప‌టికీ దేశ బ్యాంకింగ్ రంగ మూలాలు బ‌లంగానే ఉన్నాయి. ఈ విష‌యంలో డిపాజిటర్లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే డిపాజిట‌ర్ల ప్ర‌యోజ‌నాల‌ను ర‌క్షించేందుకు బ్యాంకులు క‌చ్చితంగా చ‌ట్ట‌బ‌ద్ధ ద్ర‌వ్య నిష్ప‌త్తి(ఎస్ఎల్ఆర్‌), న‌గ‌దు నిల్వ‌ల నిష్ప‌త్తి(సీఆర్ఆర్‌)ల‌ను నిర్వ‌హించేలా ఆర్‌బీఐ చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే గ‌తంలో కొన్ని బ్యాంకుల విష‌యంలో డిపాజిట‌ర్లు ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకుల్లో మ‌నం దాచుకున్న సొమ్ము భ‌ద్ర‌మేనా, అనుకోని ప‌రిణామాలు సంభ‌విస్తే నియంత్ర‌ణ సంస్థ‌లు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాయో ఇప్ప‌డు తెలుసుకుందాం. అనుకోని కార‌ణాల వ‌ల్ల బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన‌ప్పుడు మన డ‌బ్బు సుర‌క్షిత‌మేనా కాదా అని తెలుసుకునే హక్కు మ‌న‌కుంది. బ్యాంకులు తమ డిపాజిట‌ర్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేని ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ప్ర‌భుత్వం ఆయా బ్యాంకుల లైసెన్సుల‌ను ర‌ద్దు చేసి మూసివేయ‌డ‌మో లేదా మ‌రో పెద్ద బ్యాంకులో విలీనం చేయ‌డ‌మో చేస్తారు.

డిపాజిట‌ర్ల‌కు చెల్లింపుల‌కోసం బ్యాంకులు త‌మ ఆస్తుల‌ను విక్ర‌యిస్తాయి. ఈ ప్ర‌క్రియ‌లో ఇబ్బందులున్న‌ ప‌క్షంలో వాటిని మ‌రో బ్యాంక్ టేకోవ‌ర్ చేస్తుంది. దీని ద్వారా డిపాజిట‌ర్ల‌ ప్ర‌యోజ‌నాలకు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌దు. ఎందుకంటే టేకోవ‌ర్ చేసిన బ్యాంక్ ఆ బ్యాంక్ ఆస్తుల‌తో పాటు బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకుంటుంది.

బ్యాంకులు సంక్షోభ స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు ఆర్‌బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేష‌న్(డీఐసీజీసీ) రంగ ప్ర‌వేశం చేస్తుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం డిపాజిట‌ర్ల‌కు రూ.1 ల‌క్ష వ‌ర‌కు బీమా హామీ మొత్తం ఉంటుంది. దీనిని డీఐసీజీసీ ప్ర‌త్య‌క్షంగా లేదా అధీకృత లిక్విడేట‌ర్ ద్వారా డిపాజిట‌ర్ల‌కు అందేలాగా చూస్తుంది. ఇందులో అస‌లుతోపాటు వ‌డ్డీ క‌లిపి ఉంటాయి.

సంక్షోభంలో ఉన్న బ్యాంకులు ఎవ‌రెవ‌రికి బాకీలు ఉన్నాయో అధీకృత లిక్విడేట‌ర్ జాబితా సిద్ధం చేసిన త‌ర్వాత రెండు నెల‌ల‌కు డీఐసీజీసీ ఈ చెల్లింపులు జ‌రిగేలా చూస్తుంది. 2017 లో తొమ్మిది స‌హకార బ్యాంకుల డిపాజిట‌ర్ల‌కు డీఐసీజీసీ రూ.307 కోట్ల‌ను చెల్లించేలా చూసింది.

ఈ నిబంధ‌న‌లు అన్ని రకాల బ్యాంకుల‌కు వ‌ర్తిస్తుందా?

ఈ నిబంధ‌న‌లు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్, స‌హాకార‌ బ్యాంకుల‌కు ఒకే రకంగా వ‌ర్తిస్తాయి. అయితే మీ ఖాతా లేదా డిపాజిట్ల‌ను మీరు ఎలా నిర్వ‌హిస్తున్నార‌న్న దాని మీద ఈ నిబంధ‌నలు ఆధార‌ప‌డి ఉంటాయి. మీ డిపాజిట్ల‌పై అందే బీమా హామీ మొత్తాన్ని క్లెయిం చేసుకునేందుకు డీఐసీజీసీ ఎలాంటి నిబంధ‌న‌ల‌ను పాటిస్తుందో ఈ క్రింది ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా వివ‌రంగా తెలుసుకుందాం.

  1. ర‌మేష్ అనే వ్య‌క్తికి ఒకే బ్యాంక్‌కి చెందిన మూడు శాఖ‌లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడ‌నుకుందాం. సంక్షోభ సమ‌యంలో మూడు ఖాతాలున్న‌ప్ప‌టికీ అత‌నికి కేవ‌లం రూ.1 ల‌క్ష మాత్ర‌మే బీమా మొత్తాన్ని పొంద‌గ‌లడు.
  2. ర‌మేష్ అనే వ్య‌క్తికే రెండు వ్య‌క్తిగ‌త ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలుండి, మ‌రో ఖాతాను అత‌ని భార్య‌తో క‌లిసి ఉమ్మ‌డిగా నిర్వ‌హిస్తుంటే అతనికి వ్య‌క్తిగ‌త‌+ఉమ్మ‌డి ఖాతాల క్రింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా మొత్తాన్ని పొందుతాడు.
  3. ర‌మేష్ కి వ్య‌క్తిగ‌త ఖాతాల‌తో పాటు ఏదేనీ కంపెనీలో భాగ‌స్వామిగా గానీ లేదా డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఖాతా క‌లిగి ఉంటే అత‌ను ఆయా ఖాతాల‌కు విడివిడిగా బీమా సొమ్మును పొందుతాడు.
  4. అత‌ను వ్య‌క్తిగ‌త ఖాతాతో పాటు ఒక కంపెనీ య‌జ‌మానిగా మ‌రో ఖాతాను నిర్వ‌హిస్తుంటే ఆయా ఖాతాల్లోని డిపాజిట్ మొత్తాల‌కు విడివిడిగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు గ‌రిష్టంగా బీమా ర‌క్ష‌ణ ఉంటుంది.
  5. ఒక వేళ ర‌మేష్‌కి ఒక‌టికంటే ఎక్కువ ఉమ్మ‌డి ఖాతాలుండి అందులో ప్రైమ‌రీ హోల్డ‌ర్లు వేర్వేరుగా ఉంటే, ఆయా ఉమ్మ‌డి ఖాతాల్లోని డిపాజిట్ల‌కు వేర్వేరుగా బీమా ర‌క్ష‌ణ ఉంటుంది.

అన్ని బ్యాంకుల్లో సొమ్ము భద్ర‌మేనా?

డిపాసిటర్లకు బీమా కోసం బ్యాంకులు డీఐసీజీసీకి ప్రీమియం చెల్లిస్తాయి కానీ బ్యాంకులు డిపాసిటర్ల నుండి ఈ ప్రీమియం వసూలు చేయరు. ప్ర‌స్తుతం వంద వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌, విదేశీ, గ్రామీణ, చిన్న బ్యాంకులు ఈ ప్రీమియాల‌ను డీఐసీజీసీకి చెల్లిస్తున్నాయి.

బ్యాంకులోని మీ డిపాజిట్ల‌కు బీమా ఉందా లేదా అనే విష‌యాన్ని ప‌రిశీలించండి. ఒక నివేదిక ప్ర‌కారం మార్చి 31 2017 నాటికి రూ.72.47 ల‌క్ష‌ల కోట్ల‌కు బీమా ర‌క్ష‌ణ లేద‌ని తెలిపింది. దీనిపై ఆర్‌బీఐ ఇంకా వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. డీఐసీజీసీ కి ఏదేనీ బ్యాంకు వ‌రుసగా మూడు ప‌ర్యాయాలు ప్రీమియం చెల్లించ‌క‌పోతే దాని రిజిస్ట్రేష‌న్ ర‌ద్ద‌వుతుంది. చ‌ట్టం ప్రకారం డీఐసీజీసీ ఆయా బ్యాంక్‌కి త‌న బీమా ప‌రిధిని ఉప‌సంహ‌రింప‌జేసీ విష‌యాన్ని ప‌త్రికాముఖంగా తెలుపుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని