Chitra Ramkrishna: హిమాలయ యోగికి రహస్య విషయాలు.. చిత్రా రామకృష్ణపై ఐటీ దాడులు

జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణన్‌పై ఒక హిమాలయ యోగి ప్రభావం

Published : 17 Feb 2022 13:50 IST

దిల్లీ: జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణపై ఒక హిమాలయ యోగి ప్రభావం చూపారన్న అంశం ఇప్పుడు స్టాక్‌ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. ఆ యోగితో ఆమె మాట్లాడిన వ్యక్తిగత సంభాషణలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన అత్యంత కీలక, రహస్య సమాచారాన్ని ఆమె.. ఆ యోగితో పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర రామకృష్ణ నివాసంపై గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. 

ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించడం, తిరిగి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్‌  రెగ్యులేటర్‌ సెబీ ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులోనే ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్ర రామకృష్ణకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. హిమాలయాల్లో ఉండే ఓ ఆధ్యాత్మిక యోగి చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను పావులా ఉపయోగించుకుని.. ఎన్‌ఎస్‌ఈని ఆ యోగి నడిపించారని సెబీ గుర్తించింది. 

ఆ యోగి ప్రభావం వల్లే ఎలాంటి క్యాపిటల్‌ మార్కెట్‌ అనుభవం లేని వ్యక్తిని ఎన్‌ఎస్‌ఈ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, సలహాదారుగా నియమించారని సెబీ పేర్కొంది. అంతేగాక, ఎన్ఎస్‌ఈకి సంబంధించిన బిజినెస్‌ ప్రణాళికలు, బోర్డు అజెండా, ఆర్థిక అంచనాలు వంటి కీలక విషయాలను ఆ యోగితో  చిత్ర పంచుకున్నారని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినందుకు గానూ సెబీ ఆమెకు రూ.3 కోట్ల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు స్టాక్‌ మార్కెట్ల నుంచి నిషేధం విధించింది. అయితే తాను ఈ వ్యవహారంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని చిత్ర సమర్థించుకోవడం గమనార్హం. సదరు యోగిని ‘శిరోన్మణి’గా పేర్కొన్న ఆమె.. 20 ఏళ్లుగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిగత అంశాల్లో మార్గనిర్దేశం చేశారని సెబీకి వివరించారు.

2009లో ఎన్‌ఎస్‌ఈలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులైన చిత్రా రామకృష్ణ.. 2013లో సీఈవోగా ప్రమోట్‌ అయ్యారు. ఆ తర్వాత 2016లో వ్యక్తిగత కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని