House rental income: స్థిరాస్తిపై అద్దె ఆదాయం వస్తోందా?.. ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చా?

భార‌త‌దేశంలో స్థిరాస్తి అద్దె ద్వారా వ‌చ్చే ఆదాయం.. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల ప‌రిధిలోకి వ‌స్తుంది. 

Updated : 23 Jun 2022 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో చాలా మంది స్థితిమంతులు, ఏ ప‌నీ చేయ‌లేని వ‌య‌స్సులో పెద్ద‌వారు, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారు ఇళ్ల అద్దెలు, స్థిరాస్తి మీద వ‌చ్చే అద్దెల‌పై త‌మ జీవ‌నాన్ని కొన‌సాగిస్తుంటారు. కొంత మందికి పూర్తిగా ఈ అద్దెలే జీవ‌నాధారం. మ‌రి ఈ అద్దె ఆదాయంపై ఆదాయ ప‌న్ను ఉన్నట్టయితే వారి ఆదాయం త‌గ్గిపోతుంది. వీటిపై ఆదాయ ప‌న్ను ఉంటే ప‌న్నుల నుంచి ఎలా రాయితీ పొందాలి? ఎంత రాయితీ పొందొచ్చు? అద్దె ఆదాయం ఎంత వ‌ర‌కు ఉంటే ఆదాయ ప‌న్ను క‌ట్ట‌క్క‌ర్లేదు? ఇలాంటి విష‌యాలు అద్దెల ద్వారా ఆదాయం పొందే ప్ర‌తి స్థిరాస్తి యాజ‌మాని తెలుసుకోవాలి.

భార‌త‌దేశంలో స్థిరాస్తి అద్దె ద్వారా వ‌చ్చే ఆదాయం.. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల ప‌రిధిలోకి వ‌స్తుంది. స్థిరాస్తి యజ‌మానుల‌కు అద్దె నుంచి ల‌భించే ఆదాయంపై ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని అనేక ప‌న్ను ప్ర‌యోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మ‌డిగా ఆస్తిని కొనుగోలు చేసినా కూడా దానిపై వ‌చ్చే ఆదాయంపై ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

స్థిరాస్తి అద్దె ఆదాయంపై ఆదాయ ప‌న్ను: ఒక వ‌్య‌క్తి ఆదాయ ప‌న్ను స్లాబ్ రేటు ప్ర‌కారం అద్దెపై ప‌న్ను విధిస్తారు. ఉదా: ఒక వ్య‌క్తి ఇత‌ర ఆదాయం లేకుండా, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ అద్దె ఆదాయాన్ని మాత్ర‌మే ఆర్జిస్తే, ఆదాయ ప‌న్ను విధించ‌ద‌గిన కనీస ప‌రిమితి కంటే త‌క్కువ‌గా ఉన్నందున ఎటువంటి ప‌న్నూ ఉండదు. ఒకవేళ వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో అద్దె ఆదాయం 20% పెరిగితే, అప్పుడు ప‌న్ను వర్తిస్తుందా అంటే..  అద్దె ఆదాయంపై అందుబాటులో ఉన్న నిర్దిష్ట ప‌న్ను ప్ర‌యోజ‌నాల కార‌ణంగా అప్ప‌టికీ ప‌న్ను లేకుండా చూసుకోవచ్చు.

అద్దె ఆదాయంపై స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్: ప్రామాణిక తగ్గింపు (స‌్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్) సాయంతో స్థిరాస్తి యాజ‌మాని, ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. స్థిరాస్తి అద్దెల నుంచి ఆదాయాన్ని పొందే య‌జ‌మాని నిక‌ర ఆస్తి విలువ‌పై 30% స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఉదా: ఒక వ్య‌క్తి స్థిరాస్తి నుంచి రూ.3.60 ల‌క్ష‌లు పొందుతున్నాడు అనుకోండి. మున్సిపల్‌ ప‌న్నులు రూ.30 వేలు అయితే, అత‌డు పొందే నిక‌ర అద్దె రూ.3.30 ల‌క్ష‌లు. నిక‌ర అద్దె విలువ‌పై 30% స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ రూ.99,000. కాబ‌ట్టి స్థిరాస్తిపై అత‌నికి వ‌చ్చే ఆదాయం రూ.2,31,000 గా మాత్రమే పరిగణిస్తారు. అంటే, అత‌డు ఆదాయ ప‌న్ను ప‌రిధి కంటే త‌క్కువ ఆర్జిస్తున్నాడు. ఎన్నారైలు కూడా స్థిరాస్తి నుంచి వ‌చ్చే ఆదాయంపై ప్రామాణిక తగ్గింపు క్లెయిమ్ చేయొచ్చు.

ఇంటి రుణంపై ప‌న్ను ప్ర‌యోజ‌నం: మీరు గృహ రుణంపై చెల్లించే వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపును క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 24(బి) ప్ర‌కారం, ఇంటి య‌జ‌మాని సొంతింటికి చెల్లించే గృహ రుణంపై చెల్లించే వ‌డ్డీపై రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపును పొందొచ్చు. ఇల్లు అద్దెకి ఇచ్చినట్టయితే రూ.2 లక్షల పరిమితి వర్తించదు. అలాగే, అసలు మొత్తంపై అత‌డు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. మీరు గృహ రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన ఆస్తి నుంచి అద్దె ఆదాయాన్ని పొందిన‌ట్ల‌యితే, రుణానికి సంబంధించి చెల్లించిన వ‌డ్డీ, అసలుపై రూ.3.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చు. 

ఉమ్మ‌డి ఆస్తి య‌జ‌మానుల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నం: మీరు ఉమ్మ‌డిగా ఆస్తిని కొనుగోలు చేసిన‌ట్ల‌యితే, మీకు ల‌భించే అద్దె ఆదాయంపై కూడా ప‌న్ను ప్ర‌యోజ‌నాలుంటాయి. ఉమ్మ‌డి యాజ‌మాన్యం కింద‌, ఆస్తిలో వాటా స్ప‌ష్టంగా నిర్వ‌చించి ఉన్నట్లయితే, ఉమ్మ‌డి య‌జ‌మానులంద‌రూ త‌మ యాజ‌మాన్య నిష్ప‌త్తి ప్ర‌కారం ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఆస్తికి సంబంధించిన ప్ర‌తి ఉమ్మ‌డి య‌జ‌మాని గ‌రిష్ఠంగా వ‌ర్తించే మిన‌హాయింపు ప‌రిమితుల‌కు లోబ‌డి పైన తెలిపిన సెక్ష‌న్ల కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఉమ్మ‌డి య‌జ‌మానులు క్లెయిమ్ చేసిన మొత్తం మిన‌హాయింపు ఆ ఆర్థిక సంవ‌త్స‌రంలో చెల్లించిన గృహ రుణ‌ వ‌డ్డీని మించ‌కూడ‌దు.

చివ‌రిగా: య‌జ‌మానిగా ఆదాయ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క్లెయిమ్ చేయ‌డానికి యోచిస్తున్న‌ప్పుడు మీరు అద్దె ఒప్పందం, ఆస్తి ప‌త్రాలు వంటివి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఆదాయ ప‌న్ను విభాగం అద్దె ఆదాయానికి సంబంధించిన వివరాలను కోరినట్టయితే, మీకు అవి రుజువుగా ప‌నికి వ‌స్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని