Home loan: గృహ రుణం తీసుకుంటే బీమా త‌ప్ప‌కుండా కొనుగోలు చేయాలా?

గృహ రుణ బాధ్య‌త‌ను క‌వ‌ర్ చేసేందుకు బీమా తీసుకోవ‌డం మంచిదే, అయిన‌ప్ప‌టికీ త‌ప్ప‌నిస‌రిగా కొనుగోలు చేయాల‌ని నియ‌మం లేదు

Updated : 02 May 2022 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ రుణం తీసుకునే స‌మ‌యంలో రుణ గ్ర‌హీత త‌ప్ప‌నిస‌రిగా జీవిత బీమాను కొనుగోలు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతుంటాయి కొన్ని బ్యాంకులు. మ‌రి గృహ రుణం తీసుకోవాలంటే బీమా కొనుగోలు త‌ప్ప‌నిస‌రా? ఒక‌వేళ బీమా తీసుకోవాలంటే.. బ్యాంకు వారు చెప్పిన పాల‌సీనే ఎంచుకోవాలా?

సొంతిటి క‌ల నెర‌వేర్చుకోవ‌డంలో గృహ రుణాలు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయి. గృహ రుణ ల‌భ్య‌త పెర‌గ‌డం, త‌క్కువ వ‌డ్డీకే రుణం ల‌భించ‌డం, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, తిరిగి చెల్లింపుల‌కు దీర్ఘ‌కాలం అవ‌కాశం ఉండ‌డం.. కొనుగోలుదారుల‌ను రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసే దిశ‌గా ప్రోత్స‌హిస్తున్నాయి. గృహ రుణం మంజూరు స‌మ‌యంలో గృహ రుణంతో పాటు జీవిత బీమాను కొనుగోలు చేయ‌మ‌ని చాలావ‌ర‌కు బ్యాంకులు, రుణ సంస్థ‌లు వినియోగ‌దారునికి సూచిస్తుంటాయి. గృహ రుణ బాధ్య‌త‌ను క‌వ‌ర్ చేసేందుకు బీమా తీసుకోవ‌డం మంచిదే, అయిన‌ప్ప‌టికీ త‌ప్ప‌నిస‌రిగా కొనుగోలు చేయాల‌నే నియ‌మేమీ లేదు. 

సాధార‌ణంగా గృహ రుణం ల‌క్ష‌ల్లో ఉంటుంది. కాబ‌ట్టి, చెల్లింపుల‌కు దీర్ఘ‌కాల స‌మ‌యం ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో అనుకోని ప్ర‌మాదం కార‌ణంగా రుణం తీసుకున్న వ్య‌క్తి అక‌స్మాత్తుగా మ‌ర‌ణించినా.. చెల్లింపులు చేయలేని ప‌రిస్థితులు ఏర్ప‌డినా.. అప్ప‌టి నుంచి చెల్లించాల్సిన రుణం కుటుంబ స‌భ్యుల‌కు భారం కాకుండా ఉండేందుకు మీ వంతు బాధ్య‌త‌గా గృహ రుణ మొత్తానికి సరిపడా బీమా పాల‌సీని తీసుకోవ‌డం మంచిది. బీమా సంస్థ‌లు అందించే మూడు ర‌కాల పాలసీల‌తో గృహ రుణాన్ని క‌వ‌ర్ చేయ‌వ‌చ్చు: 1. ట‌ర్మ్ జీవిత బీమా, 2. గృహ రుణ బీమా, 3.వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా.

ట‌ర్మ్ పాల‌సీ: త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ మొత్తాన్ని ట‌ర్మ్ ప్లాన్ అందిస్తుంది. కుటుంబంలోని వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. కుటుంబ స‌భ్యులు ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌కుండా ట‌ర్మ్ ప్లాన్ అండ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ ట‌ర్మ్ ప్లాన్‌ను తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తుంటారు. ఒక వ్య‌క్తి వార్షిక ఆదాయానికి క‌నీసం 12-15 రెట్లు ట‌ర్మ్ బీమా హామీ మొత్తం ఉండాలి. కనీసం 60 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు పాల‌సీ కొన‌సాగించాలి. ఇప్ప‌టికే ట‌ర్మ్ ప్లాన్ తీసుకున్న వారు మీ ప్ర‌స్తుత ఆదాయానికి 15 రెట్లు హామీ మొత్తం ఉందా? అనేది చూసుకోవాలి. గృహ రుణం తీసుకుని ఉంటే దీనికి అద‌నంగా గృహ రుణ మొత్తాన్ని క‌లపాలి. ఈ మొత్తానికి మరొక ట‌ర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. లేదా అదే పాలసీలో బీమా మొత్తాన్ని పెంచే ఆప్షన్ ఉంటే వినియోగించుకోవచ్చు.

హోమ్ ఇన్సురెన్స్ ప్లాన్: గృహ రుణం కోసం ప్ర‌త్యేకంగా మార్ట‌గేజ్ ఇన్సురెన్స్ ప్లాన్‌ను తీసుకోవ‌చ్చు. అయితే, ఇది చెల్లించాల్సిన రుణాన్ని (అవుట్ స్టాండింగ్ మొత్తం) మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు- రూ.35 ల‌క్ష‌ల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. 10 సంవ‌త్స‌రాలు చెల్లించిన త‌ర్వాత, చెల్లించాల్సిన మొత్తం రూ.22 ల‌క్ష‌లు ఉంటే.. 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ రూ.22 ల‌క్ష‌ల‌ను మాత్ర‌మే మార్ట‌గేజ్ ఇన్సురెన్స్ ప్లాన్ క‌వ‌ర్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా అవుట్ స్టాండింగ్ మొత్తం మాత్ర‌మే పాల‌సీ కింద క‌వ‌ర‌వుతుంది. ట‌ర్మ్ ప్లాన్ అలా కాదు. చెల్లించాల్సిన మొత్తం ఎంత ఉన్న‌ప్ప‌టికీ హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. హోమ్ ఇన్సురెన్స్ ప్లాన్‌ ఎంచుకునే వారు గృహ రుణం తీసుకున్న కొత్త లోనే తీసుకోవడం మంచిది.   

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా: ప్రమాదం అనేది ఎప్పుడు, ఎలా జరుగుతుందో చెప్పలేం. కానీ ప్ర‌మాదం కార‌ణంగా ఒక్కోసారి ప్రాణాలను కోల్పోవాల్సి రావొచ్చు లేదా పాక్షిక‌, శాశ్వ‌త వైక‌ల్యం ఏర్ప‌డ‌వ‌చ్చు. అలాంటి సంద‌ర్భంలో ఆదాయాన్ని కోల్పోతే, రోజువారీ ఖ‌ర్చుల‌కు తోడు ఈఎంఐ చెల్లింపులు భారం అవుతాయి. వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా తీసుకుంటే.. ప్రమాదం వల్ల మృతి చెందితే పాలసీలో పేర్కొన్న బీమా హామీ సొమ్ము మొత్తాన్ని ఒకేసారి నామినీకి అందజేస్తారు. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం ఏర్పడితే.. న‌ష్టాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని హామీ సొమ్ము పూర్తిగా లేదా కొంత శాతం బాధితుడికి అందజేస్తారు. కొన్ని పాలసీలు బీమా హామీ కంటే ఎక్కువ సొమ్మునే పరిహారంగా ఇస్తాయి. ఈ మొత్తం నుంచి ఈఎంఐలను సుల‌భంగా చెల్లించ‌వ‌చ్చు. 

చివ‌రగా.. గృహ రుణ గ్రహీతగా బీమా పాలసీని కచ్చితంగా కొనుగోలు చేయాల‌నే నియ‌మేమీ లేదు. పూర్తిగా మీ అభీష్టానుసారం కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ విషయాన్ని మీరు బ్యాంకులకు తెలుపవచ్చు. అవసరం అయితే బ్యాంకు గ్రీవెన్స్ సెల్ లేదా ఆర్బీఐ కి కూడా ఫిర్యాదు చేయవచ్చు. కొంత మంది అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే గృహ రుణ చెల్లింపులు చేస్తుంటారు. అటువంటి వారు 'మార్ట‌గేజ్ ఇన్సురెన్స్ ప్లాన్ల‌'ను ఎంచుకోవ‌చ్చు. గృహ రుణం ఉన్నా లేక‌పోయినా ట‌ర్మ్‌, వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌డం మంచిదే. మీ వ‌య‌సు, గృహ రుణం మొత్తం, కాల‌వ్య‌వ‌ధి, మీకు ఇప్ప‌టికే ఉన్న పాల‌సీలు, చెల్లించాల్సిన ప్రీమియం, మొదలైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని మీ అవ‌స‌రాల‌కు స‌రిపోయే ప్లాన్‌ను ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని