Investments in public sector banks: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడులు ఉపసంహరించొచ్చు

ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మంచి స్థితిలో ఉన్న ప్రస్తుత తరుణంలో, వాటిల్లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం ముందుకెళ్లాలని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక సూచించింది. అందుకు ఇది సరైన సమయమనీ వివరించింది.

Updated : 09 Jul 2024 07:26 IST

ఇది సరైన తరుణమే
ఎస్‌బీఐ నివేదిక

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మంచి స్థితిలో ఉన్న ప్రస్తుత తరుణంలో, వాటిల్లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం ముందుకెళ్లాలని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక సూచించింది. అందుకు ఇది సరైన సమయమనీ వివరించింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకుల ఏకీకరణ విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలనీ కోరింది. ‘కేంద్ర బడ్జెట్‌ 2024-25’ పేరుతో సోమవారం ఒక నివేదికను ఎస్‌బీఐ రీసెర్చ్‌ విడుదల చేసింది.

ఐడీబీఐ బ్యాంకుపై స్పష్టత ఇవ్వాలి: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిమిత్తం, ఆ బ్యాంకులో దాదాపు 61% వాటాను ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి విక్రయిస్తున్నట్లు గుర్తు చేసింది. ఈ బ్యాంకులో ప్రభుత్వ వాటాల విక్రయానికి 2022 అక్టోబరులో, 2023 జనవరిలో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపం) ఇచ్చిన ప్రకటనకు స్పందనగా అనేక ఆసక్తి వ్యక్తీకరణలు వచ్చాయని నివేదిక పేర్కొంది. రానున్న బడ్జెట్‌లో ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి 45%, ఎల్‌ఐసీకి 49.24% వాటాలున్నాయి.

దివాలా స్మృతిపై స్పష్టత ఇవ్వాలి: దివాలా స్మృతి (ఐబీసీ) ప్రక్రియపై ఆర్థిక సంస్థలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలనూ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పరిశీలిస్తుందనే ఆశాభావాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంస్థలు తమకు రావాల్సిన బకాయిల్లో 32 శాతాన్నే ఐబీసీ ద్వారా వసూలు చేసుకున్నాయని.. అంటే 68% క్లెయింలను కోల్పోయాయని వెల్లడించింది. దివాలా పరిష్కారానికి గడువు 330 రోజులకు బదులు 863 రోజులకు పెంచాలని సూచించింది. మొండిబాకీల వసూలుకు ఐబీసీ ఎంతో కీలకమని వెల్లడించింది. సెబీ ఏర్పాటు చేసిన ప్రత్యేక పరిస్థితుల నిధి (ఎస్‌ఎస్‌ఎఫ్‌) ఆశాజనకమైన ప్రారంభంగా పేర్కొంది. మొండిబాకీలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఎఫ్‌ మరింత అనుకూలంగా ఉండేలా, విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.


పొదుపును పెంచేలా..

క్విటీ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్ల రాబడిపై విధిస్తున్న పన్ను విధానాన్ని, బ్యాంకు డిపాజిట్లకూ వర్తింపచేయాలని నివేదిక సూచించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గృహస్థుల నికర ఆర్థిక పొదుపు  జీడీపీలో 5.3 శాతమే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.4 శాతానికి పెరిగిందనే అంచనాలున్నాయి. డిపాజిట్ల ప్రతిఫలంపై విధిస్తున్న పన్ను రేట్లను మ్యూచువల్‌ ఫండ్ల తరహాలోనే మారిస్తే బ్యాంకుల్లో కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్‌ అకౌంట్‌)తో పాటు, గృహస్థుల పొదుపూ పెరుగుతుందని వెల్లడించింది. పన్ను తగ్గడం వల్ల డిపాజిటర్లకు వడ్డీ ఆదాయం మిగులుందని, దీన్ని వారు కొనుగోళ్ల కోసం వినియోగిస్తారని, అప్పుడు ప్రభుత్వానికి జీఎస్‌టీ రూపంలో ఆదాయం అందుతుందని పేర్కొంది. అధిక నష్టభయం ఉన్న ఇతర పథకాలతో పోలిస్తే, బ్యాంకు డిపాజిట్ల పెరుగుదల వల్ల,  గృహస్థుల పొదుపులో ఆర్థిక స్థిరత్వం వస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని