Income Tax: ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె

వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్‌ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Published : 14 Jun 2024 00:36 IST

వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్‌ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆదాయపు రిటర్నులను సులభతరం చేస్తూ ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 2024-25 మదింపు సంవత్సరానికి గాను రిటర్నులు దాఖలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

త ఆర్థిక సంవత్సరానికి గాను అందుకున్న ఆదాయం వివరాలతో ఫారం 16, ఫారం 26ఏఎస్‌లను యాజమాన్యాలు అందిస్తున్నాయి. దీంతోపాటు ఆదాయపు పన్ను పోర్టల్‌లోనూ మీ ఆదాయం వివరాలతో వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)ను తీసుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో ఈ మూడూ కీలకం అనే సంగతి మర్చిపోవద్దు.


సరైన ఫారంలో..

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సరైన ఫారాన్ని ఎంచుకోవడం తప్పనిసరి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ఇప్పటికే ఈ ఫారాలను నోటిఫై చేసింది. పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే, ఆదాయపు పన్ను శాఖ దానిని అంగీకరించకపోవచ్చు. అప్పుడు అది ‘డిఫెక్టివ్‌ రిటర్ను’గా పరిగణిస్తారు. 

ఆదాయం, నివాస స్థితి, వ్యాపారం తదితరాల ఆధారంగా ఈ ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఏడు ఫారాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు ఫారాలే మనకు ఉపయోగపడతాయి.

ఐటీఆర్‌ 1 (సహజ్‌): ఇది చాలా సరళమైనది. రూ.50లక్షల లోపు వేతనం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ ఇతర మార్గాల్లో ఆదాయం అందుకున్నప్పుడు ఈ ఫారం వర్తిస్తుంది.

ఐటీఆర్‌ 2: రూ.50లక్షలకు మించి ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయం, విదేశీ ఆదాయం, ఒకటికి మించి ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని ఎంచుకోవచ్చు.

ఐటీఆర్‌ 3: సాధారణంగా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌), వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించే వారు దీన్ని ఉపయోగించాలి.


కొత్త, పాత పద్ధతుల్లో..

రిటర్నులను ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఇప్పుడు కీలకంగా మారంది. మినహాయింపులు వద్దు అనుకుంటే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. మినహాయింపులతోపాటు రిటర్నులు దాఖలు చేయాలని అనుకుంటే పాత పన్ను విధానంలోనే కొనసాగవచ్చు.

మీకు ఏ విధానం ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అందిస్తున్న కాలిక్యులేటర్‌ను వినియోగించుకోవచ్చు. అందులో అవసరమైన మేరకు వివరాలు నమోదు చేయడం ద్వారా ఏ విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో తెలిసిపోతుంది. దీని ద్వారా మీకు ప్రయోజనం చేకూరే పద్ధతిలో రిటర్నులు సమర్పించడం మంచిది.


కచ్చితమైన సమాచారంతో..

మీ పన్ను రిటర్నులు సమర్పించేందుకు సిద్ధమయ్యే ముందు కొన్ని విషయాలపై స్పష్టత ఉండాలి. కేవలం వేతనం ద్వారానే కాకుండా, ఇతర మార్గాల్లో మీకు ఏదైనా మొత్తం వచ్చిందా అనేది చూసుకోవాలి. అంటే పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల నుంచి డివిడెండ్లు, గతంలో వచ్చిన పన్ను రిఫండుపై వడ్డీలాంటివన్నీ చూసుకోవాలి. అప్పుడే మీ మొత్తం ఆదాయం ఎంత అనేది తెలుస్తుంది. ఏఐఎస్‌ను పరిశీలించినప్పుడూ ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆదాయ వివరాల్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేసుకున్నాకే రిటర్నులు సమర్పించడం మంచిది.


మినహాయింపుల కోసం..

పన్ను భారం తగ్గించుకునేందుకు మీరు పెట్టిన పెట్టుబడులు, తీసుకున్న బీమా పాలసీల వివరాలన్నీ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఫారం-16లో నమోదు చేయని మినహాయింపులు ఉంటే, వాటినీ రిటర్నులలో చూపించుకోవచ్చు. కానీ, తగిన ఆధారాలు మీ దగ్గర ఉండాలి.


బ్యాంకు ఖాతా ధ్రువీకరణ..

రిటర్నులు సమర్పించి, ఏదైనా పన్ను రిఫండు ఉంటే దాన్ని పొందేందుకు వీలుగా సరైన బ్యాంకు ఖాతా వివరాలను అందించాలి. ఆదాయపు పన్ను పోర్టల్‌లో మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, ఐఎఫ్‌ఎస్‌సీలను సరిచూసుకోండి. మీకు ఒకటికి మించి ఖాతాలున్నప్పుడూ వాటి వివరాలు పేర్కొనడం మంచిదే. కానీ, రిఫండు ఏ ఖాతాకు రావాలన్నది సరిగ్గా ఎంచుకోవాలి. రిటర్నులు దాఖలు చేసే సమయంలో మరోసారి ఈ వివరాలను ధ్రువీకరించుకోవడం మేలు.


గడువులోపే..

జులై 31 వరకూ గడువున్నా, వీలైనంత తొందరగా రిటర్నులు దాఖలు చేయడానికి ప్రయత్నించాలి. తీరా వ్యవధి దగ్గరకు వచ్చాక రిటర్నులను దాఖలు చేయడంలో ఇబ్బందులు వస్తే, గడువు తేదీ దాటిపోతుంది. జరిమానా చెల్లించాల్సి రావచ్చు. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశమూ కోల్పోతాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని