Shaktikanta Das: కీలక రేట్లపై ఇప్పుడైతే సాహసాలు చేయలేం

ప్రస్తుత పరిస్థితిలో పరపతి విధాన వైఖరిని మార్చడం తొందరపాటే అవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు.

Published : 19 Jun 2024 02:42 IST

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

దిల్లీ: ప్రస్తుత పరిస్థితిలో పరపతి విధాన వైఖరిని మార్చడం తొందరపాటే అవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం లక్ష్యిత శ్రేణికి పరిమితం కానందున, కీలక రేట్ల విషయంలో ఇప్పుడైతే ఎటువంటి సాహసం చేయాలని ఆర్‌బీఐ అనుకోవట్లేదని ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో ఆయన తెలిపారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఫ్యూచర్స్, ఆప్షన్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో అధిక ట్రేడింగ్‌ లావాదేవీలు నమోదవుతుండటాన్ని సెబీతో కలిసి ఆర్‌బీఐ కూడా పర్యవేక్షిస్తోందని.. ఈ అంశంలో ఏ నిర్ణయమైనా సెబీనే తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికానికి కరెంటు ఖాతా లోటు (సీఏడీ), 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు నమోదైన 1.2% కంటే కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని దాస్‌ చెప్పారు. వచ్చే వారంలో ఈ గణాంకాలు విడుదల కానున్నాయి. 2022-23లో తొలి 9 నెలలకు గాను కరెంటు ఖాతా లోటు, జీడీపీలో 2.6 శాతంగా నమోదైంది. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడంతో, 2023-24 ఇదే కాలంలో ఇది 1.2 శాతానికి దిగివచ్చింది. అంతర్జాతీయ బాండ్ల సూచీల్లో భారత్‌ చేరిక తర్వాత పెట్టుబడుల రాక పెరిగిందంటూ వస్తున్న వార్తలపై  స్పందిస్తూ.. భవిష్యత్తులో ఫారెక్స్‌ ఒడుదొడుకుల నియంత్రణకు అవసరమైన సాధనాలుగా వాడేందుకు, విదేశీ మారకపు నిల్వలను పెంచుకోవడాన్ని భారత్‌ కొనసాగిస్తుందని దాస్‌ వివరించారు. నిల్వలపరంగా వైవిధ్యం ఉండేందుకు పసిడి నిల్వలూ పెంచుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ అంచనా అయిన 7.2 శాతంగానే దేశ వృద్ధి రేటు నమోదుకావచ్చని ఆర్‌బీఐ నమ్ముతోందని పేర్కొన్నారు. ఏప్రిల్‌- జూన్‌లో అంచనాకు మించి వృద్ధి నమోదుకావచ్చని తమ అంతర్గత విశ్లేషణలో గుర్తించామని పేర్కొన్నారు. మొత్తం మీద ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధిక స్థాయిల్లోనే ఉన్నాయని, మున్ముందు ఇవి ఎలా ఉంటాయనే విషయంపైనా అనిశ్చితి నెలకొందని తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం నెమ్మదిగా ఉందని, ఇది వేగవంతమైతే వృద్ధి విషయంలో త్యాగం చేసే అంశాన్ని పరిశీలిస్తామని దాస్‌ వివరించారు. 


నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.62 లక్షల కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌ 17 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21% పెరిగి రూ.4.62 లక్షల కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ముందస్తు పన్ను (అడ్వాన్స్‌ ట్యాక్స్‌) చెల్లింపులు అధికంగా రావడంతోనే, వృద్ధి నమోదైందని తెలిపింది. తొలి విడత ముందస్తు పన్ను చెల్లింపునకు గడువు జూన్‌ 15 కాగా, ఈ వసూళ్లు   27.34% అధికంగా రూ.1.48 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (సీఐటీ)   రూ.1.14 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) రూ.34,470 కోట్లు ఉన్నాయి. 2024 జూన్‌ 17 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4,62,664 కోట్లుగా నమోదు కాగా, ఇందులో సీఐటీ రూ.1,80,949 కోట్లు, పీఐటీ (సెక్యూరిటీల లావాదేవీ పన్నుతో కలిపి) రూ.2,81,013 కోట్లు ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించింది. జూన్‌ 17 నాటికి రిఫండ్‌లు కూడా 34% పెరిగి  రూ.53,322 కోట్లకు చేరాయి. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 17 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (రిఫండ్‌ల సర్దుబాటుకు ముందు) రూ.5.16 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు