Published : 22 Mar 2022 11:17 IST

Tax Refund: ప‌న్ను వాప‌సు రాలేదా? కార‌ణమేంటో తెలుసుకున్నారా మరి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేదీ వ‌ర‌కు వేచి చూస్తుంటారు కొంద‌రు. అయితే, ఎంత త్వ‌ర‌గా రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేస్తే.. అంతే త్వ‌ర‌గా రీఫండ్ పొంద‌వ‌చ్చ‌నే విష‌యాన్ని విస్మ‌రిస్తుంటారు. ప‌న్ను చెల్లింపుదారులు సుల‌భంగా, కాగిత ర‌హితంగా, స‌మ‌ర్థ‌ంగా రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ గ‌త సంవ‌త్స‌రం కొత్త ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ లాంచ్ చేసింది. అయితే, ఈ కొత్త పోర్ట‌ల్‌లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌లు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌దింపు సంవ‌త్స‌రం (ఏవై) 2021-22 కి సంబంధించిన రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు డిసెంబ‌రు 31, 2021 వ‌ర‌కు గ‌డువు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొత్త ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ ద్వారా దాదాపు 6.25 కోట్ల మంది ప‌న్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ను దాఖలు చేశార‌ని, అందులో 4.5 కోట్ల‌కు పైగా రిట‌ర్నులు ప్రాసెస్ చేసి రీఫండ్లు జారీ చేశామ‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ తాజాగా వెల్ల‌డించింది. ఒక‌వేళ మీరు కూడా రీఫండ్ క్లెయిమ్ చేసి ఉంటే.. మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అయ్యిందా? లేదా ?చెక్ చేసుకోండి. ఒక‌వేళ రీఫండ్ రాక‌పోతే దానికి కార‌ణాలు ఏంటో తెలుసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయొచ్చు.

వెరిఫై చేయ‌క‌పోతే.. రీఫండ్ రాదు..
ప‌న్ను రిఫండ్ ఆల‌స్యం లేదా ర‌ద్దు అయ్యేందుకు ముఖ్య‌ కార‌ణం ఐటీఆర్ వెరిఫై చేయ‌క‌పోవడం. ఐటీఆర్ దాఖ‌లు చేసిన త‌ర్వాత నిర్ణీత స‌మ‌యంలో వెరిఫికేష‌న్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయ‌ని ఐటీఆర్‌ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోరు. వెరిఫికేష‌న్ చేయ‌కపోవ‌డం అంటే.. రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోవ‌డంతో స‌మానం. అంటే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961 ప్ర‌కారం.. ఐటీఆర్ ఫైల్ చేయనివారికి ఎదుర‌య్యే అన్ని ప‌రిణామాల‌ను మీరు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది.

అయితే, మీరు తగిన కారణాల‌ను చూపించి ధ్రువీకరణలో జాప్యాన్ని క్షమించమని అభ్యర్థించవచ్చు. అభ్యర్థనను సమర్పించిన తర్వాత మాత్రమే, మీ రీఫండ్ ఈ-ధ్రువీకరణ పూర్తి చేయగలరు. అలాగే, మీ అభ్యర్థనను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించిన తర్వాత మాత్రమే రిటర్నులు చెల్లుబాటు అవుతాయి.

ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం.. ఐటీఆర్ దాఖ‌లు చేసిన 120 రోజుల్లోపు ఈ-వెరిఫికేష‌న్ పూర్తి చేయాలి. డిజిట‌ల్‌గా లేక ప‌న్నుచెల్లింపుదారుడు సంత‌కం చేసిన ఐటీఆర్-V కాపీని బెంగుళూరులోని ‘సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)’ ఐటీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. 

ఆధార్ ఓటీపీ, బ్యాంక్ ఖాతా ఈవీసీ (ఎల‌క్ట్రానిక్ వెరిఫికేష‌న్ కోడ్‌), డీమ్యాట్ ఖాతా ఈవీసీ, ఏటీఎం ఈవీసీ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్‌సీ)ని ఉపయోగించి డిజిట‌ల్‌గా ఈ-వెరిఫికేషన్‌ పూర్తిచేయ‌వ‌చ్చు. ఆధార్ ఓటీపీ ద్వారా పూర్తి చేయాల‌నుకునే వారు ముందుగా త‌మ ఆధార్ నంబర్‌ను పాన్‌, మొబైల్ నంబర్లకు త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాలి. వెరిఫికేష‌న్ పూర్తైన త‌ర్వాత ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంత‌మైన‌ట్లు మీ ఈ-మెయిల్‌కు ఐటీ శాఖ స‌మాచారం అందిస్తుంది.

అదనపు పత్రాలు..
మీ రీఫండ్ రిక్వెస్ట్‌తో రిట‌ర్నుల‌ను ప్రాసెస్ చేయ‌డంలో ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు అద‌న‌పు ప‌త్రాలు అవ‌స‌ర‌మైతే పన్ను వాపసు ఆలస్యం కావచ్చు. ఈ స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు ప‌న్ను చెల్లింపుదారుడు అసెసింగ్ అధికారిని సంప్ర‌దించి.. అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాల‌ను అందించి ఎక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

అవుట్‌స్టాండింగ్ ప‌న్ను..
ప‌న్ను చెల్లింపుదారు చెల్లించాల్సిన ప‌న్ను త‌ప్పుగా లెక్కించ‌డం వ‌ల్ల రీఫండ్ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌రణకు గురై ఉండొచ్చు. చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ ప‌న్ను వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఐటీ శాఖ ప‌న్ను చెల్లింపుదారునికి నోటీసులు పంపిస్తుంది. అటువంటి సంద‌ర్భంలో ప‌న్ను చెల్లింపుదారులు మ‌ళ్లీ అన్ని ప‌త్రాల‌ను స‌రిచూసుకోవాలి. చెల్లించాల్సిన‌, చెల్లించిన ప‌న్ను, స్వీక‌రించ‌ద‌గిన రీఫండ్‌ను తిరిగి లెక్కించాలి.  

ఒకవేళ, ఆదాయపు పన్ను రిట‌ర్నుల‌లో మీరు ఇచ్చిన వివరాలు సరైనవైతే, మీరు మీ క్లెయిమ్‌కు మద్దతుగా మ‌రోసారి ఫైల్ చేయవచ్చు. అయితే, మీ వివరాలు తప్పుగా ఉన్నట్లయితే, నిర్ణీత వ్యవధిలోపు బకాయి ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.

బ్యాంకు ఖాతా..
ఆదాయ‌పు రీఫండ్ క్లెయిమ్ చేసేవారు ముందుగా ధ్రువీకరించిన బ్యాంకు ఖాత‌ను ఇవ్వాల్సి ఉంటుంది. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారుడు ఈ-వెరిఫికేష‌న్ ప్రాసెస్ కోసం ఈవీసీ ఎనేబుల్ చేసేందుకు ముందుగా ధ్రువీక‌రించిన బ్యాంకు ఖాతాను ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో పాటు ప‌న్ను రిట‌ర్నులు, ఇత‌ర ఫారాలు, ఈ-ప్రొసీడింగ్‌లు, రీఫండ్ రీ-ఇష్యూ, పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం, ఈ-ఫైలింగ్ ఖాతాకు సురక్షితమైన లాగిన్ కోసం ఈ-ధ్రువీకరణను ఉపయోగించొచ్చు.

బ్యాంక్ ఖాతా వివరాలు మారినట్లయితే, రీఫండ్ ప్రక్రియ ఆలస్యం కావ‌చ్చు. దీంతో పాటు మొబైల్ నంబర్, ఈ-మెయిల్, చిరునామా వంటివి ఆదాయపు పన్ను పోర్టల్‌లోని ప్రాథమిక వివరాలతో స‌రిపోలాలి. అందువ‌ల్ల ఈ వివ‌రాలు బ్యాంకులో, అలాగే ఆదాయపు పోర్ట‌ల్‌లోనూ అప్‌డేట్ చేసుకోవాలి.

రీఫండ్ స్టేట‌స్ చెక్ చేసుకుంటూ ఉండండి..
ఆదాయ ప‌న్ను శాఖ ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ స్టేట‌స్‌ను చూసుకోవ‌చ్చు. ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ ద్వారా రీఫండ్ వివ‌రాల్ని తెలుసుకోవ‌చ్చు. ఏదైనా కార‌ణం చేత ఆల‌స్య‌మైనా.. ఈ విష‌యాన్ని గుర్తించి స‌రైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. రీఫండ్ స్టేట‌స్‌ను ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకునేందుకు ఈ లింక్‌ని క్లిక్ చేయండి. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని