First Tweet: ట్విటర్‌ పిట్ట కూసిన తొలి ట్వీట్‌కు రూ.360 కోట్లు

ట్విటర్‌ (Twitter).. ఇప్పుడు మనందరి జీవితాల్లో ఓ భాగమైంది. అభిప్రాయాలు పంచుకోవడం దగ్గర్నుంచి.. చర్చా వేదికల వరకు ఈ వేదికపై ప్రతిక్షణం ఎన్నెన్నో సంభాషణలు

Published : 07 Apr 2022 18:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ (Twitter).. ఇప్పుడు మనందరి జీవితాల్లో ఓ భాగమైంది. అభిప్రాయాలు పంచుకోవడం దగ్గర్నుంచి.. చర్చా వేదికల వరకు ఈ వేదికపై ప్రతిక్షణం ఎన్నెన్నో సంభాషణలు సాగుతుంటాయి. మరి ఇంతటి ఘతన సాధించిన ట్విటర్‌ నుంచి వచ్చిన తొలి ట్వీట్‌ (First Tweet) కూడా అంతే ప్రత్యేకమైనది కదా.. అందుకే మరి.. అది రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ట్విటర్‌ పిట్ట కూసిన తొలి ట్వీట్‌ను గతేడాది వేలానికి పెట్టగా రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. తాజాగా దీన్ని ఏకంగా రూ. 360కోట్లకు అమ్మకానికి పెట్టారు.

16 ఏళ్ల క్రితం 2006 మార్చి 21న ట్విటర్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడైన జాక్‌ డోర్సీ (Jack Dorsey) ‘‘ జస్ట్‌ సెట్టింగ్‌ అప్‌ మై ట్విటర్‌ (just setting up my twttr) ’’ అంటూ ఈ మాధ్యమంలో తొలి సందేశమిస్తూ ట్విటర్‌ను పరిచయం చేశారు. గతేడాది సంస్థ ప్రారంభించి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా డోర్సీ ఈ తొలి ట్వీట్‌ను నాన్‌ ఫంగిబుల్ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ) రూపంలో వేలానికి పెట్టగా.. 2.9 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.22కోట్లు) ఇచ్చి బ్రిడ్జ్‌ ఒరాకిల్‌ సీఈఓ సీనా ఎస్టావీ దాన్ని సొంతం చేసుకున్నారు. 

అయితే ఆ ఎన్‌ఎఫ్‌టీ టోకెన్‌ను ఎస్టావీ.. ‘ఓపెన్‌సీ’ వెబ్‌సైట్లో అమ్మకానికి పెట్టారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో జరిగే ఈ వెబ్‌సైట్లో దీని ధరను 14,969 ఎతిరియమ్స్‌గా నిర్ణయించారు. అంటే 48 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.360కోట్లు)కు పైమాటే. ఎస్టావీ కొనుగోలు చేసిన ధర కంటే ఇది దాదాపు 16 రెట్లు ఎక్కువ. ఏప్రిల్‌ 13 ఉదయానికి ఈ సేల్‌ ముగియనుంది. ఈ విషయాన్ని ఎస్టావీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

‘‘ప్రపంచంలోనే మొట్టమొదటి ట్వీట్‌ను అమ్మాలనుకుంటున్నా. ఈ విక్రయం ద్వారా వచ్చే మొత్తంలో 50శాతం (అంటే దాదాపు 25 మిలియన్‌ డాలర్లు) ‘గివ్‌ డైరెక్ట్‌లీ’ అనే ఛారిటీ సంస్థను విరాళంగా ఇవ్వనున్నాను’’ అని ఎస్టావీ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే దీనికి జాక్‌ డోర్సీ స్పందిస్తూ.. ‘‘ 99 శాతం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని అడిగారు. దీనికి ఎస్టావీ బదులిస్తూ.. ‘‘ మిగతా 50శాతం నాకోసం ఉంచుకోవడం లేదు. ఆ మొత్తాన్ని బ్రిడ్జ్‌ ఒరాకిల్‌లోని బ్లాక్‌ఛెయిన్‌ ప్రాజెక్ట్స్‌ కోసం, మా ఉద్యోగుల కోసం ఉపయోగించాలని అనుకుంటున్నా. కానీ మీ సూచనలు నాకు చాలా విలువైనవి. మీకు ఇష్టమైతే చెప్పండి.. 100శాతం మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా ఇచ్చేస్తాను’’ అని ఎస్టావీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని