Jack Dorsey: హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. జాక్‌డోర్సే సంపదలో ₹4,327 కోట్లు ఆవిరి!

Jack Dorsey: హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో బ్లాక్‌ షేర్లు గురువారం ఓ దశలో 22 శాతం నష్టపోయాయి. దీంతో కంపెనీ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సంపద భారీ ఎత్తున కరిగిపోయింది.

Published : 24 Mar 2023 11:24 IST

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ ‘బ్లాక్‌’పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సంపద భారీగా తగ్గింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన వెంటనే బ్లాక్‌ షేర్లు భారీ ఎత్తున పతనమయ్యాయి. దీంతో డోర్సే సంపదలో 526 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4,327 కోట్లు) ఆవిరయ్యాయి. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఆయన సంపద 11 శాతం తగ్గి 4.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.

బ్లాక్‌ షేర్లు గురువారం ఓ దశలో 22 శాతం నష్టపోయాయి. చివరకు 15 శాతం నష్టంతో స్థిరపడ్డాయి. ట్విటర్‌ సహ- వ్యవస్థాపకుడైన డోర్సే (Jack Dorsey) సంపదలో అత్యధికం బ్లాక్‌ షేర్లతో ముడిపడి ఉన్నదే. ఆయన 4.4 బిలియన్‌ డాలర్ల సంపదలో బ్లాక్‌ షేర్ల వాటాయే 3 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ట్విటర్‌లో ఆయనకు 388 మిలియన్‌ డాలర్లు విలువ చేసే షేర్లు ఉన్నాయి.

‘బ్లాక్‌’ (అంతకుముందు పేరు స్క్వేర్‌) నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) ఆరోపించింది. ఖాతాదార్ల సంఖ్యను ఎక్కువగా చూపుతూ, సంస్థ షేరు విలువను కృత్రిమంగా పెంచుకుంటూ పోవడం ద్వారా వీరు పెట్టుబడిదార్లను, ప్రభుత్వాన్ని మోసగించారన్నది హిండెన్‌బర్గ్‌ ఆరోపణ. బ్లాక్‌ వినియోగదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని.. సంస్థలోని ఖాతాల్లో 40 నుంచి 75 శాతం నకిలీవని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమకు వెల్లడించినట్లు హిండెన్‌బర్గ్‌ తెలిపింది.
(ఇదీ చదవండి: అమెరికా సంస్థ బ్లాక్‌పై హిండెన్‌బర్గ్‌ సంచలన నివేదిక)

భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై జనవరి 24న హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) విడుదల చేసిన నివేదిక వల్లే, ఆ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ 140 బిలియన్‌ డాలర్లకు పైగా హరించుకుపోయిన సంగతి విదితమే. అంతకుముందు 2020లో విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ నికోలాపైనా ఈ సంస్థ ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లో కంపెనీ షేరు విలువ భారీగా పడిపోయింది. ఆ ఆరోపణలపై విచారణ జరపగా.. వ్యవస్థాపకుడు ట్రెవర్‌ మిల్టన్‌ అక్రమాలకు పాల్పడ్డట్లు రుజువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని