Jack Dorsey: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. జాక్‌ డోర్సే కొత్త యాప్‌

జాక్‌ డోర్సే మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని నిర్మిస్తున్నారు. బహుశా దీన్ని ట్విటర్‌కు పోటీగానే తీసుకొస్తున్నట్లు సమాచారం.

Updated : 30 Oct 2022 13:31 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్‌ డోర్సే మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని తేనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పని పూర్తయినట్లు సమాచారం. కొత్త వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేశారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేటుగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గత మంగళవారం ఓ బ్లాగ్‌లో డోర్సే స్వయంగా పేర్కొన్నారు. ఒకసారి ఈ పరీక్షలు పూర్తయితే, దాని పబ్లిక్‌ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

బ్లూస్కై ‘అథెంటికేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రోటోకాల్‌ (AT Protocol)’పై పనిచేస్తుందని డోర్సే తెలిపారు. అంటే ఒక్క సైట్‌ ద్వారా కాకుండా పలు సైట్ల ద్వారా దీన్ని నడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తొలుత ఈ ప్రాజెక్టును బ్లూస్కై పేరుతో ప్రారంభించామని.. చివరకు కంపెనీ పేరు కూడా దాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్లూస్కై పేరు విస్తృతమైన అవకాశాలకు సూచిక అని వివరించారు. సామాజిక మాధ్యమాల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని, యూజర్ల డేటాను హస్తగతం చేసుకోవాలనుకునేవారికి బ్లూస్కై ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని డోర్సే తెలిపారు. పరోక్షంగా ట్విటర్‌కు పోటీగానే ఆయన దీన్ని తీసుకొస్తున్నట్లుగా టెక్‌ నిపుణుల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గత ఏడాది నవంబరులో జాక్‌ డోర్సే ట్విటర్‌ సీఈఓ పదవిని వీడి పరాగ్‌ అగర్వాల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కొంతకాలం తర్వాత బోర్డు నుంచి కూడా వైదొలిగి ట్విటర్‌తో ఉన్న సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నారు.  ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడాన్ని తొలుత డోర్సే స్వాగతించారు. ట్విటర్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా కొనసాగడం కంటే.. దాన్ని ప్రైవేటుగా మారిస్తేనే మేలు జరుగుతుందని తాను భావిస్తున్నట్లు అప్పట్లో చెప్పారు. కానీ, ట్విటర్‌లో తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు