Jack Ma: టోక్యో యూనివర్శిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా జాక్‌మా..!

చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురై అలీబాబా గ్రూప్‌ను వదులుకొన్న జాక్‌ మా ఇప్పుడు సరికొత్త ఉద్యోగం ప్రారంభించనున్నారు. ఓ ప్రముఖ కళాశాలలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా చేరనున్నారు.  

Updated : 01 May 2023 12:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)కు చెందిన టెక్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ (Alibaba Group) వ్యవస్థాపకుడు జాక్‌మా(Jack Ma) తాజాగా కొత్త కెరీర్‌ ప్రారంభించనున్నారు. జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయం(University of Tokyo) తమ కళాశాలలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా చేరాలని ఆయన్ని ఆహ్వానించింది. ఈ విషయాన్ని సదరు విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపినట్లు ‘నిక్కీ ఆసియా’ పత్రిక పేర్కొంది. ఆయన నియామక వ్యవధి ఈ ఏడాది అక్టోబర్‌తో ముగుస్తుంది. అయితే.. దీనిని వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించవచ్చని విశ్వవిద్యాలయం పేర్కొంది. కీలకమైన రీసెర్చి థీమ్‌లకు సలహాలు ఇవ్వడం, మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ స్టార్టప్‌లపై తరగతులు చెప్పడం వంటివి జాక్‌మా చేయనున్నారు.

దాదాపు ఏడాదిన్న తర్వాత జాక్‌మా గత నెలలో చైనాకు తిరిగి వచ్చారు. ఈ పరిణామాలను చైనాలోని వ్యాపార వర్గాలు సానుకూల అంశాలుగా చూశాయి. ఈ నేపథ్యంలో టోక్యో విశ్వవిద్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. తాజాగా జాక్‌మా పనిచేయనున్న టోక్యో కాలేజీని 2019లో విశ్వవిద్యాలయానికి , అంతర్జాతీయ పరిశోధన సంస్థలకు మధ్య వారధిగా పనిచేసేందుకు ఏర్పాటు చేశారు. 

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. తర్వాత ప్రభుత్వం యాంట్‌ గ్రూప్‌పై చర్యలు చేపట్టింది. కొన్ని నెలలపాటు బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్‌మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు అరుదు. జపాన్‌, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉన్నట్లు ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని