Steel Man of India: ‘స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ ఇకలేరు

టాటా స్టీల్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న జంషేడ్‌ జె ఇరానీ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచారు.

Updated : 23 Nov 2022 10:55 IST

జంషేడ్‌పూర్‌: ‘స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన జంషేడ్‌ జె ఇరానీ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జంషేడ్‌పూర్‌లోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు టాటా స్టీల్ యాజమాన్యం ప్రకటించింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

టాటా స్టీల్‌తో జె.జె.ఇరానీకి 40 ఏళ్ల అనుబంధం ఉంది. కంపెనీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2011 జూన్‌లో పదవీ విరమణ పొందారు. 1936 జూన్‌ 2న నాగ్‌పూర్‌లో జీజీ ఇరానీ, ఖోర్షెడ్‌ ఇరానీ దంపతులకు జంషేడ్‌ ఇరానీ జన్మించారు. నాగ్‌పూర్‌ సైన్స్‌ కాలేజ్‌లో 1956లో బీఎస్సీ పూర్తి చేశారు. 1958లో నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి జియాలజీలో ఎంఎస్సీ పట్టా పొందారు. అనంతరం ఆయన యూకేలోని షెఫీల్డ్‌ వర్సిటీకి జేఎన్‌ టాటా స్కాలర్‌గా వెళ్లారు. అక్కడ 1960లో మెటాలర్జీలో మాస్టర్స్‌ పూర్తిచేశారు. తర్వాత అదే సబ్జెక్టులో 1963లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తొలుత అక్కడే బ్రిటిష్‌ ఐరన్ అండ్‌ స్టీల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌లో కొంతకాలం ఉద్యోగం చేశారు.

భారత్‌పై ఉన్న ప్రేమతో స్వదేశానికి తిరిగొచ్చిన జె.జె.ఇరానీ అప్పటి ‘టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (ఇప్పుడు టాటా స్టీల్‌)’లో చేరారు. తొలుత రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేశారు. 1978లో జనరల్‌ సూపరింటెండెంట్‌గా, 1979లో జనరల్‌ మేనేజర్‌గా, 1985లో అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. తర్వాత 1988లో టాటా స్టీల్‌ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1992లో ఎండీగా బాధ్యతలు స్వీకరించి 2011లో రిటైరయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. 1981లో ఆయన టాటా స్టీల్ బోర్డులో చేరారు. 2001 నుంచి నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. టాటా సన్స్‌, టాటా మోటార్స్‌, టాటా టెలీసర్వీసెస్‌ సంస్థలకూ ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని