Sony Honda Mobility: ఒక్కటైన దిగ్గజాలు.. 2026లో ‘సోనీ హోండా మొబిలిటీ’ కారు

రెండు వేర్వేరు రంగాలకు చెందిన రెండు దిగ్గజ కంపెనీలు ఒక్కటయ్యాయి. సోనీ, హోండా ఇకపై విద్యుత్తు కార్లను విడుదల చేయనున్నాయి. ఈ మేరకు అధికారికంగా గురువారం కంపెనీని ప్రారంభించాయి.

Published : 13 Oct 2022 15:23 IST

టోక్యో: జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ కంపెనీలు హోండా, సోనీ కలిసి ఏర్పాటు చేసిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ ‘సోనీ హోండా మొబిలిటీ’ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. 2025లో కార్ల విక్రయాలు ఆరంభం కానున్నట్లు కొత్త కంపెనీ సీఈఓ యసుహిదే మిజునో వెల్లడించారు. 2026 నాటికి తొలుత అమెరికాలో కార్లను వినియోగదారులకు అందజేస్తామని తెలిపారు. సోనీ గ్రూప్‌ కార్పొరేషన్‌, హోండా కలిసి 50-50 భాగస్వామ్యంలో సంయుక్త కంపెనీని నెలకొల్పనున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఫలితంగా వాహన, మొబిలిటీ, విక్రయాల్లో అనుభవం ఉన్న హోండా.. ఇమేజింగ్‌, నెట్‌వర్క్‌, సెన్సార్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో నైపుణ్యం ఉన్న సోనీ ఒక్క దగ్గరకు చేరినట్లైంది.

అమెరికాలోని హోండా ప్లాంట్‌లో కార్ల తయారీ జరగనుంది. ధర, ప్లాట్‌ఫామ్‌, బ్యాటరీ.. వంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, తొలుత ప్రత్యేక మోడల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీన్ని పెద్ద ఎత్తున విక్రయానికి ఉంచే అవకాశం లేదని తెలుస్తోంది. విద్యుత్తు వాహనాలకు అమెరికాలో ఆదరణ అధికంగా ఉన్నందునే తొలుత అక్కడ విడుదల చేస్తున్నట్లు మిజునో తెలిపారు. తర్వాత జపాన్‌, ఐరోపా.. ఇలా వరుసగా అంతర్జాతీయంగా విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే, దీనికి నిర్దిష్టమైన కాలపరిమితి ఏమీ విధించుకోలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని