Jeff Bezos: బాస్‌లు ఆ పని చేయొద్దు.. జెఫ్‌ బెజోస్ ప్రియురాలి సూచన ఇదే..!

అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు  లారెన్‌ సాంచేజ్‌ ఓ కీలక సూచన చేశారు. సమావేశాల్లో బాస్‌లు కొన్ని పనులు చేయకూడదని.. ఈ విషయాలు బెజోస్‌ నుంచి నేర్చుకున్నానని చెప్పారు.

Published : 01 Feb 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన.. బిజినెస్‌లో మెలకువల గురించి ఎన్నో విషయాలు చెబుతుంటారని ఆయన ప్రియురాలు లారెన్‌ సాంచేజ్‌ తెలిపారు. మీటింగ్‌లు ఎలా నిర్వహించాలి? అనే విషయాలను తెలియజేస్తారని.. అది తనకో మాస్టర్‌ క్లాస్‌లా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సమావేశాల్లో బాస్‌లు ఎలా ఉండకూడదో బెజోస్‌ చెప్పిన విషయాన్ని బహిరంగపరిచారు. రోజువారీ కార్యకలాపాలు, జెజోస్‌తో అనుబంధం వంటి విషయాలపై ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్‌ సాంచేజ్‌ ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

‘జెఫ్‌తో జీవించడం అంటే ప్రతిరోజు ఒక మాస్టర్‌ క్లాసే. మేనేజిమెంట్‌ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మీటింగ్‌ల సమయంలో బాస్‌లు తొలుత మాట్లాడకూడదు. ఇతరులు బాస్‌ అభిప్రాయాలకు తలొగ్గకుండా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. సమావేశం ముగిసే వరకూ బాస్‌లు మాట్లాడకుండా ఉండాలి’ అని జెఫ్‌ బెజోస్‌ చెప్పినట్లు వివరించారు.

అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి 2021లో వైదొలిగిన జెఫ్‌ బెజోస్‌.. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అంతరిక్ష విమానయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’తోపాటు వాషింగ్టన్‌ పోస్ట్‌ వార్తాపత్రికకు అధినేతగా కొనసాగుతున్నారు. అయితే, జెఫ్‌ బెజోస్‌కు రెండు దశాబ్దాల క్రితమే మెకెంజీ స్కాట్‌తో వివాహం జరిగింది. ఇటీవలే తమ దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతూ మెకెంజీ స్కాట్‌తో బెజోస్‌ విడాకులు తీసుకున్నారు. తర్వాత అమెరికన్‌ యాంకర్‌ అయిన లారెన్‌ సాంచేజ్‌తో బెజోస్‌ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని