Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌ కఠిన నిర్ణయం.. 60 శాతం ఉద్యోగులు సెలవుల్లోకి!

ఉద్యోగులపై జెట్‌ ఎయిర్‌వేస్‌ బాంబుు పేల్చింది. కంపెనీలో పనిచేస్తున్న 60 శాతం మంది ఉద్యోగులకు సెలవులపై ఇంటికి పంపనుంది. మిగిలిన వారికీ వేతనంలో కోత విధించనుంది.

Published : 18 Nov 2022 18:00 IST

దిల్లీ: కమర్షియల్‌ విమాన కార్యకలాపాలను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తుందనుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులపై బాంబు పేల్చింది. సీనియర్‌ మేనేజర్లు సహా కంపెనీలో పనిచేస్తున్న 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. సెలవుల్లో ఎలాంటి వేతనమూ ఆ కంపెనీ చెల్లించబోదు. మిగిలిన ఉద్యోగులకూ 50 శాతం వరకు వేతనంలో కోత విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఆర్థికంగా కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. జలాన్- కర్లాక్‌ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది నుంచి తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించాలని నూతన యాజమాన్యం భావించింది. అయితే, ఈ కన్సార్షియం రూపొందించిన కంపెనీ పునరుద్ధరణ ప్రణాళికపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులు, సిబ్బంది సంఘం నేషనల్‌ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT)ను ఆశ్రయించారు. దీంతో ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని గత నెల కన్సార్షియాన్ని NCLAT ఆదేశించింది.

ఈ నేపథ్యంలో జలాన్‌-కర్లాక్‌ కన్సార్షియం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. NCLT ప్రక్రియ ప్రకారం నిర్ణయించిన గడువు కంటే ఎయిర్‌లైన్స్‌ అప్పగింత ఎక్కువ సమయం తీసుకుంటోందని, ఇప్పటికీ తమ చేతికి అందలేదని తెలిపింది. ఎయిర్‌లైన్‌ భవిష్యత్‌ను కాపాడడంలో భాగంగా నిధులను ఆదా చేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రకటనలో తెలిపింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుబోతున్నారనేది అందులో పేర్కొన్నప్పటికీ.. ఉద్యోగులకు వేతనం లేని సెలవులు, వేతనంలో కోత వంటివి అందులో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పట్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు. మరోవైపు విమానాల ఆర్డరు కోసం రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవనీ తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని