Dhanteras: ధన్‌తేరాస్‌ కొనుగోళ్లలో వృద్ధి అంతంతమాత్రమే.. పరిశ్రమ వర్గాల అంచనా!

Dhanteras: ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈసారి ధన్‌తేరాస్‌ విక్రయాల్లో భారీ స్థాయిలో ఉండకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొనుగోళ్లు గత ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేశాయి.

Published : 20 Oct 2022 00:30 IST

ముంబయి: ఈసారి ధన్‌తేరాస్‌కు నగలు, వజ్రాభరణాల కొనుగోళ్లలో పెద్దగా వృద్ధి ఉండకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం ఎగబాకి జీవన వ్యయాలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నాయి. అలాగే గత ఏడాది కొనుగోళ్లు పెద్ద ఎత్తున నమోదు కావడం కూడా మరో కారణమని వివరించాయి. బంగారం ధరలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. విక్రయాలు మాత్రం భారీ ఎత్తున ఉండకపోవచ్చునని తెలిపాయి. ధన్‌తేరాస్‌కు బంగారం లేదా వెండిని కొనడం భారతీయ సంప్రదాయంలో శుభసూచకంగా భావిస్తారు.

కరోనా నేపథ్యంలో 2020లో కొనుగోళ్లు పూర్తిగా పడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు వివాహాలు, ఇతర శుభకార్యాలు కూడా వాయిదా పడ్డాయి. 2021 ధన్‌తేరాస్‌ నాటికి పరిస్థితులు చక్కబడడంతో నగలు, వజ్రాభరణాల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు కరోనా పూర్వస్థాయిని కూడా మించిపోయాయి. దసరా నుంచే ప్రారంభమయ్యే ముందస్తు బుకింగ్‌లు సైతం ఈసారి ఆశించిన స్థాయిలో లేవని ‘‘ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెల్లరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌’’ ఛైర్మన్‌ ఆశీష్‌ తెలిపారు. బంగారం ధరల్లో దిద్దుబాటు, అనుకూల వాతావరణ పరిస్థితులు, పండుగ సీజన్ వంటి సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణం సెంటిమెంటును దెబ్బతీసే అవకాశం ఉందని ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రాంతీయ సీఈఓ సోమసుందరం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని