Rs 2,000 నోట్ల ఉపసంహరణ.. బంగారం కొనుగోలుకు ఆరా..!

రూ.2000నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించిన తర్వాత బంగారం కొనుగోళ్లపై (Gold Purchase) ప్రజలు ఆరా తీస్తున్నట్లు వెల్లడైంది.

Published : 21 May 2023 20:31 IST

ముంబయి: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 23 నుంచి తమవద్ద ఉన్న నోట్లను డిపాజిట్‌ చేయడమో/ మార్చుకోవడమో చేయాలని వినియోగదారులకు ఆర్‌బీఐ సూచించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే జ్యువెలరీ షాపులకు (Gold Purchase) ఎంక్వైరీలు పెరిగాయట. రూ.2000 నోటుతో బంగారం కొనుగోలు చేయవచ్చా? అని ఎంతో మంది కస్టమర్లు ఆరా తీస్తున్నారని బంగారం వర్తక సంఘం-జీజేసీ వెల్లడించింది. అయితే, 2016లో నోట్ల రద్దు (Demonetisation) మాదిరి పరిస్థితి ఇప్పుడు లేదని.. భయంతో ఎవరూ బంగారం కొనడం లేదని తెలిపింది.

‘రూ.2000నోట్లతో బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చా..? అనే ఎంక్వైరీలు చాలా పెరిగాయి. శనివారం మాత్రం బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అయినప్పటికీ కేవైసీ నిబంధనలు కఠినంగా ఉన్నందున వాస్తవంగా తక్కువ కొనుగోళ్లు జరుగుతున్నాయి’ అని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) ఛైర్మన్‌ సయామ్‌ మెహ్రా వెల్లడించారు. నోట్లను డిపాజిట్‌/ మార్చుకోవడానికి ఆర్‌బీఐ నాలుగు నెలల సుదీర్ఘ సమయం ఇచ్చినందుకు ఎవరూ భయాందోళనతో కొనుగోలు చేయడం లేదన్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ వచ్చిన తర్వాత జ్యువెలరీ రంగంలోనూ పెద్ద నోట్ల వినియోగం తగ్గిందని.. అందుకే రూ.2వేల నోట్ల ఉపసంహరణ ఈ రంగంపై పెద్దగా ప్రభావం చూపదని అన్నారు.

పీఎన్‌జీ జ్యువెలర్స్‌ ఛైర్మన్‌, ఎండీ సౌరభ్‌ గాడ్గిల్‌ మాట్లాడుతూ.. ‘రూ.2వేల నోట్లను తీసుకొని అధిక ధరకు బంగారం అమ్మడం కేవలం అసంఘటిత రంగంలోనే జరుగుతుంది. అటువంటి వాటినుంచి సంఘటిత రంగం ఎంతో దూరంగా ఉంది’ అని అన్నారు. ఆర్‌బీఐ ప్రకటన తర్వాత కొంతమంది ఆరా తీస్తున్నప్పటికీ కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ఏమీ రావడం లేదని.. సోమవారం నుంచి పెరగవచ్చని నెమీచంద్‌ బామ్లవా అండ్‌ సన్స్‌ ప్రతినిధి వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఎంతోమంది బంగారం వైపు మొగ్గుచూపారని.. ఈసారి మాత్రం ఎన్నో నిబంధనలు ఉన్నాయని కామ్‌ట్రెండ్జ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని