Jio 5G smartphone: జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉండొచ్చు?

కోట్లాది మంది 2జీ, 3జీ వినియోగదారులను 4జీలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్‌.. జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్‌ఫోన్‌ను తీసుకొచ్చింది....

Updated : 27 Sep 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోట్లాది మంది 2జీ, 3జీ వినియోగదారులను 4జీలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్‌.. జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా దాని ధరను రూ.4,499గా నిర్ణయించింది. ఇటీవల జరిగిన రిలయన్స్‌ వార్షిక సమావేశంలో 5జీ ఫోన్‌ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో సర్వత్రా ధరపై ఆసక్తి నెలకొంది.

గూగుల్‌తో కలిసి తయారు చేయనున్న ఈ జియోఫోన్‌ నెక్ట్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,000-12,000 మధ్య ఉండే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది. ఫోన్‌లో ఉపయోగిస్తున్న పరికరాల విలువ ఆధారంగా ధరను లెక్కగట్టింది. ప్రస్తుతం 4జీలో ఉన్న వినియోగదారులను 5జీకి మార్చడమే లక్ష్యంగా జియో దీన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. వచ్చే నెల 5జీ సేవలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 5జీ నెట్‌వర్క్‌ కొంత విస్తరించిన తర్వాత రిలయన్స్‌ తమ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దీంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం క్వాల్‌కామ్‌, శామ్‌సంగ్‌, సింటియంట్‌ సహా కొరియా, చైనాకు చెందిన కంపెనీలతో జియో భాగస్వామ్యం కుదుర్చుకొంది.

2023-2024 నాటికి జియో 5జీ వినియోగదారుల సంఖ్య 1.2 కోట్లకు, 2024-25 నాటికి 2.1 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ స్పార్క్‌ క్యాపిటల్‌ అంచనా వేసింది. 4జీ ధరలతో పోలిస్తే 5జీ సేవల ధరలు 20 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని